Sep 23,2023 21:49

ఆలయ పరిసరాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్‌పి

ప్రజాశక్తి-విజయనగరం :   పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగకు విస్తత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. జిల్లా ఎస్‌పి దీపికతో కలిసి కలెక్టర్‌ శనివారం పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల రాకపోకలు, విఐపిల దర్శన ఏర్పాట్లుపై ఆలయ అధికారులతో చర్చించారు. అమ్మవారి ఆలయం ప్రక్కనున్న కట్టడాలను త్వరగా తొలగించి చదును చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారి పండుగకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సామాన్య భక్తులకు సైతం సంతృప్తికరమైన దర్శనం జరిగే విధంగా ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. దీనికోసం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.
పర్యటనలో ఆర్‌డిఒ ఎంవి సూర్యకళ, మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌.శ్రీరాములనాయుడు, డిఎస్‌పి ఆర్‌.గోవిందరావు, తాహశీల్దార్‌ కోరాడ శ్రీనివాసరావు, ఆలయ ఇఒ సుధారాణి, ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.