
సాకేత్ మనసు గజిబిజిగా ఉంది. ఆలోచనలు ఒక కొలిక్కి రావటం లేదు. అతను ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న రోజు త్వరలోనే రాబోతోంది. ఆ రోజు చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చెయ్యాలని అనుకుంటున్నాడు. కానీ ఏం చేయాలో నిర్ణయించుకోలేకపోతున్నాడు. పుస్తకాల అలమరకేసి చూశాడు. చిన్న చెక్కపెట్టె కనిపించింది. పెట్టె అంతా నగిషీ చేసి ఉంది. ఆ పెట్టె అంటే అమ్మకు ఎంత ఇష్టమో సాకేత్‌కి బాగా తెలుసు. తదేకంగా ఆ పెట్టె వైపే చూశాడు. ఒక ఆలోచన అతని మదిలో రూపు దిద్దుకుంది. వెంటనే తన రూములోకి వెళ్లి పడుకున్నాడు.
మర్నాడు కారు తీసుకుని రాజమండ్రి వెళ్లాడు. గోదావరి దగ్గరకు వెళ్లి తను తెచ్చిన ప్లాస్టిక్ టిన్ను నిండా గోదావరి నీళ్లు నింపుకున్నాడు. మెయిన్ బజారులో పంచెలు, కండువాలు, చీరలు తీసుకున్నాడు. టిఫిన్ తిని దేవి సెంటర్ వద్ద ఉన్న డిజిటల్ కలర్ ల్యాబ్‌కి వెళ్లాడు. కంప్యూటర్ ఆపరేటర్‌తో మాట్లాడాడు. తను బ్యాగ్‌లో తెచ్చిన వాటిని అతనికి ఇచ్చి, వాటిని ఏవిధంగా తీర్చిదిద్దాలో చెప్పి, రెండువేలు అడ్వాన్స్ ఇచ్చాడు. గంట గడిచాకా ఆపరేటర్ చేసిన కొంతపని చూసి, మర్నాడు సాయంత్రం వస్తానని అప్పటికి మొత్తం పని పూర్తిచేయాలని చెప్పాడు సాకేత్. నాలుగు రోజుల్లో తల్లి షష్టిపూర్తి ఉంది. చెన్నరు నుంచి తను ముందుగా వచ్చాడు. పిల్లలకు పరీక్షలు ఉన్నాయని సుప్రజ ఆగిపోయింది.
కారు వేమగిరి దాటింది. సాకేత్ ఆలోచనలు తల్లివైపు మరలాయి. 'నాన్న ఉపాధి కోసం దుబారు వెళ్తే, వృద్ధులైన తాతగారిని చూసుకుంటూ కుటుంబ పోషణ కోసం చాలా శ్రమపడింది అమ్మ. పాతకాలం చిన్న పెంకుటిల్లు. వర్షం వస్తే ఇల్లంతా నీటితో నిండి పోయేది. అక్కడకీ అమ్మ పైనుంచి వర్షం పడుతున్న చోటల్లా గిన్నెలు, చెంబులు పెట్టేది. అవి నిండిపోతే బయట పారబోసి, మళ్లీ పాత్రలు పెట్టేది. వర్షం తగ్గే వరకూ అమ్మ అలాగే ఇంట్లోకి, బయటకు తిరుగుతూనే ఉండేది. నాన్న దుబారు వెళ్లిన రెండు సంవత్సరాలు అమ్మ అలాగే బాధ పడింది. తర్వాత నాన్న పంపిన డబ్బులు జాగ్రత్త చేసి, పెంకుటిల్లుకి కొత్త పైకప్పు వేయించింది. తర్వాత కొన్నాళ్లకు బ్యాంకులో అప్పు తీసుకుని, ఒక గేదెను కొన్నది. రెండు ఇళ్ల వారికి ఉదయం, సాయంత్రం పాలు పోసి.. నెల పూర్తికాగానే వాళ్లిచ్చిన డబ్బులు క్రమం తప్పకుండా బ్యాంకులో కట్టేది. మూడేళ్లు గడిచేసరికి బ్యాంకు అప్పు తీర్చేసింది' అని గుర్తు చేసుకున్నాడు సాకేత్. గంటలో శివపురం చేరుకున్నాడు. సాయంత్రం తెలుగు మాష్టారు రామ్మూర్తి గారింటికి వెళ్లాడు. 'ఏం చేస్తున్నావ్?' అడిగారు మాష్టారు. 'చెన్నరు ఐఐటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. రెండు రోజుల క్రితం వచ్చాను. అమ్మ షష్టిపూర్తి ఆదివారం ఉంది. మీరు తప్పకుండా రావాలి' అన్నాడు సాకేత్.
