May 08,2022 12:23

అమ్మ గురించి రాయాలంటే కవి కానక్కర్లేదు. ఆమె గురించి చెప్పాలంటే పెద్ద వక్తే అవసరం లేదు. ఎందుకంటే ఆమె ప్రేమను చవిచూడని వారంటూ ఉండరు. అమ్మతనాన్ని తూకంవేసే రాళ్లు సృష్టిలో లేనేలేవు. 'పదిమంది ఉపాధ్యాయులు ఒక ఆచార్యునితో సమానం. వందమంది ఆచార్యులు ఒక తండ్రితో సమానం. వెయ్యిమంది తండ్రులు ఓ తల్లితో సమానం' అని మన పెద్దలు అంటుంటారు. అందుకేనేమో 'నేను సంపాదించినదంతా ఆమె చరణాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతా' అని అమ్మ మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు చార్లీచాప్లిన్‌. బిడ్డల భావి జీవితానికి బంగారుబాటలు వేస్తూ, వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మ అంటే తొమ్మిది నెలల లెక్క కాదు.. చిరకాల దీవెన. నేడు ''మాతృ దినోత్సవం''. ఈ సందర్భంగా పిల్లల కోసం ''ఎన్నో త్యాగాలు చేసిన తల్లికి సమయం కేటాయించాలి!'' అనేదే ఈ ఏడాది సందేశం. దానిపైనే ఈ ప్రత్యేక కథనం.

 

అమ్మకు ప్రేమతో..



'తల్లి పుట్టిన తర్వాతే తెలిసింది లోకానికి
ప్రేమ పుట్టిందని..
ఒక శ్వాస ఆడటానికి
తన శ్వాస నిర్బంధించి
కడుపులో పడ్డప్పటి నుంచి
కడుపు చీల్చుకు వచ్చే వరకు
బాధలన్ని సంతోషంగా భరించేది
తల్లిప్రేమ'
అని ఒక కవయిత్రి రాశారు. అమ్మ తన కుటుంబానికే కాదు, యావత్‌ సమాజ మనుగడలో బహు శక్తివంతమైనదిగా తీర్చిదిద్దారు మాక్సిమ్‌ గోర్కి. కాబట్టే ఆయన రాసిన 'అమ్మ' నవల నేటికీ ప్రజల మన్ననలు అందుకుంటూనే ఉంది. ఇంకా అమ్మను గొప్పగా ప్రతిష్టింపజేసిన రచయితలు, కవులు ఎందరో. ఇరువైపులా రెండు చక్రాల్లా అమ్మానాన్నలిద్దరూ జీవన రథాన్ని లాగినా అమ్మపాత్ర విశిష్టమైనది, అపురూపమైనది. కారణాలు ఏవైనా.. నాన్నలు లేని ఇళ్లల్లో అమ్మానాన్నలిద్దరి పాత్రలనూ ఒంటరిగా పోషించే అమ్మలకు శతకోటి వందనాలు.

 

అమ్మకు ప్రేమతో..


 

                                                                       సమయం ఇవ్వండి..

