Nov 10,2022 23:27

ప్రజాశక్తి - ఏలూరు
        మహిళల సమస్యలపై నిరంతరం పోరాడిన నేత అమరజీవి ఐద్వా నేత జి.విజయలక్ష్మి అని సిఐటియు నాయకులు పి.కిషోర్‌ కొనియాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి ఐద్వా పూర్వపు కార్యదర్శి జి.విజయలక్ష్మి రెండో వర్ధంతి సభ ఐద్వా జిల్లా కన్వీనర్‌ పి.హైమావతి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో సిఐటియు నాయకులు పి.కిషోర్‌ మాట్లాడుతూ మహిళల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఐద్వా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీకి సుదీర్ఘకాలం కార్యదర్శిగా పనిచేశారని గుర్తు చేశారు. ఆమె పని చేసిన కాలంలో జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న మద్యం, తాగునీరు, తదితర సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. మహిళల సమస్యలు పరిష్కరించడం కోసం ఐద్వా జిల్లా కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న మహిళా ఉచిత న్యాయ సహాయ కేంద్రం నిర్వహించడంలో కీలకపాత్ర వహించారన్నారు. మహిళలపై ఎక్కడ ఆచ్యాచారాలు, దాడులు జరిగిన వెంటనే స్పందించి ఆందోళన చేపట్టే వారని తెలిపారు. అలాంటి మహిళా నేతను కోల్పోవడం బాధాకరమన్నారు. విజయలక్ష్మి మృతి ఐద్వా జిల్లా ఉద్యమానికి తీరని లోటన్నారు. ముందుగా విజయలక్ష్మి చిత్రపటానికి హైమావతి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఐద్వా కార్యకర్తలు విజయలక్ష్మికి జోహార్లు అర్పిస్తూ ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు జి.శారద, టి.సుకన్య, రమణమ్మ, ఫాతిమా, భాగ్యలక్ష్మి, సత్యవతి, అనిత పాల్గొన్నారు.