Oct 21,2023 20:58

అమరుల స్థూప వద్ద పుష్పగుచ్ఛం పెట్టి నివాళ్లు అర్పిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌ : సమాజ రక్షణ కొరకు ప్రాణత్యాగం చేసిన పోలీసు అమర వీరుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవానికి కలెక్టర్‌ హాజరై నివాళులు అర్పించారు. ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌, జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు, ఎఎస్‌పి ఒ.దిలీప్‌కిరణ్‌, డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పోలీసు అమర వీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళ్లు అర్పించారు. అనంతరం కలెక్టరు మాట్లాడుతూ దేశ భద్రతకు ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు వీరులను స్మరించుకొంటూ ప్రతి ఏటా అక్టోబరు 21న అమరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. విధి నిర్వహణలో అనేక మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారన్నారు. పోలీసులు విధి నిర్వహణలో రాజీలేని పోరాటాలకు జరిపి తీవ్రవాద చర్యలను ఎదిరించడంలోనూ, శాంతిభద్రతల పరిరక్షణలోను కీలకమైన పాత్రను పోషిస్తూనే ఉన్నారన్నారు. జిల్లా పోలీసుశాఖలో ఇప్పటి వరకు శాంతి భద్రతల పరిరక్షణలో ఒకరు, తీవ్రవాద ప్రతీకార దాడులలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీసులు నేడు భౌతికంగా మన మధ్య లేకున్నా, పోలీసుశాఖకు వారు చేసిన సేవలు శ్లాఘనీయని, వారి కుటుంబాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొమరాడ పోలీసు స్టేషనులో ఎస్‌ఐగా పనిచేస్తూ విధినిర్వహణలో అమరులైన ముద్దాడ గాంధీ సతీమణి మనోరంజని, వారి కుటుంబ సభ్యులను, కురుపాం పోలీసు స్టేషనులో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ విధి నిర్వహణలో అమరులైన బి.శ్రీరాములు సతీమణి ప్రమీల, వారి కుటుంబ సభ్యులను గౌరవించి, వారు సమాజానికి చేసిన త్యాగాలను స్మరించుకొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ. పి.వి.ఆర్‌.కె. కుమార్‌ పెరేడ్‌ కమాండర్‌ గా వ్యవహరించారు.
సాలూరు: పోలీసు అమరులకు స్థానిక అర్బన్‌, రూరల్‌ పోలీసులు ఘనంగా నివాళ్లు అర్పించారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు గల కీర్తిశేషులు సిఐ ముద్దాడ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రూరల్‌ సిఐ ఎస్‌.ధనంజయరావు, ఎస్‌ఐ ప్రయోగ మూర్తి, పాచిపెంట ఎస్‌ఐ ఫకద్దీన్‌, టౌన్‌ సిఐ సిహెచ్‌.శ్రీనివాసరావు నివాళులర్పించారు. ముద్దాడ గాంధీ విధి నిర్వహణలో చేసిన సేవలను కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు స్థానిక పోలీసులు పాల్గొన్నారు.