అమ్మ ఓ అపురూపం. ఆమె ప్రేమ అనంతం. సూర్యుడు ఉదయించక మునుపే నిద్ర లేస్తుంది. 'అమ్మా! ఇంకొంచెంసేపే.. ప్లీజ్‌.. ఒక్క ఐదు నిమిషాలు..!' అంటూ నిద్ర లేవకుండా మారాం చేస్తున్న పిల్లల్ని .. 'నా బుజ్జి , నా బంగారు.. లే నాన్నా.. లే తల్లీ..!' అంటూ ముద్దు చేస్తూ నిద్రలేపేది అమ్మే. పిల్లలతో ఉరుకులు పరుగులు తీస్తూ.. వారికి స్నానం చేయించి, స్కూల్‌కి రెడీ చేస్తుంది. అదేంటో అమ్మ సిద్ధం చేసినట్లు మరెవ్వరూ చేయలేరు. ఆమె చేతిలో ఏదో జిమ్మిక్కు ఉంది. దానిపేరే ప్రేమ. టైమ్‌ అయిపోతుందని పిల్లలు టిఫిన్‌ తినకుండా వెళ్లిపోతుంటే.. స్కూల్‌ వ్యాన్‌ వరకూ వెంటపడి మరీ కడుపు నింపుతుంది. ఇంట్లో ఉన్న అమ్మలు పిల్లలు స్కూలుకు వెళ్లి, భర్త ఆఫీసుకు వెళ్లిపోయాక..ఇక ఖాళీగా కూర్చుంటుంది అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అప్పుడే ఆమెకు మరో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఇల్లంతా సర్ది, చేయాల్సిన పనులన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటుంది. ఇంట్లో అత్తామామలు ఉంటే.. వారికి అవసరమైనా సమకూర్చుతుంది. ఇలా ఆమె ఏ పని చేసినా పరిపూర్ణమే. ఎక్కడా ఎలాంటి లోటూ కనపడనివ్వదు. ఉదయాన్నే లంచ్‌బాక్స్‌ పిల్లల చేతికిస్తే సరిగా తినకుండా ఎక్కడ ఇంటికి తెస్తారోనని, మధ్యాహ్నం లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఎండనపడి స్కూలుకి వెళ్లే తల్లులెందరో. కథలు చెబుతూ 'ఇది అమ్మ ముద్ద, నాన్న ముద్ద!' అంటూ మారం చేసే పిల్లల కడుపు నింపేది అమ్మే. పిల్లలు కడుపు నిండా తినగానే ఆమె కళ్లల్లో ఒక మెరుపు మెరుస్తుంది. వాస్తవానికి ఉద్యోగం చేసే వారికి ఎనిమిది గంటలే పనిగంటలు. కానీ అమ్మలకు ఇరవై నాలుగు గంటలూ పని గంటలే. ఆమెకు ఎలాంటి సెలవులూ ఉండవు. ఆదివారం లోకమంతా సంతోషాలతో నిండి ఉంటే.. పిల్లలకు ఇష్టమైనవి వండి పెట్టడానికి, అమ్మకు ఆ రోజు అదనపు పనులే. ఇంకా చెప్పాలంటే ఆమెకు రెండు చేతులు, 24 గంటలు సరిపోవు. 'పిల్లలు, కుటుంబం' అంటూ క్షణం తీరిక లేకుండా రోజంతా కష్టపడుతూనే ఉంటుంది. అంత చేసినా ఆమె శ్రమకు విలువ ఉందా? అంటే అదీ లేదు. కొన్ని గంటలు మాత్రమే పనిచేసే వారికి జీతాలు ఇస్తారు. ఇన్ని గంటలు పనిచేసే అమ్మను మాత్రం గుర్తించరు. నిజానికి ఆమె శ్రమకు వెలకడితే రోజువారీ ఉద్యోగి పనిగంటలకన్నా రెట్టింపు అమ్మ చేస్తుంది. అమ్మ ప్రేమను కొలిచే కొలమానాలు ఇంకా రాలేదేమో! అన్నీ తనకే తెలుసంటూ నాన్న, తమకే తెలుసంటూ.. పిల్లలు.. అమ్మను అమాయకురాలిని చేసేస్తారు. ఆమెపై చీటికీమాటికీ కేకలు వేస్తూ.. మాటలతో చిత్రవథకు గురిచేస్తూ బాధ పెడుతుంటారు. ఆమె ఇల్లంతా మానేజ్‌ చేసుకొని రాగలుగుతుందంటే.. అన్నీ సమయానికి సమకూర్చగలుగుతుందంటే ఆమెకు ఎంత నైపుణ్యం ఉంటే సాధ్యం? అంతెందుకు పుట్టీ పుట్టగానే బిడ్డకు ఏ సమయానికి ఏమి అవసరమో.. పక్కతడపారో లేదో, ఆకలేస్తుందో లేదో కనిపెట్టుకోగలిగేది అమ్మే.. అది అపరాత్రి అయినా అమ్మే మేల్కొని కనురెప్పలా కాపాడుతుంది. ఆరోగ్యం బాగోకపోతే పిల్లలతోనే ఉండేది అమ్మే. ప్రతి బిడ్డకీ అమ్మే తొలి గురువు. ఈ విషయం ఎందుకు అర్థంకావడం లేదు.
    ఇంత చేసిన అమ్మ మన నుంచి కోరుకునేదీ కేవలం తనకు కొంత సమయాన్ని కేటాయించాలనే! కానీ బిడ్డలేమో కెరీరిజంలో, ఉద్యోగాల్లో పడిపోయి, కొద్దోగొప్పో తీరిక దొరికితే.. సెల్‌ఫోన్‌లు, టీవీలకు అతుక్కుని అమ్మను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది సరైంది కాదు. వీలు దొరికినప్పుడల్లా ఆమెకు సమయాన్ని ఇవ్వండి. ఆమె మనసుకు దగ్గరగా ఉండండి. అమ్మ ఇంటిపనిలో భాగస్వాములవ్వండి. అదే అమ్మకు ఇచ్చే పెద్ద బహుమతి.

