Dec 27,2022 22:52

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: విద్యార్థులలో సృజనాత్మకతకు పెద్దపీట వేస్తూ విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీసే ప్రక్రియలో భాగంగా అమరావతి బాలోత్సవం 5వ పిల్లల పండుగ ప్రారంభం కానున్నట్లు బాలోత్సవ కమిటీ సభ్యులు పెట్ల కామేశ్వరరావు తెలిపారు. కొండపల్లి క్రాంతి హైస్కూల్‌లో జరిగిన బాలోత్సవం కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కామేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివే వాతావరణం కావాలన్నారు. పిల్లల మానసిక వికాసాన్ని ప్రోత్సహించాలన్నారు. డాక్టర్‌ మోహన్‌రావు మెమోరియల్‌ హస్పటల్‌ డాక్టర్‌ మామిడి శీతారామారావు మాట్లాడుతూ ఉరుకులు పరుగుల జీవితంలో మానవ సంబంధాలు బలహీనపడ్డాయన్నారు. పిల్లలలో విశాల భావనలు పెరగటానికి అమరావతి బాలోత్సవాలు ఉపయోగపడతాయన్నారు. అమరావతి బాలోత్సవ్‌ కార్యదర్శి వెనిగళ్ళ మురళీమోహన్‌ మాట్లాడుతూ జనవరి 29, 30, 31 తేదీల్లో జరిగే బాలోత్సవంలో 41 అకడమిక్‌ 16 సాంస్కృతిక విభాగాలలో 57 రకాల పోటీలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాలు పియస్‌సియమ్‌ఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విజయవాడలో జరుగుతాయన్నారు. జనవరి 23లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు. వివరాలకు 6305954249 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ వెనిగళ్ళ అమ్మాజీ, జెవివి కొండపల్లి శాఖ అధ్యక్షులు యస్‌కె సర్దార్‌ సాహేబ్‌, కార్యదర్శి యస్‌ నాగరాజు పాల్గొన్నారు.