ప్రజాశక్తి-వన్‌టౌన్: అమరావతి బాలోత్సవం 5వ పిల్లల పండగ ఈ నెల 29, 30, 31 తేదీల్లో విజయవాడ కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నిర్వహించనున్నట్లు అమరావతి బాలోత్సవం అధ్యక్షులు ఎస్.పి.రామరాజు, ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో బాలోత్సవం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం రామరాజు మాట్లాడుతూ కరోనా అనంతరం ఈ సంవత్సరం జరిగే 5వ పిల్లల పండగలో 250 స్కూళ్ల నుండి 12 వేల మంది పిల్లలు పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు. 100 మంది న్యాయనిర్ణేతలు, 80 మంది ఆర్గనైజర్లు, 150 మంది వలంటీర్స్, 50 మంది బాలోత్సవ కమిటీ సభ్యులు ఈ బాలోత్సవ నిర్వహణలో భాగస్వాములవుతున్నారని వివరించారు. వీరితో పాటుగా ఇంజనీరింగ్ కాలేజికి చెందిన మరో 100 మంది లెక్చరర్స్, సిబ్బంది బాలోత్సవానికి సహకారం అందిస్తారని తెలిపారు. కొండలరావు మాట్లాడుతూ ఇప్పటికే ఎన్‌టిఆర్, కష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల పరిధిలోని 630 స్కూళ్లకు ఆహ్వానం పంపినట్లు తెలిపారు. కెబిఎన కళాశాల ప్రిన్సిపాల్ వంగల నారాయణరావు, పిఎస్‌సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల ట్రెజరర్ కొత్తమాసు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో రాణించాలంటే చదువులతో పాటుగా ఆటలు, పాటలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో కూడా పట్టు సాధించాల్సి ఉందని, అందుకు బాలోత్సవాలు వేదికగా ఉండటం అభినందనీయమని అన్నారు. ఈ సంవత్సరం జరిగే బాలోత్సవంలో 41 అకడమిక్, 16 సాంస్కతిక విభాగాలలో 57 రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి బాలోత్సవం ఉపాధ్యక్షులు గుమ్మా సాంబశివరావు, వెన్నా వల్లభరావు, కార్యదర్శి జ్యోత్స్న, పి.మురళీకృష్ణ, సాంబి రెడ్డి, పిఎస్‌సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జి.లక్ష్మీనారాయణ, ట్రెజరర్ కొత్తమాసు వెంకటేశ్వరరావు, కెబిఎన్ కళాశాల సెక్రటరీ తూనుగుంట్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ వంగల నారాయణరావు, పారిశ్రామికవేత్త బాయన వెంకట్రావు, యువి రామరాజు తదితరులు పాల్గొన్నారు.