'అలాగే.. మీ అమ్మ అంటే మా అందరికీ అభిమానం. భర్త లేకపోయినా ఎంతో ధైర్యంగా నిలిచి, ఎన్నో కష్టాలు పడి నిన్ను చదివించింది. మా పిల్లలకూ చెబుతాను. కౌసల్య లాగా ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు సాగాలని. నువ్వు మంచిపని చేస్తున్నావు. ఈ రోజుల్లో రెక్కలు రాగానే పెద్దవాళ్లను విస్మరించి, తమ సుఖం చూసుకునే సంతానం ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాకాకుండా తల్లిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నావు' అంటూ సాకేత్‌ని అభినందించారు మాష్టారు.
'మా అమ్మని నా దగ్గరకు వచ్చి ఉండమంటే వినడం లేదు సర్. ఇక్కడ తను ఒక్కతీ ఎలా ఉందోనని నాకు దిగులు. ఉద్యోగంలో తీరిక ఉండడం లేదు. అయినా రెండు, మూడు నెలలకు ఒకసారి వచ్చి వెళ్తున్నాను' దిగులుగా అన్నాడు సాకేత్. 'ఈ పల్లెటూరిలో జీవించిన వారు నగరాల్లో ఉండలేరు. నా సంగతే చూడు. నేను రిటైరయ్యాను. అబ్బాయిలు ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. అక్కడికి వచ్చి ఉండమంటారు. నాకు ఇష్టం లేకపోయినా మా ఆవిడ పోరు పడలేక, ఒకసారి అమెరికా వెళ్లాను. కానీ అడ్జస్ట్ కాలేకపోయాను. ఎప్పుడు శివపురం వచ్చి పడిపోవాలా అని ఎదురుచూస్తూ ఉండేవాడిని. మీ అమ్మా అంతే. నువ్వు చెన్నరులో మీ అమ్మని ఎంతో ప్రేమగా చూస్తావు. కానీ ఈ నేలా, గాలీ, మనుషులు గుర్తుకొస్తూనే ఉంటారు. మనసు ఇటువైపు లాగుతూనే ఉంటుంది. అందుకే రాదు. అంతకంటే వేరే భావం ఏం ఉండదు. మా తరం అంతే' అని దీర్ఘంగా నిట్టూర్చారు మాష్టారు. ఈలోగా మాష్టారి భార్య రాజేశ్వరి కాఫీ తెచ్చి 'బాగున్నావా సాకేత్?' అని పలకరించారు.
