Sep 22,2023 23:51

- గుంపులుగా తిరుగుతున్న ఆవులు
- అల్లాడుతున్న వాహనదారులు 
- పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి - చీరాల
పట్టణంలో రోడ్లపై హల్ చేస్తున్న ఆవులను చూస్తుంటే వాహన దారులు ప్రమాద భయంతో వెళ్లాల్సి వస్తుంది. పట్టణ ప్రధాన కూడళ్లలో, వాహనదారులతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆవులు సంచరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా కూరగాయల మార్కెట్ సెంటర్, గడియార స్తంభం, ఎన్‌ఆర్ అండ్ పిఎం హై స్కూల్ గ్రౌండ్, పేరాల సెంటర్ వంటి ప్రాంతాలలో పగలు రాత్రి తేడా లేకుండ గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఆవులు అధిక సంఖ్యలో తిరుగుతూ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటన్నారు. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గతంలోనూ ఇదే తరహా పట్టణ ప్రజల ఎదుర్కొన్నప్పటికీ అప్పటి అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. మరల యధావిధిగా ఆవులను రోడ్లపై వదిలేశారు. ఆవుల బెడద ఎక్కువ అవటంతో బాటసారులు, వాహనదారులు, దుకాణాదారులకు నిత్యం ఇబ్బందులు తప్పడంలేదు. పట్టణ అభివృద్ధిపై అహర్నిశలు కృషి చేస్తున్నామంటున్న మున్సిపల్ అధికారులు ఇటువంటి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రజల కోరుతున్నారు. గతంలో ఉన్న గో సంరక్షణ కేంద్రాన్ని కొనసాగించాలని కోరుతున్నారు.