May 26,2023 23:36

ప‌ట్టాలు అందిస్తున్న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధానిలో సిఎం జగన్‌ తొలిసారిగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భారీగా ప్రజలను సమీకరించిన నేపథ్యంలో సిఎం పలు కీలక అంశాలపై మాట్లాడతారని వైసిపి నేతలు, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు భావించారు. అందుకు భిన్నంగా సిఎం ప్రసంగం మాత్రం సాదాసీదాగా సాగింది. చంద్రబాబు కంటే నరకాసురుడే నయం అనే విమర్శలు తప్ప రాజకీయ పరమైన అంశాలను పెద్దగా ప్రస్తావించలేదు. అమరావతి అభివృద్ధి ప్రస్తావనా కరువైంది. రైతులకు సంబంధించిన అంశాల ఊసేలేదు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన అంశాలు, ఇళ్ల కట్టిస్తే ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాలు, మొత్తం 25 కాలనీల ఏర్పాటు తదితర అంశాలపై ఎక్కువగా మాట్లాడారు. రాజధానిలో భూముల విలువ గజం రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకు ఉందని తాను ఇస్తున్న 50 గజాల స్థలం రూ.7-10 లక్షల వరకు ఉంటుందని అన్నారు.
ప్రస్తావించలేదు.. హామీ ఇవ్వలేదు..
సిఎం పాల్గొనే ప్రతి సభలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌ఛార్జిలు పలు సమస్యలను ప్రస్తావించడం, వాటిని పరిష్కరించేందుకు అనుమతి ఇస్తూ నిధులు కేటాయించడం ప్రతి సభలో జరుగుతోంది. కానీ వెంకటపాలెం సభలో తాడికొండ ఇన్‌ఛార్జి కత్తెర సురేష్‌ సమస్యలను వివరించలేదు. ఆయనకు మాట్లాడే అవకాశమూ ఇవ్వలేదు. మంగళగిరి ఎమ్మెల్యే మాట్లాడినా సమస్యల ప్రస్తావన లేదు.
భారీగా ఏర్పాట్లు చేసిన ఈ సభకు గుంటూరు, ఎన్‌టిఆర్‌ జిల్లాలకు చెందిన 50,793 మంది ఇళ్ల పట్టాదారులల్లో ఎక్కువ మందిని తరలించారు. పలువురు లబ్ధిదారులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా తరలివచ్చారు. రాజధానిలోని వెంకటపాలెం వద్ద ఏర్పాటు చేసిన పట్టాల పంపిణీ సభా ప్రాంగణం పరిసరాలన్నీ జనంతో నిండిపోయాయి. ఉదయం 8.30 గంటలకే రెండు జిల్లాలకు చెందిన ప్రజలందరినీ ఆర్‌టిసి, విద్యా సంస్థల బస్సులో తరలించారు. సిఎం జగన్‌ సభా ప్రాంగణంకు 10.30 గంటల సమయంలో వచ్చే సరికి ప్రాంగణం మొత్తం కిక్కిరిసింది. పరిసర రహదారుల్లో ప్రధానంగా సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులో భారీ జనసందోహం కన్పించింది. సభా ప్రాంగణం నిండిపోవడంతో చాలామంది సిఎం రాక ముందే బయటకు వచ్చి తిరుగుముఖం పట్టారు. కొంతమంది బస్సులోనే కూర్చొండిపోయారు.
వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు కూడా ప్రజలను సమీకరించడంలో కీలక భూమిక పోషించారు. సభకు రాకపోతే ఇళ్లపట్టాలు ఇవ్వబోమని చెప్పారని తీరా ఇక్కడికి వస్తే మీకు ఇప్పుడు కాదు మీ సచివాలయాల వద్ద ఇస్తారని వాలంటీర్లు చెప్పారని ఎన్‌టిఆర్‌ జిల్లాకు చెందిన పలువురు మహిళలు వాపోయారు. ఇందుకోసం తమను ఇంతదూరం తీసుకురావడం దేనికని వారు చెప్పారు. ఎండతీవ్రతకు మహిళలు ఇబ్బంది పడ్డారు. బస్సులు నిలుపుదల చేసిన ప్రదేశం నుంచి సభా ప్రాంగణం వద్దకు చాలా దూరం ఉంది. అంతేగాక సభ ముగిసిన తరువాత మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో ఎండ తాకిడికి పలువురు మహిళలు డీలాపడ్డారు.