'బాగున్నాను అమ్మా. ఆదివారం అమ్మ షష్టిపూర్తి. మాష్టారు, మీరు తప్పకుండా రావాలి' ఆహ్వానించాడు సాకేత్. ఆ మాట వినగానే ఆవిడ మొహం వెలిగిపోయింది. 'చాలా సంతోషం నాయనా. కౌసల్య నా చెల్లెలులాంటిది. నేను తప్పకుండా వస్తాను' అని ఆనందంగా చెప్పారు రాజేశ్వరి. కాఫీ తాగి, కాసేపు కబుర్లు చెప్పి వస్తానంటూ సెలవు తీసుకుని సర్పంచ్ ఇంటికి వెళ్లాడు సాకేత్. ఆయనా ఫంక్షన్‌కి తప్పకుండా వస్తానని చెప్పారు. అలాగే మరికొద్ది మంది ఊరి పెద్దల్నీ కలిసి తల్లి షష్టిపూర్తికి రమ్మనమని ఆహ్వానించాడు సాకేత్. అందరూ ఎంతో సంతోషంతో వస్తామని వాగ్దానం చేశారు. తల్లి పట్ల వారికున్న ప్రేమ, ఆప్యాయత చూసి పొంగిపోయాడు సాకేత్. తల్లి శివపురం వదలి ఎందుకు రానంటుందో అతనికి అర్థం అయ్యింది. తర్వాత తన స్నేహితుడు రామకృష్ణ ఇంటికి వెళ్లాడు. అతను డిగ్రీ చదివి వ్యవసాయం చేసుకుంటున్నాడు. 'రా..రా.. ఎప్పుడు వచ్చావ్?' అని మిత్రుడిని అడిగాడు రామకృష్ణ. 'రెండు రోజులు అయ్యింది. పనులు మీద బయట తిరుగుతున్నాను. ఆదివారం మా అమ్మ షష్టిపూర్తి. నువ్వూ, లలితా తప్పకుండా రావాలి. నాకు సహాయం చేయాలి' అని మిత్రుడితో తను చేయదలచుకున్న పనులన్నీ చెప్పాడు. సాకేత్ చెప్పింది పూర్తిగా విని మిత్రుడి భుజం మీద చేయివేసి, అభినందించాడు రామకృష్ణ. ఏ పనికి ఎవర్ని పురమాయించాలో అన్నీ తను చూసుకుంటానని అభయం ఇచ్చాడు రామకృష్ణ. చాలాసేపు కబుర్లు చెప్పుకుని ఇంటికి వచ్చాడు సాకేత్. ఆ మర్నాడే సుప్రజా పిల్లలు చెన్నరు నుంచి వచ్చారు. తణుకు వెళ్లి వాళ్లని రిసీవ్ చేసుకుని, శివపురం తీసుకువచ్చాడు సాకేత్.
***
సాకేత్ శనివారం రాజమండ్రి వెళ్లి, డిజిటల్ ల్యాబ్‌లో పనిచూసుకుని తిరిగి వస్తున్నాడు. వేమగిరి దాటాక ఒక మహిళ సైకిల్‌కి పాల క్యాన్ కట్టుకుని, రాజమండ్రి కేసి వెళ్తుండడం చూశాడు. అకస్మాత్తుగా అతనికి తల్లి గుర్తుకు వచ్చింది. దానితోనే గతం మళ్లీ కళ్ల ముందు కదలాడింది. సాకేత్ పదోతరగతిలో ఉండగా అతని తండ్రి దుబారులో ప్రమాదవశాత్తు చనిపోయాడు. దీంతో వారి కుటుంబం సంక్షోభంలో కూరుకుపోయింది. భర్త దూరాన ఉన్నా, రెండేళ్లకో మూడేళ్లకో ఇంటికి వస్తాడన్న ఆశ ఉండేది కౌసల్యకు. ఇప్పుడు ఆ ఆశ కాస్తా అడియాస అయ్యింది. అనారోగ్యంతో