Aug 16,2023 23:57

సదస్సులో మాట్లాడుతున్న పలివెల వీరబాబు

ప్రజాశక్తి - పెద్దాపురం
భారత స్వాతంత్రోద్యమంలో అమరుల త్యాగాల వారసత్వాన్ని కొనసాగిచడమే నిజమైన దేశభక్తి అని సిఐటియు నాయకులు పలివెల వీరబాబు అన్నారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు అధ్యక్షతన జరిగిన 'జాతీయోద్యమం-కర్తవ్యాలు-ఆశయాలు' అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కేంద్రంలో మోడీ బడా కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా పాలన సాగిస్తున్నారన్నారు. బిజెపి పాలనలో నిరుద్యోగం, పేదరికం అదుపు లేకుండా పెరుగుతున్నాయన్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా యన్నారు. గిరిజనులు, దళితులు, మైనారిటీలపై దాడులు నిత్య కృత్యమయ్యాయన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నాయన్నారు. దేశ ప్రజల మధ్య ఐక్యతకు చిచ్చు పెట్టే విధంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. వలసవాద పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడినట్లే మతోన్మాదానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ విలువల పరిరక్షణకు, లౌకిక, ప్రజాస్వామ్య, స్వేచ్ఛ, స్వాతంత్య్రాల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ సదస్సులో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు కరణం ప్రసాదరావు, సిరపరపు శ్రీనివాస్‌, గడిగట్ల సత్తిబాబు, డి.సత్యనారాయణ, మరిడియ్య, డి.కృష్ణ, టి.గంగ, స్వామి, పద్మ, క్రాంతి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.