 

అమ్మకు ప్రేమతో..


 

                                                                        ఒంటరి తల్లులకు సెల్యూట్‌..

భర్త హింస పెడుతున్నా.. ఓపికతో సహించాలంటారు కొంతమంది. తప్పనిసరి పరిస్థితుల్లో భర్తతో విడిపోవడానికి నిర్ణయించుకుంటే తప్పుడు మనిషిగా ముద్ర వేస్తారు. తన తప్పు లేకపోయినా సమాజం నుంచి ఎదురయ్యే సూటీపోటి మాటలు భరిస్తూ.. ఒంటరిగా పిల్లల బాధ్యతల్ని మోస్తున్నారా తల్లులు. బాధ్యత లేని తండ్రులున్న కుటుంబాల్లో పిల్లల్ని పెంచి పెద్దచేయడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటుంది అమ్మే. అది అనుభవించే వారికే ఆ కష్టం విలువ తెలుస్తుంది. కానీ ఇవేమీ పట్టని కొందరు వ్యక్తులు మాటలు తూలుతున్నా.. అమ్మ మౌనంగా భరిస్తుందే తప్పా.. తిరిగి ఒక్కమాటా అనదు. ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ పిల్లల మొహాల్లో నవ్వులు రువ్వించడం కోసం చిరునవ్వుతో కనపడుతుంది. అందుకే అలాంటి అమ్మలకు మళ్లీ జీవితం కావాలి. పిల్లల కోసం వాళ్లు కోల్పోయిన ఆనందాల్లో కొన్నైనా ఆమెకు తిరిగివ్వాలి అనుకుంటున్నారు కొందరు పిల్లలు. తమ తల్లులకు తామే పెద్దలై.. తగిన వ్యక్తిని చూసి, పెళ్లిళ్లు చేస్తున్నారు. ఆమెకు ఒక తోడును ఇస్తున్నారు. అలాంటి పిల్లలకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. 'తల్లికి పెళ్లి చేయడమేంటి విడ్డూరం కాకపోతే! అనే మాటలు వినాలి అనుకోవడం లేదు. ఒక మంచిపని చేసినప్పుడు ఎన్నో విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని లెక్కబెడుతూ కూర్చొంటే ముందుకెళ్లలేం. కాబట్టి అలాంటి మాటలకు విలువ ఇవ్వాల్సిన పనిలేదు. మాకు కావాల్సింది కేవలం మా అమ్మ సంతోషం, ఆమె ముఖంలో చిరునవ్వు. అందుకోసం ఏమైనా చేస్తాం. ఎందరినైనా ఎదురిస్తాం' అని చెబుతున్నారు తల్లులకు పెళ్లిళ్లు చేసిన బిడ్డలు.
 

                                                                            బరువై పోయిందా ?

అమ్మకు ప్రేమతో..