బాధపడుతున్న మామగారు, కుటుంబానికి ఎదిగిరాని కొడుకు, ఆమెకు భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించింది. ఆపదలు చుట్టుముట్టినప్పుడే ధైర్యాన్ని కోల్పోకూడదన్న భర్త మాటలు ఆమెకి గుర్తుకు వచ్చాయి. మనసుని గట్టిపరచుకుంది. మరలా బ్యాంకులో అప్పు తీసుకుని, రెండో గేదెను కొనుక్కుంది. రామ్మూర్తి మాష్టారు సైకిల్ తీసుకుని, రాత్రిళ్లు తొక్కడం నేర్చుకుంది. ఎన్నోసార్లు కింద పడిపోయింది. కాళ్లకు, చేతులకు దెబ్బలు తగిలాయి. ఆమె గాయాలకు మందు రాస్తూ అడిగాడు సాకేత్ 'ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు?' అని. చిన్నగా నవ్వి కొడుకుని దగ్గరకు తీసుకుంది కౌసల్య. 'మార్టేరులో పాలకేంద్రం ఉంది నాన్నా. ఇంటింటికీ తిరిగి పాలు అమ్మక్కర లేకుండా అక్కడకి పాలు పట్టుకెళ్లి, ఇద్దామని సైకిల్ నేర్చుకుంటున్నాను' అంది. ఆమె మాటలకు సాకేత్ కళ్లల్లో కన్నీళ్లు గిర్రున తిరిగాయి. 'నేను సైకిల్ మీద పాలు పట్టుకెళ్లి మార్టేరులో ఇచ్చి, అప్పుడు స్కూల్‌కి వెళ్తాను' అని అన్నాడు. అతని మాటలు విని ప్రేమగా అతని తల నిమిరింది. 'నువ్వు బాగా చదువుకోవాలి నాన్నా. ఇలాంటి పనులు పెట్టుకుంటే నీకు స్కూల్‌కి ఆలస్యమవుతుంది. నీకు చదువు మీద ఏకాగ్రత కూడా ఉండదు. ఫరవాలేదు ఈ పని నేనే చేస్తాను' అంది కౌసల్య. సైకిల్ బాగా నేర్చుకున్నాకా వీర్రాజు షాప్‌లో పాత సైకిల్ ఒకటి కొనుక్కుంది. ఉదయాన్నే రెండు గేదెల పాలను, పక్క వీధిలోని రంగయ్య ఇచ్చిన పాలను క్యాన్‌లో పోసి, సైకిల్ క్యారేజికి కట్టుకుని సైకిల్ మీద మార్టేరు వెళ్లి ఇచ్చి వచ్చేది. రాత్రి పాలు చుట్టుపక్కల వారికి ఇచ్చేది. వర్షాకాలం కౌసల్య మార్టేరు వెళ్లడానికి చాలా కష్టపడేది. రైన్ కోటు వేసుకుని, సైకిల్ తొక్కుతుంటే ఇబ్బందిగా ఉండేది. గాలికి నెత్తిమీద టోపీ ఎగిరిపోయేది. వర్షంలో ఎదురుగా వచ్చే లారీలు వేగంగా వెళ్తుంటే, రోడ్డుమీద గోతులలో ఉన్న బురద నీళ్లు ఆమె మొహం మీద పడేవి. ఒకసారి లారీ మరీ మీదకు వస్తోందని రోడ్ మార్జిన్ కిందకు దిగడంలో సైకిల్ జారిపోయి, కింద పడిపోయింది కౌసల్య. పాలు అన్నీ నేల పాలయ్యాయి. అలా మూడేళ్లు నానా కష్టాలు పడింది. తర్వాత శివపురంలోనే పాల కేంద్రం పెట్టారు. కౌసల్య ఇబ్బందులు తొలిగాయి.
