Jun 11,2023 23:53

పాదయాత్ర చేస్తున్న రైతు కూలీ నారాయణ

తుళ్లూరు: అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా రైతు కూలీ చేపట్టిన పాదయాత్ర ఆదివారం సాయంత్రానికి తుళ్లూరు చేరుకుంది. రైతు కూలీ చింతల నారాయణకు రైతు దీక్షా శిబిరం వద్ద రైతులు, మహిళలు, రైతు కూలీలు స్వాగతం పలికారు. నంద్యాల జిల్లా చిన్న దేవళాపురం నుంచి అమరావతి రాజధానికి నారాయణ పాదయాత్ర చేశారు. భగభగ మండుతున్న ఎండల్లో 9 రోజుల పాటు సుమారు 300కిలో మీటర్లు పైగా నారాయణ పాదయాత్ర సాగింది. నారాయణ దీక్షా శిబిరంలో రైతులతో కలిసి జై అమరావతి నినాదాలు చేశారు. నంద్యాల జిల్లా చిన్న దేవళాపురానికి చెందిన తాను రైతు కూలీనని, అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమంపై ప్రభుత్వ అణచివేత, దౌర్జన్యం తనను కలచి వేసిందని నారాయణ చెప్పారు. ప్రధానంగా మహిళలపై లారీఛార్జి, అరెస్టులు చేయడం చూసి ఆవేదనకు గురయ్యా నన్నారు. 70 ఏళ్ల వయసులో పాద యాత్ర ఏమిటంటూ కుటుంబ సభ్యు లు అభ్యంతరపెట్టారని, అయి నా వెనుకాడలేదని అన్నారు. పాద యాత్ర నీకు అవసరమా.. అంటూ కొన్ని ప్రాంతాల్లో వైసిపికి చెందిన కొంతమంది అడ్డుకునేందుకు యత్నించారని చెప్పారు. ఈ సందర్భంగా నారాయణను రైతులు, మహిళలు సత్క రించారు. రాష్ట ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, కోర్టు తీర్పును గౌరవించాలని, బిల్డ్‌ అమరావతి - సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న దీక్షలు ఆదివారంతో 1272వ రోజుకు చేరాయి. తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరం, వెలగపూడి, మందడం, వెంకటపాలెం తదితర గ్రామాల్లో దీక్షలు సాగాయి. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా కొవ్వొత్తులు వెలిగించారు.