ఒకప్పటిలా తల్లులు ఇంటికే పరిమితం కావడం లేదు. నేటి కాలంలో భార్యాభర్తలు పనిచేస్తేగానీ కుటుంబాన్ని నెట్టుకు రాలేకపోతున్నారు. ఒకపక్క ఇంటెడు చాకిరీ, మరోపక్క కుటుంబం కోసం ఉద్యోగం చేస్తూ, ఆర్థికంగా భాగస్వాములవుతున్నారు. ఇలా అమ్మలు ఇంటా, బయటా రాణిస్తున్నారు. గతంలోలా రోజంతా పిల్లలకు కేటాయించడానికి కుదరకపోవడం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పిల్లలను హాస్టల్‌లో ఉంచి, చదివించడం వల్ల అమ్మ మానసికంగా ఎంతో కుంగిపోతుంది. ఇన్ని ఒత్తిడుల మధ్య బిడ్డల ఎదుగుదలను చూసి, తన కష్టాన్ని మరచిపోతుంది. పిల్లల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ 'మీకు నేనున్నా!' అనే భరోసాని ఇస్తుంది. బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. తాను చీకటిలో ఉంటూ వారికి వెలుగులు నింపడానికి ప్రయత్నిస్తుంది. అలాంటి అమ్మ నేడు కొందరు పిల్లలకు బరువైంది. ఆ తల్లిని వదిలించుకొనే, ఆ బరువును దించుకొనే ప్రయత్నంలోనే నేడు కొందరు పిల్లలు ప్రవర్తిస్తున్నారు. తమ ఉన్నతి కోసం అమ్మ జీవితాన్నే త్యాగం చేస్తే, చివరకు తల్లినీ చూడలేని పరిస్థితుల్లో వారిని వృద్ధాశ్రమాల్లో ఉంచుతున్నారు. తన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కడుపు మాడ్చుకుని కూడబెట్టిన డబ్బుతో పెద్ద చదువులు చదివించిన అమ్మపై కృతజ్ఞత లేకపోగా, ఆమెను అనాథగా వదిలేస్తున్నారు కొందరు. గోరుముద్దలు తినిపించిన అమ్మకు నాలుగు ముద్దలు పెట్టకుండా.. ఆమెను వదిలించుకోవాలని అనుకోవడం బాధాకరం.
     తల్లి మరణించిన తర్వాత హోదా చూపడం కోసం గొప్పగా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్లు బతుకున్నప్పుడే.. జీవిత చరమాంకంలో ఉన్న వారు కన్నీరు పెట్టకుండా చూసుకుంటే చాలు. విదేశాల్లో స్థిరపడిన పిల్లలు తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిని వృద్ధాశ్రమాల్లో ఉంచాల్సి వచ్చినా.. అమ్మకోసం కొంత సమయాన్ని ఫిక్స్‌ వేసుకుని, కేటాయిస్తే మంచిది. అమ్మను చూసుకోవడానికి పిల్లలు వంతులు వేసుకోవడం సరికాదు. కొడుకులతో పాటు కూతుళ్లూ తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకు కూతుళ్లకు వారి భర్తలు సహకరించాలి. అలాగే కూతుళ్లు తమ తల్లిదండ్రులతోపాటు అత్తామామలనూ ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు భర్తల బాధ్యతను నెరవేర్చేందుకు వారు సహకరించాలి.

 

అమ్మకు ప్రేమతో..


 

                                                                       చట్టం ఏం చెబుతోంది ?

వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ నైతికమే కాదు.. బాధ్యత కూడా! తల్లిదండ్రులు, వృద్ధుల భృతి సంరక్షణ చట్టం- 2007 ప్రకారం.. వృద్ధులైన తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి జీవన భృతి, పోషణ, వైద్య సదుపాయాల ఖర్చులను పొందవచ్చు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా, వారి పోషణ భారంగా భావించి, ఇంటినుంచి గెంటేసినా ఆ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించి, న్యాయం పొందవచ్చని ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో స్పష్టం చేసింది. తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత కూతుళ్లపైనా ఉంటుందని 1987లోనే సుప్రీం కోర్టు ఓ తీర్పులో చెప్పింది.
      పిల్లలు తమ తల్లిదండ్రులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని రుజువైతే మూడు నెలల జైలు, ఐదువేల రూపాయల వరకూ జరిమానా / రెండూ విధించే అవకాశం ఉంది. పోషిస్తామని నమ్మించి, ఆస్తులు తమ పేరుమీద రాయించుకుని, ఆ తర్వాత వారిని విస్మరిస్తే.. ఆ ఆస్తికి సంబంధించిన దస్తావేజులు రద్దవుతాయి. ఈ చట్టం పరిధిలోకి వచ్చే కేసులను కోర్టులు సుమోటోగానూ స్వీకరించవచ్చు. పోలీసులు, తహశీల్దార్లు, న్యాయవాదులు, సామాన్యపౌరులు బాధితుల తరుపున న్యాయపోరాటం చేయవచ్చు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వృద్ధులు, తల్లిదండ్రుల సంరక్షణ కోసం ఓ ప్రత్యేక విభాగం ఉంటుంది.

