
ప్రజాశక్తి-విజయనగరం : పోలీసు అమరుల త్యాగాలు వృథా కావని డిఎస్‌పి ఆర్‌గోవిందరావు అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ దినం సందర్భంగా విజయనగరం పోలీసుశాఖలో పని చేసి, మావోయిస్టులతో పోరాడి మృతి చెందిన పోలీసు అమరవీరుల కుటుంబాల నివాస గృహాలను, వారు విద్యాభ్యాసం చేసిన పాఠశాలలను పోలీసు అధికారులు, సిబ్బంది బుధవారం సందర్శించారు. జిల్లా ఎస్‌పి ఎం.దీపిక ఆదేశాలతోడిఎస్‌పి ఆర్.గోవిందరావు, విజయనగరం 1వ పట్టణ సిఐ బి.వెంకటరావు, 2వ పట్టణ సిఐ ఎన్‌హెచ్ విజయ ఆనంద్, ఎస్.కోట సిఐ ఎస్.బాలసూర్యారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పోలీసు అమ రులు షేక్ ఇస్మాయిల్, చిట్టిపంతుల చిరంజీవిరావు ఇళ్లను సందర్శించి, వారు విద్యాభ్యాసం చేసిన పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి మాట్లాడుతూ - మావోయిస్టు దాడిలో మరణించిన షేక్ ఇస్మాయిల్ చరిత్ర రాబోయే తరాలకు తెలియజేయాలనే ఉద్ధేశ్యంతో నేడు కస్పా హై స్కూలును సందర్శించామన్నారు. చిట్టి పంతుల చిరంజీవివరావు చదువుకున్న ఎస్.కోట మండలం కొట్టాం జెడ్‌పి హైస్కూల్‌ను డిఎస్‌పి సందర్శించారు. వీరి త్యాగాలు వృథా పోకుండా మంచి లక్ష్యాలతో ఉన్నతంగా ఎదగాలని, సమాజానికి, కన్నవారికి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో 2వ పట్టణ సిఐ ఎన్.హెచ్.విజయ ఆనంద్, ఎస్.కోట సిఐ ఎస్.బాలసూర్యారావు, ఎస్‌ఐలు, భాస్కరరావు, షేక్ శంకర్, జె.తారకేశ్వరరావు, పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.