పదోతరగతి మంచి మార్కులుతో పాసైన సాకేత్ ఆర్థిక పరిస్థితి చూసిన పెనుగొండ రోటరీ క్లబ్ అతని ఇంటర్మీడియట్ చదువుకి పూర్తి ఆర్థిక సహాయం చేసింది. కొడుకు మీద బెంగతో కౌసల్య మావగారు సాకేత్ ఇంటర్ చదువుతున్నప్పుడు చనిపోయారు. ఇంటర్‌లోనూ సాకేత్ మంచి ర్యాంక్ సాధించాడు. ఐ.ఐ.టి.ప్రవేశ పరీక్షలో చక్కని ర్యాంక్ తెచ్చుకున్న సాకేత్‌కి చెన్నరు ఐ.ఐ.టి.లో సీట్ వచ్చింది. ఇంగ్లీష్ లెక్చరర్ సంజీవరావు సాయంతో సాకేత్‌ని చెన్నరులో చేర్పించింది కౌసల్య. స్కాలర్‌షిప్, తల్లి పంపిన డబ్బులతో జాగ్రత్తగా బి.టెక్. పూర్తిచేసి, ఆ తర్వాత పిహెచ్‌డీ చేశాడు సాకేత్. అతని ఆలోచనలు పూర్తయ్యేసరికి కారు శివపురం చేరింది.
***
సాకేత్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆదివారం రానే వచ్చింది. ఉదయమే కౌసల్యని తీసుకుని గుడికి వెళ్లాడు. తర్వాత తల్లిని, భార్యాపిల్లల్ని తీసుకుని, తణుకులోని వృద్ధాశ్రమం వద్దకు వెళ్లాడు. రాజమండ్రి నుంచి తెచ్చిన పంచెలు, కండువాలు, చీరలు అక్కడి వారికి తల్లి చేత ఇప్పించాడు. ఆశ్రమం అభివృద్ధికి తల్లి పేరుమీద లక్ష రూపాయల చెక్కుని మేనేజర్‌కి ఇచ్చాడు సాకేత్. తర్వాత అందరూ శివపురం వచ్చారు. సాయంత్రం రామకృష్ణతో తల్లిని ముందుగా లక్ష్ష్మీ జనార్థన స్వామి కల్యాణమండపానికి పంపించాడు. లలితను ఆమెకు తోడుగా ఉంచాడు. రాజమండ్రి నుంచి తెచ్చిన నగిషీలు ఉన్న మంచిగంధం పెట్టెను సాకేత్ నెత్తి మీద పెట్టుకుని, మంగళవాయిద్యాలు మోగుతుండగా తన స్నేహితులు, ఊరిపెద్దలు వెంటరాగా ఊరేగింపుగా బయల్దేరాడు. గ్రామంలోని అందరికీ ఆ పెట్టెలో ఏముందో చూడాలన్న ఆసక్తి కలిగింది. 'షష్టిపూర్తి సందర్భంగా తల్లికి చాలా విలువైన బహుమతే ఇస్తున్నాడు సాకేత్!' అని అందరూ అనుకున్నారు. అది తప్పకుండా చూడాలని అందరూ కల్యాణ మండపానికి వచ్చారు.
ముందుగా వేదిక మీదకు సర్పంచ్‌గారిని, రామ్మూర్తి మాష్టార్ని, సంజీవరావుగారిని ఆహ్వానించాడు రామకృష్ణ. తర్వాత కౌసల్యని ఆహ్వానించాడు. సాకేత్, సుప్రజ కౌసల్యని సాదరంగా వేదిక మీదకు తీసుకువచ్చారు. పండితులు వేద మంత్రాలు చదువుతుండగా సాకేత్, రాజమండ్రి నుంచి తెచ్చిన పవిత్ర గోదావరి జలాలతో తల్లి పాదాలు కడిగి, పువ్వులతో పాదపూజ చేశాడు. వేదిక ముందు కూర్చున్నవారు అందరూ ఎంతో ఆసక్తిగా ఆ కార్యక్రమాన్ని చూసి 'కౌసల్య చాలా అదృష్టవంతురాలు. బంగారంలాంటి కొడుకు, కోడలు, రత్నాల్లాంటి మనవలు లభించారు' అని శ్లాఘించారు.
