Jun 29,2023 01:00

విశాఖ జిల్లాలో చెక్కును అందిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

ప్రజాశక్తి-విశాఖపట్నం : పిల్లల సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని విద్యార్థుల ఎదుగుదల కోసం తల్లితండ్రులు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున సూచించారు. పెదగంట్యాడ మండలం నడుపూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో బుధవారం ఉదయం నిర్వహించిన జిల్లా స్థాయి అమ్మఒడి కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. విశాఖ జిల్లాలో సుమారు 1,70,467 మంది అర్హులైన తల్లుల బ్యాంక్‌ ఖాతాలో రూ.255 కోట్లా 70 లక్షలా 5వేలు జమ చేసినట్లు చెప్పారు. అమ్మఒడికి సంబంధించి అర్హత ఉండి ఏ కారణం చేతనైనా రాకపోయి ఉంటే సంబంధిత సచివాలయంలో తెలియజేస్తే వారు పరిష్కరించి వచ్చే విడతలో మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటారన్నారు. ఈ మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, డిసిఎంఎస్‌ చైర్‌పర్సన్‌ పల్లా చిన్నతల్లి, డిఇఒ చంద్రకళ, సర్వ శిక్ష అభియాన్‌ ఎపిడి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లాలో...
అనకాపల్లి : అమ్మఒడి కార్యక్రమం ద్వారా అనకాపల్లి జిల్లాలో 1,50,870 మంది లబ్ధిదారులకు 226కోట్లా 30లక్షలా 50వేల రూపాయలు జమ చేసినట్టు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన అమ్మఒడి నాలుగో విడత కార్యక్రమంలో వారు పాల్గొని అమ్మఒడి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ తల్లి ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ బిడ్డలను బడికి పంపకుండా ఉండకూడదనే గొప్ప సంకల్పంతో పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికీ ఏటా రూ15వేలు ఇస్తున్నట్లు తెలిపారు. పిల్లలందరూ బడిబాట పట్టి చక్కని విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. దీని వల్ల అక్షరాస్యత రేటు పెరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 2022-23 సంవత్సరంలో నాలుగో విడత 1,50,870 మంది తల్లుల ఖాతాలలో అమ్మఒడి సొమ్మును జమ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి వెంకట లక్ష్మమ్మ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి శిరీష, గ్రామ వార్డ్‌ సచివాలయం నోడల్‌ అధికారి మంజులావాణి, ఎంపీపీ గొర్లి సూరిబాబు, కార్పొరేటర్‌ కొణతాల నీలిమ భాస్కర్‌, పలువురు విద్యార్ధులు, తల్లులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.