Mar 13,2022 13:23

వణికించే చలిలో
హాయైన దుప్పటి
అమ్మ కొంగే...
ఊపిరాడని ఉక్కపోతలో
సేదతీర్చే గాలి పంఖా
మా అమ్మ కొంగే....

గుడ్డి దీపం కింద
ఉల్లిగడ్డలు కోత్తంటే...
ఏలు తెగి కారే నెత్తురుని
కళ్లల్లో కారే కన్నీళ్లని
ఏకకాలంలో ఆపేది
మా అమ్మ కొంగే మరీ...

అమ్మ కొంగు
వేల దుఃఖపు ప్రవాహాలను
అలవోకగా పీల్చుకునే స్పాంజి

మాయమ్మ
పంట శేలల్లో పనికొంగినపుడు
నడుము సుట్టు
వడ్డానమోలే కనపడ్తది
మాయమ్మ
సృష్టి భారాన్నంతా
నెత్తిమీదకెత్తుకున్నపుడు
సుట్ట బట్టయి నిలబడతది

మాయమ్మ గొంతులో
ఆత్మగౌరవ నినాదం
ధ్వనించినపుడు
మాయమ్మ కొంగే...
విజయ పతాకమై
రెపరెపలాడతది

ఆత్మగౌరవం భంగపడినపుడు
ఆ అమ్మ కొంగే...
ఉరితాడై వేలాడతది
ఆత్మగౌరవానికి పానం పోత్తే
అమ్మ కొంగోలే..నిలువెత్తు
రూపమై నిలబడతాది

దిలీప్‌.వి
84640 30808