ప్రజాశక్తి - అద్దంకి
విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ ఉద్యమం బషీరబాగ్‌లో జరిపిన పోలీసు కాల్పులలో మృతి చెందిన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌లకు స్థానిక సుందరయ్య భవన్‌లో సిపిఎం ఆధ్వర్యంలో సంస్మరణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ అప్పటి విద్యుత్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంస్కరణ దూకుడు ఆపిందని అన్నారు. ఆ తర్వాత మూడు, నాలుగు ప్రభుత్వాలు మారినా విద్యుత్ ఛార్జీల పెంపుజోలికి వెళ్లలేదని అన్నారు. కానీ నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి విద్యుత్ ఛార్జిలను విభిన్న సుంకాల పేరుతో వేల రూపాయల బిల్లులు పెంచారన్నారు. విద్యుత్ రంగంలో లాభర్జన ద్యేయంగా సంస్కరణలు వస్తున్నాయని అన్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, పి రామాంజనేయులు, విజయకుమార్, రాజు హనుమంతరావు, ప్రమీల పాల్గొన్నారు.










