Apr 24,2022 10:16

దారిలో నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ
మరుజన్మంటూ ఉంటే
ఆడదానిగా పుడతావాయని కుక్కనడిగా
వామ్మో విశ్వాసంగా కొన్నాళ్లైనా ఉంటాను
ఆడదానిగా పుట్టడం ఇష్టం లేదంది

పొలం గట్టున దున్నపోతునడిగా
దుక్కి దున్నైనా చస్తాను గాని
ఆడదానిగా నావల్ల కానంది

నువ్వైనా ఆడదానిగా పుడతావాయని గాడిదనడిగా
ఎన్ని సమస్యల బరువునైనా మోస్తాను గాని
అలా ఆడదానిలా పుట్టలేనంది

చాలా చాలా అందంగా ఉంటావులే
ఆడదానిగా పుడితే - అని పందినడిగాను
నవ్వుకుంటూ నన్నొదిలేయమంటూ

జంతువులన్నింటినీ అడగ్గా అడగ్గా
బాగా పీకలదాకా మాంసం తిని
మిగిలివున్న అంగుళం మాంసం తినలేక
ఆపసోపాలు పడుతున్న సింహాన్నడిగా
ఆడదానిగా పుట్టడం నీకిష్టమేనానని
బాబోరు ఆడదానిగా అది మనిషిగానా
అవసరమైతే ఎలుకగానైనా పుడుతానంది

ఈ జంతువులన్నీ భయంతో
ఒకే విధంగా సమాధానమిచ్చాయి
మాకంటే కామ క్రూరమృగాలు మీ మనుషుల్లోనే
అందంగా కనిపించినా కనిపించకపోయినా
ఆడదైతే చాలు
సామూహికంగా అత్యాచారం చేసి
వీడియోలు తీసి
ప్రపంచానికి చూపించి
గుచ్చి గుచ్చి మరి చంపుతారు
మీ మనుషులు
ఆపై పెట్రోల్‌ పోసి తగలబెడతారనీ
తమ గోడు చెప్పుకున్నాయి బాధతో

ఉత్పల కళ్యాణి