Aug 08,2021 12:52

విజయవాడ : అమరావతి రైతు, ప్రజా ఉద్యమం ప్రారంభించి 600 రోజులు పూర్తయిన సందర్భంగా తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడం శోచనీయమని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు అన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటనను విడుదల చేశారు. గ్రామ గ్రామాన వందలాది మంది పోలీసులను మోహరించి ప్రజలను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం, అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించి, శాంతియుతంగా ఆందోళన చేసుకునే అవకాశం కూడా కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమన్నారు. అంతే కాకుండా మీడియా పైన ఆంక్షలు పెట్టడం నిర్బంధానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.  అమరావతి ప్రాంత రైతులకు, ప్రజలకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అమరావతిని రాజధానిగా కొనసాగించి పరిపాలన మొత్తం ఇక్కడ నుండే సాగాలని ప్రజలు చేస్తున్న ఆందోళనకు సిపిఎం మద్దతు తెలుపుతోందని తెలిపారు. మూడు రాజధానులు పేరుతో వైయస్సార్ ప్రభుత్వం  మాట తప్పి ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం రాజధానికి నిధులు ఇవ్వకుండా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని, కనీసం అమరావతిని గుర్తించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని అన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని అమరావతి ప్రాంత రైతులు, ప్రజల న్యాయసమ్మతమైన కోర్కెల ఎడల మొండి వైఖరి ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. అమరావతి రైతు, ప్రజా ఉద్యమానికి సిపిఎం మరోసారి మద్దతు తెలుపుతోందని  పేర్కొన్నారు. నిర్బంధాన్ని విడనాడాలని, అరెస్టు చేసిన వారందరినీ  విడుదల చేయాలని, శాంతియుత ఆందోళనలకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.