
ప్రజాశక్తి - అమరావతి : వైసిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్రను అమరావతి మండలంలో శుక్రవారం నిర్వహించారు. యాత్రను ధరణికోట జెబి గార్డెన్ వద్ద రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించగా అనంతరం అమరావతిలోని రథం సెంటర్‌లో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందించడంతోపాటు వారికి రాజకీయ ప్రాధాన్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని, విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి ప్రతిఇంటికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. వైసిపిని 2024లోనూ అధికారంలోకి తీసుకురావడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నియోజకవర్గాన్ని ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేసిన శంకరరావును మళ్లీ గెలిపించాలని కోరారు. రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు, సినీ నటుడు ఆలీ మాట్లాడుతూ జర్నలిస్టుల చిరకాల కోరికైన ఇళ్ల స్థలాల పంపిణీకి సిఎం శ్రీకారం చుట్టారన్నారు. గత ప్రభుత్వాలకంటే మెరుగ్గా ముస్లిమ్ మైనార్టీలను రాజకీయంగా వైసిపి ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, వారంతా జగన్‌కు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగాం సురేష్, బీదా మస్తాన్‌రావు, మోపిదేవి వెంకట రమణారావు, వైసిపి జిల్లా అధ్యక్షులు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవరప్రసాదరావు, నియోజకవర్గ పరిశీలకులు స్వామి నాయుడు పాల్గొన్నారు.
ఒపిఎస్‌ను అమలు చేయాలని వినతి
సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేయాలని ఎపిసిపిఎస్‌ఇఎ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పోలూరి పిచ్చయ్య, సలహాదారు టి.శరత్‌కుమార్ కోరారు. మండల కేంద్రమైన అమరావతిలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ ఒపిఎస్‌పై లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ఇటీవల పనిగట్టుకుని విషం కక్కు తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్ ప్రభుత్వాలకు భారం అనుకుంటే అది వృద్ధాప్యంలో తల్లిదం డ్రులను రోడ్డుపై వదిలేయడం లాంటిదేనని అన్నారు.