Jul 17,2023 00:02

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జగనన్న అమ్మఒడిలో అర్హతున్నా ఎంతో మంది ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.13 వేల ఆర్థిక సాయం పొందలేకపోయారు. గుంటూరు జిల్లాలో 1,59,594 మంది, పల్నాడు జిల్లాలో 1,87,417 మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున నిధులు జమైనట్లు అధికారులు ప్రకటించారు. కానీ గతనెల 28 నుంచి ఈనెల 15 వరకు తల్లుల ఖాతాల్లో దశల వారీగా రూ.13 వేలు చొప్పున సొమ్ము జమ అవుతూనే ఉంది. గతంలో సిఎం బటన్‌ నొక్కి ప్రారంభించిన తరువాత నాలుగు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమయ్యేది. ఈసారి 18 రోజుల సమయం తీసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో గుంటూరు జిల్లాలో 12 వేల మందికి, పల్నాడు జిల్లాలో 18 వేల మందికి ఇంత వరకు అమ్మఒడి నిధులు జమకాలేదని తెలిసింది. వీరు బ్యాంకుల చుట్టూ గత 17 రోజులుగా ప్రదక్షిణాలు చేస్తున్నారు. కారణం ఏమిటో చెప్పడానికి ఏస్థాయిలోనూ ఎవరూ కచ్చితమైన సమాధానం చెప్పడంలేదని విద్యార్థుల తల్లులు వాపోతున్నారు.
గతనెల 28న సిఎం జగన్‌ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఈనెల 16లోగా బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోతే ఆయా సచివాలయాల పరిధిలోని విద్యాశాఖ కార్యదర్శులను సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఇకెవైసి సమస్య వల్ల నాలుగు వేలమంది వరకు అమ్మఒడి సాధించలేక పోయారు. బ్యాంకుల్లో ఆధార్‌ అనుసంధానం కాలేదని అర్హత సాధించిన జాబితాలో కూడా వందలాది మందిని ఇన్‌ యాక్టివ్‌ పేరుతో చూపారు. మూడేళ్లుగా తమ బ్యాంకు ఖాతాకు అమ్మఒడి జమ కాగా ఈ ఏడాది మాత్రం ఆధార్‌ అనుసంధానం కాలేదని చెబుతూ నిలిపివేయడంపై వేలాదిమంది తల్లులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే బ్యాంకు ఖాతాతో తాము ఏడాదిగా లావాదేవీలు నిర్వహిస్తున్నా, ఇతర ప్రభుత్వ పథకాలు అందుతున్నా అమ్మఒడి నిధులు జమకాకపోవడానికి బ్యాంకుకు ఆధార్‌ అనుసంధానం కాకపోవడాన్ని కారణంగా చూపడంపై విడ్డూరంగా ఉందని చెబుతున్నారు. బ్యాంకు ఆధార్‌ అనుసంధానంలో కొత్తగా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో (ఎన్‌పిసిఐ) లింకు చేయించుకోవాలని తాజాగా సచివాలయాల సిబ్బంది చెబుతున్నారు. అయితే అధికారుల సూచన మేరకు మళ్లీ బ్యాంకుల చుట్టూ తిరిగి ఆధార్‌ అనుసంధానం చేసినా సొమ్ము జమకాలేదని పలువురు మహిళలు వాపోతున్నారు. వీటిపై వాలంటీర్లకు అడుగుతున్నా వారు తమకు సంబంధం లేదని చెబుతున్నారని అంటున్నారు.
పట్టణ ప్రాంతాల్లో వెయ్యి అడుగులకు పైగా నివాసం ఉంటే అనర్హతగా చూపారు. అంటే వెయ్యి అడుగుల్లో అపార్టుమెంట్‌ వున్న వారికి అమ్మఒడి వర్తించదని సచివాలయాల సిబ్బంది చెబుతున్నారు. విద్యాశాఖతో సంబంధం లేకుండా కేవలం గ్రామ, వార్డు సచివాలయాలకు బాధ్యతలు అప్పగించడం వల్ల విద్యాశాఖ అధికారులు ఈ అంశం తమకు సంబంధం లేదంటున్నారు. రైస్‌ కార్డు ఉన్నా ఏదో ఒక సాకుతో అనర్హత కల్పించారని పలువురు చెబుతున్నారు. విద్యుత్‌ బిల్లులు 300 యూనిట్లు దాటినా, రేషన్‌ కార్డులో పిల్లలకు ఇకెవైసి పూర్తి కాకపోయినా, మూడెకరాల మాగాణి భూమి తల్లిదండ్రులకు ఉన్నా, 75 శాతం హాజరు లేకపోయినా, నాలుగు చక్రాల వాహనం, ఐటి, జిఎస్‌టి రిటర్నులున్నా అనర్హులుగా నిర్ధారించారు. వీటిల్లో కొన్ని అంశాలకు సంబంధిత తల్లిదండ్రులు తగిన ఆధార్‌లతో వివరణ ఇచ్చినా అవకాశం దక్కలేదు. బ్యాంకు లింకేజి సమస్య పరిష్కరించుకున్నా వారికీ సొమ్ము జమకాలేదు. ప్రభుత్వం విడుదల చేసిన అర్హత జాబితాల ప్రకారం గతనెల 24 నుంచి 27 మధ్య వాలంటీర్లు తల్లుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకున్నారని వీరందరికి అమ్మఒడి నిధులు జమ అవుతాయని రాని వారు తప్పని సరిగా సచివాలయం విద్యాశాఖ కార్యదర్శికి తమ వివరాలు సమర్పించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి తెలిపారు.