ప్రజాశక్తి-బాపట్ల: చెరుకుపల్లి మండలం ఉప్పాలవారి గ్రామంలో జరిగిన సంఘటన జిల్లాలో మరోసారి పునరావృతం కాకుండా చూడాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ రంజిత్ బాషాను, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వకూల్ జిందాల్‌ను ఆయన కలిశారు. చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెంలో జరిగిన సంఘటన చాలా బాధను మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థి అమర్‌నాథ్ గౌడ్‌ను దారికాసి హతమార్చడం దుర్మార్గమన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దోషులను వేగంగా శిక్షించాలని ఆయన కోరారు. నేరానికి పురిగొల్పిన వారిని దోషులుగా నిర్ధారించి చార్జీషీట్‌లో వారి పేరును చేర్చాలని ఎస్పీని కోరారు. బాధిత కుటుంబానికి ఇస్తానన్న హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్, జిల్లా గౌరవ అధ్యక్షుడు మద్దిబోయిన తాతయ్య, యువజన కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రం ద్వారకా శ్రీను, బాపట్ల, వేమూరు నియోజవర్గాల అధ్యక్షులు పిన్నిబోయిన వెంకటేశ్వర్లు, మురాల వాసుదేవ్, జిల్లా న్యాయ సలహాదారుడు నటరాజన్, జిల్లా కార్యదర్శి మారం రవికుమార్, పట్టణ యువజన అధ్యక్షుడు ఉప్పలదిన్నె గోపీనాథ్, పట్టణ కార్యదర్శి భాను పాల్గొన్నారు.