రామకృష్ణ మాట్లాడుతూ 'కౌసల్య పెద్దమ్మ మహిళలందరికీ ఆదర్శమూర్తి. తన కుటుంబం కోసం ఎన్ని కష్టాలు పడిందో మన శివపురం ప్రజలందరికీ తెలుసు. జీవితంలో ఎన్ని తుపాన్లు వచ్చినా బెంబేలు పడలేదు. ధైర్యాన్ని కోల్పోలేదు. కొడుకుని ఒక విద్యావంతుడ్ని చేయాలన్న లక్ష్యంతో శ్రమించి, విజయం సాధించింది. సాకేత్ చెన్నరులో చదువుతున్నప్పుడు, తనూ చదువుకోవాలని బి.ఏ. ప్రైవేటుగా కట్టి పాస్ అయ్యింది. ఇది కౌసల్య పెద్దమ్మ సాధించిన మరో విజయం' అని అనగానే సభ అంతా చప్పట్లతో మారుమోగింది. 'ఇప్పుడు రామ్మూర్తి మాష్టారు ప్రసంగిస్తారు' అని చెప్పాడు రామకృష్ణ.
రామ్మూర్తి మాష్టారు అందరివైపు పరికించి చూశారు. 'మీరందరూ సాకేత్ తెచ్చిన పెట్టెలో ఏముందో అని చాలా ఆతృతగా ఉన్నారు. ఒక కొడుకు తన తల్లికి ఇచ్చిన అపూర్వమైన కానుక ఈ పెట్టెలో ఉంది. ఈ పెట్టె తెరవమంటారా?' అని నవ్వుతూ అడిగారు. రామ్మూర్తి మాష్టారు పెట్టె తెరచి, అందులోంచి ఒక డిజిటల్ ఆల్బం బయటకు తీశారు. ఆల్బంపైన కౌసల్య ఫొటో ఉంది. దానికి కింద 'అమ్మకు ప్రేమతో' అన్న అక్షరాలు, రెండు చేతులతో నమస్కరిస్తున్న సాకేత్ ఫొటో ఉంది. రామ్మూర్తి మాష్టారు మాట్లాడటం మొదలుపెట్టారు. 'ఈ ఆల్బంలో కౌసల్యకు ఆమె భర్త దుబారు నుంచి రాసిన ఉత్తరాలు ఉన్నాయి. ఇవి ఆమెకి ఎంతో ప్రాణప్రదమైనవి.. సాకేత్‌కి పవిత్రమైనవి. ఈ ఉత్తరాలు ఒక భర్త తన భార్యకు రాసినవైనా, అందులో ఎన్నో జీవన సత్యాలు దాగి ఉన్నాయి. మనిషిని సన్మార్గం వైపు పయనింపజేసే సందేశాలు ఉన్నాయి. నేను రెండు ఉత్తరాలు మాత్రమే చదువుతాను' అని మాష్టారు ఆల్బం మొదటిపేజీ తెరిచి, సభలోని వారందరికీ చూపించారు. పేజీ పైన కౌసల్య భర్త చిన్న ఫోటో, ఉత్తరం, పేజీ చుట్టూ రంగు రంగుల పువ్వులతో ఉన్న బోర్డరు. చాలా అందంగా ఉంది. మాష్టారు చదవడం ప్రారంభించారు.
'చిరంజీవి కౌసల్యకు! నీ భర్త దశరథ దీవించి రాయునది. నేను ఇక్కడ క్షేమం. నువ్వు, నాన్న, బుజ్జి కులాసా అని తలుస్తాను. మన కుటుంబానికి ఒక స్థిరత్వం ఉండాలని ఉపాధి కోసం ఇంతదూరం వచ్చాను. మనం మన పిల్లల మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. అందుకే మన బుజ్జికి ప్రేమ, ఆప్యాయత, పరోపకారం, దేశభక్తి గురించే చెప్పు. ఏనాడూ పగ, ద్వేషం గురించి తెలియనివ్వకు. మనం ఈ సమాజానికి మంచే చేయాలి. అది గట్టిగా వాడి మనసులో బలంగా రూపుదిద్దుకోవాలి. మన బుజ్జి సమాజానికి ఉపకారి కావాలి. నీ మీద కుటుంబ బాధ్యత ఎక్కువగా మోపానని నన్ను అపార్థం చేసుకోవుగా.. ప్రేమతో దశరథ'.
మాష్టారు చదవడం పూర్తి చేసేసరికి కౌసల్య కళ్లంట నీళ్లు జలజలా రాలుతున్నాయి.
ఒక నిముషం ఆగి.. రెండో పేజి తిప్పి చదవసాగారు మాష్టారు. 'చిరంజీవి కౌసల్యకు! నీ భర్త దశరథ దీవించి వ్రాయునది. ఉభయ కుశలోపరి. నువ్వు కుటుంబం కోసం చాలా శ్రమ పడుతున్నావని మొన్న నేను వచ్చినపుడు గ్రహించాను. నీకు ఈ ఇబ్బంది కొద్దికాలమే. నేను మన ఊరు తిరిగి వచ్చేశాక నీకు విశ్రాంతి ఇస్తాను. వర్షం కురిసి వెలిసాకే ప్రకృతి చాలా అందంగా, సౌందర్య భరితంగా కనిపిస్తుంది. మన కష్టాలు అంతే. అవి తొలగిపోయాకా మన జీవితమూ సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. జీవితం తేలికగా ఉండదు. మనమే గట్టిగా, దృఢంగా ఉండాలి. మనతో పాటు మన చుట్టూ ఉన్నవారూ సంతోషంగా ఉండాలని మనం సదా కోరుకోవాలి. మన బుజ్జి బాగా చదువుతున్నాడని చెప్పావు. సంతోషం. విద్య, వివేకం నూతిలోని నీరులాంటివి. ఇతరులకు ఇచ్చేకొద్దీ ఊరుతూనే ఉంటాయి. మన బుజ్జి విద్యావంతుడై, తన జ్ఞానాన్ని, అనుభవాన్ని పదిమందికీ పంచాలి. అదే నేను కోరుకునేది.. ప్రేమతో .. దశరథ'.
మాష్టారు చదవడం పూర్తిచేసేసరికి సాకేత్ కళ్లమ్మట నీళ్లు గిర్రున తిరిగాయి. ఈ దృశ్యం చూసిన అక్కడి వాళ్ల కళ్లు చెమర్చాయి. మాష్టారు ఆల్బం సాకేత్ చేతికి ఇచ్చారు. సాకేత్ ఆల్బం తల్లి చేతిలో పెట్టి, ఆమె పాదాలకు నమస్కరించాడు. తర్వాత మైకు దగ్గరకు వచ్చాడు. 'మీ అందరికీ నా వినయ పూర్వక నమస్కారాలు. మా అమ్మ మీద అభిమానంతో మీరందరూ వచ్చారు. మా అమ్మ షష్టిపూర్తికి ఆమెకి ఏం కానుక ఇవ్వాలా? అని ఆలోచించాను. ఎంతో ఖరీదైన బహుమతి ఇవ్వాలని అనుకుంటే, అమ్మకు ప్రాణప్రదమైన నాన్న ఉత్తరాల కన్నా విలువైనది ఏదీ లేదని తెలుసుకున్నాను. అందుకే వాటిని అందంగా అలంకరించి, అమ్మకు ప్రేమతో సమర్పించు కున్నాను. నాకు జన్మనివ్వడమే గాక, నన్ను తీర్చిదిద్దిన అమ్మకు ఏం చేసినా ఋణం తీరదు. వచ్చే జన్మలోనూ ఆమె కడుపునే కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నా' అంటూ.. భావోద్వేగానికి గురయ్యాడు సాకేత్. కౌసల్య కొడుకు దగ్గరకు వచ్చి, ప్రేమగా అక్కున చేర్చుకుంది.
ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి
9848663735