Aug 04,2023 19:08

దేవనకొండలో నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - దేవనకొండ
పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం జీవితాన్ని త్యాగం చేసిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే ఈశ్వర్‌ రెడ్డి, సిపిఎం జిల్లా మాజీ కార్యదర్శి షడ్రక్‌ స్ఫూర్తితో కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం, సాగు, తాగునీరు, మౌలిక సదుపాయాల కోసం పోరాడతామని సిపిఎం జిల్లా నాయకులు బి.వీరశేఖర్‌ తెలిపారు. శుక్రవారం దేవనకొండలోని సిఐటియు కార్యాలయంలో ఈశ్వర్‌ రెడ్డి 44వ వర్థంతి, షడ్రక్‌ 3వ వర్థంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు సిపిఎం నాయకులు యూసుఫ్‌ బాషా, బండ్లయ్యలు పూలమాలలు వేశారు. సిపిఎం మండల కమిటీ సభ్యులు అశోక్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీరశేఖర్‌ మాట్లాడారు. ప్రజాసేవకే జీవితాలను త్యాగం చేసిన ఈశ్వర్‌ రెడ్డి, షడ్రక్‌ స్ఫూర్తితో ఈ ప్రాంతాభివృద్ధి కోసం పోరాడదామని తెలిపారు. పేదలకు భూమి, ఇల్లు, ఇళ్ల స్థలాల కోసం ఈశ్వర్‌ రెడ్డి, షడ్రక్‌లు పోరాటాలు చేసి, పేదలకు భూములు పంచిన చరిత్ర వారిదని చెప్పారు. అట్టడుగు వర్గాలైన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తూ భూస్వామ్య, పెత్తందారి వ్యవస్థపై పోరాటాలు చేశారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల కోసం, రైతుల అభ్యున్నతి కోసం పోరాటమే వారికి నిజమైన నివాళి అని చెప్పారు. జిల్లా సమగ్రాభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల సాధన, దేవనకొండ మండలంలో ప్రతి ఎకరాకూ నీరు అందించాలని సిపిఎం ఉద్యమిస్తోందని, ఈ పోరాటాల్లో ప్రజలు కలిసి రావాలని కోరారు. సిపిఎం కార్యకర్తలు రంగన్న, రాముడు, రాయుడు, రంగడు, సుధాకర్‌, బలరాముడు, తిమ్మప్ప, విశ్వనాథ్‌ పాల్గొన్నారు.