        కళ్లు మూసినా, తెరిచినా ఆమె ఆలోచనంతా బిడ్డల మీదే. పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని బెంగ పడుతూనే ఉంటుంది. జీవితంలో వెనుకంజ వేస్తే .. 'నువ్వు సాధించగలవు, నీలో చాలా టాలెంట్‌ ఉంది!' అంటూ పిల్లలకు లేని ఉత్సాహాన్ని నింపుతుంది అమ్మ. గెలుపు వైపు అడుగులు వేసేలా చేస్తుంది. పిల్లల గెలుపే తన గెలుపుగా సంబరపడుతుంది. అలాంటి అమ్మకు ఒక్కరోజు పండగ ఏమిటి? ప్రతిరోజూ పండగ కావాలి. ఇంట్లో ఉన్న అమ్మను వదిలేసి బయట ఎంత పేరుప్రఖ్యాతలు సాధించినా నిరుపయోగం. ఇప్పటికైనా మారండి.. తల్లిని గౌరవించండి.. ఆమెను ప్రేమించండి.. ఎందుకంటే అమ్మ మనందరికీ దొరికిన అపూర్వం.. అపురూపం. అమ్మ రుణం తీర్చుకోగలమా అంటే.. అమ్మకు అమ్మయితేగానీ తీర్చుకోలేం.. అందుకే అమ్మలకు మనం పెద్దయ్యాక కనురెప్పలమవుదాం.

 

అమ్మకు ప్రేమతో..



                                                                             ఎలా వచ్చిందంటే...

ఏటా మే రెండో ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీనికి సుదీర్ఘ చరిత్ర, ఓ నేపథ్యం ఉంది. గ్రీస్‌లో 'రియా' అనే దేవతను 'మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌'గా భావించి, ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా 'మదరింగ్‌ సండే' పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. 'జూలియవర్డ్‌ హోవే' అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచశాంతి కోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించారు. అన్న మేరీ జర్విస్‌ అనే మహిళ 'మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే' జరిపించేందుకు ఎంతో కృషి చేశారు. ఆమె 1905, మే 9న మరణించారు. ఆమె కుమార్తె మిస్‌ జెర్విస్‌ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృ దినోత్సవం జరపడం మొదలైంది. ఫలితంగా 1914 నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటి నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది.

 

అమ్మకు ప్రేమతో..



                                                                              ఆమెపై పాటలు..

సమాజంలో మనసున్న మనిషి అమ్మ. అందుకే 'అమ్మ' గురించి చెప్పే పాటలకు మనసున్న వారెవ్వరైనా ఇట్టే కనెక్టవుతారు. ఎన్ని తరాలు మారినా.. యుగాలు మారినా.. తెరపై అమ్మపాట వినిపిస్తే కదలని మనసుండదు. ఎందరో గేయ రచయితలు అమ్మతనాన్ని పొగుడుతూ ఎన్నో పాటలు రాశారు. రాస్తూనే ఉన్నారు. ఎన్ని పాత పాటలు ఉన్నా.. ఎన్ని కొత్త పాటలు వచ్చినా ప్రేక్షకులు 'అమ్మ' పాటలను ఆప్యాయంగా మదికి హత్తుకుంటున్నారు. అలా అలరించిన పాటల్లో కొన్ని .. 'బిచ్చగాడు' సినిమాలో 'కోట్ల సంపద అందించినా.. నువ్విచ్చే ప్రేమ దొరకదమ్మా.. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించునా.. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా'. 'రఘువరన్‌ బీటెక్‌'లో 'అమ్మా .. అమ్మా నే పసివాడ్నమ్మా నువ్వే లేక వసివాడానమ్మా!'. 'అమ్మ రాజీనామా'లో 'ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరు అమ్మ అనురాగంకన్నా తీయ్యనిరాగం'. 'నాని'లో 'పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మ..'. 'అమ్మానాన్న ఓ తమిళమ్మాయి'లో 'నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. వరమల్లే అందిందేమో ఈ బంధం..'. 'ముగ్గురు మొనగాళ్లు'లో 'అమ్మంటే మెరిసే మేఘం కురిసే వాన.. నాన్నంటే నీలాకాశం తల వంచేనా'. ఈ విధంగా మరెన్నో అద్భుతమైన అమ్మ గొప్పతనాన్ని తెలిపే పాటలు ఉన్నాయి.. అవన్నీ ఎంతగానో మనసుకు హత్తుకునేలా ఉండేవే.

స్వర్ణలత నూకరాజు