Mar 17,2023 00:18
అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పిస్తున్న జిల్లా కలెక్టర్‌ కె విజయకృష్ణన్‌, జేసీ శ్రీనివాసులు

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: అమరజీవి పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్‌ కె విజయ కష్ణన్‌, జేసీ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ నివాళి అర్పించారు. గురువారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ కె విజయ కష్ణన్‌, జేసీ శ్రీనివాసులు, జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ నివాళి అర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయుడని, అప్పటిలో మద్రాస్‌ రాష్ట్రంలో వున్న తెలుగు మాట్లాడే పదకొండు జిల్లాలను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో పొట్టి శ్రీరాములు మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి పట్టు వీడకుండా తన నిరాహార దీక్షను కొనసాగించి రాష్ట్ర సాధన కోసం అమరుడయ్యారని గుర్తు చేశారు. ఆయన త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలు మరవరాదని అన్నారు. యువత మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
అద్దంకి: అమరజీవి పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా గురువారం ఆర్యవైశ్య ప్రముఖులు పట్టణంలోని పాత బస్టాండ్‌ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్య సంఘం బాధ్యులు పోకూరి శ్రీనివాసరావు ఆధ్వర్యం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరకొండ ప్రస న్నాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్‌ కోట శ్రీనివాస్‌కుమార్‌, భాస్కర్‌ సప్లర్సు అధినేత గార్లపాటి శ్రీనివాసరావు, విగ్రహానికి సహకరించిన దాతలు తదితరులు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్‌ ఆఫ్‌ సింగరకొండ ఆధ్వర్యంలో..
రోటరీ క్లబ్‌ ఆఫ్‌ సింగరకొండ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా పాత బస్టాండ్‌ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి రోటరీ బాధ్యులు సందిరెడ్డి శ్రీనివాసరావు, చిన్ని మురళీకృష్ణ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రోటరీ బాధ్యులు సభ్యులు ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు.