Oct 11,2023 23:24

హార్డ్‌ స్కూల్‌ కార్యక్రమంలో మాట్లాడుతున్న ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ

ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : అమ్మకు ఆరోగ్యం బాగా లేకుంటే కూతురే అమ్మకు అమ్మవుతుంది.. నాన్న మనసుకు కష్టం కలిగితే కూతురే ఓదార్పు అవుతుంది.. అని పల్నాడు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి (డిఎంహెచ్‌ఒ) డాక్టర్‌ బి.రవి అన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నరసరావుపేట పట్టణం పల్నాడు రోడ్డులోని ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజీలో బుధవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఒ మాట్లాడుతూ గత పదేళ్లలో బాలికలకు సంబంధించిన సమస్యలపై శ్రద్ధ పెరిగిందని, ప్రపంచ వేదికలపైనా బాలికలు తమ గళాన్ని వినిపించడానికి అవకాశాలు పెరిగాయని చెప్పారు. అయినా బాలికలకు హక్కులపై అవగాహన పరిమితంగానే ఉందని, ప్రపంచ వ్యాప్తంగా బాలికలు లింగ అసమానత వివక్షతకు గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. బాలికలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, వారిని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందులో కుటుంబీకులతోపాటు సమాజమూ ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. 'డిజిటల్‌ జనరేషన్‌-అవర్‌ జనరేషన్‌' అనే నినాదం బాలికలకు అత్యవసరమన్నారు. బాల్య వివాహాల నియంత్రణకు అందరూ కృషి చేయాలన్నారు. లింగ నిర్ధారణ చట్టం నోడల్‌ అధికారి డాక్టర్‌ బి.గీతాంజలి మాట్లాడుతూ లింగ వివక్షత ఉండకూడదని, మహిళల వెనకబాటుకు వారిపట్ల ఉన్న చిన్నచూపు కూడా ఒక కారణమని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సోము మల్లయ్య మాట్లాడుతూ సమానమైన అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో పాటు సమాజమూ చేయూతనివ్వాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎన్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎంఎస్‌ సుధీర్‌, ఎం.అనిల్‌ కుమార్‌, డాక్టర్‌ పిఎన్‌విడి మహేష్‌, డాక్టర్‌ ఎం.రమేష్‌, డి.రామకృష్ణారెడ్డి, ఖాజావలి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కొనసాగుతున్న వివక్ష : ట్రైనీ కలెక్టర్‌
పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నా కొంత మేరకు వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉందని ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ అన్నారు. నరసరావుపేటలోని హార్డ్‌ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి బాలిక సంరక్షణ జిల్లా అధికారి బి.విజరు కుమార్‌ అధ్యక్షత వహిచగా ట్రైనీ కలెక్టర్‌ మాట్లాడుతూ పురుషులతో పాటు మహిళలకూ సమాన హక్కులున్నాయని చెప్పారు. మానసికంగా మహిళలు ధృడంగా ఉండాలని, పని ప్రదేశాల్లో సమస్యలు ఎదురైతే పెద్దలకు, పోలీసులకు ధైర్యంగా చెప్పి వాటిని పరిష్కరించు కోవాలని చెప్పారు. హక్కులు ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో హెల్త్‌ ఆఫీసర్‌ పద్మావతి, దిశ ఎస్‌ఐ గౌతమి, ఐసిడిఎస్‌ జిల్లా పీడీ బి.అరుణ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మాచర్ల : విద్య వల్లనే జీవితాల్లో మార్పు సాధ్యమని ఎంఇఒ వి.నాగయ్య అన్నారు. స్థానిక జెడ్‌పి పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి అయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఇదే పాఠశాలలో తాము చదువుకున్నామని, పాఠశాలకు పక్కనే చాలా పెద్ద ఆట స్థలం ఉండేదని, అది ఆక్రమణకు గురవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థి అయిన నాగరాజు మైక్‌సెట్‌ కొనుగోలుకు రూ.10 వేలను పాఠశాలకు విరాళంగా ఇచ్చారు. హెచ్‌ఎం షేక్‌ షకీనా, ఉషారాణి, కౌన్సిలర్‌ జి.అరుణ కోటిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇదే పాఠశాలలలో జన విజ్ఞాన వేదిక (జెవివి) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఇన్‌ఛార్జి హెచ్‌ఎం ఉషారాణి అధ్యక్షత వహించగా ప్రభుత్వ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్‌ లక్ష్మీకుమారి మాట్లాడారు. జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి జెవికెస్‌ ప్రసాదు, గౌరవ అధ్యక్షులు కె.ఆదినారాయణ, ఆయేషా సుల్తానా, పి.నరసింహరావు పాల్గొన్నారు.