గ్లోబల్ సామ్రాజ్యాన్ని నిర్మించడం అమెరికా ఉద్దేశం. అంతర్జాతీయ ద్రవ్య సంస్థల తోడ్పాటుతో ప్రపంచ దేశాలను మాకు దాసోహం అయ్యేలా చేసుకోవడమే మా లక్ష్యం. దీనికోసం మాఫియాలో ఉండే మిత్రులలాగే కొన్ని వరాలిస్తాం. విద్యుత్ కేంద్రాలు, రహదారులు, రేవులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులే ఈ వరాలు. నిజానికి ఈ రూపంలో ఇచ్చిన డబ్బు మా దేశాన్ని వదిలిపోదు. కాంట్రాక్టర్లు మావాళ్లే. తీసుకున్న దేశాలే అప్పుల ఊబిలో కూరుకుపోతాయి.
- జాన్ పెర్కిన్స్, 'ఎకనామిక్ హిట్‌మాన్' నుంచి
విద్యుత్ పంపిణీ, ఉత్పత్తి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ప్రైవేటీకరించాలని రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు వున్న రూ.20 వేల కోట్ల బకాయిలను వీలైనంత త్వరగా వసూలు చేసుకునే పనిలో ప్రభుత్వం ఉంది. దీనిలో భాగంగానే సర్దుబాటు ఛార్జీల పేరుతో ఎనిమిది నెలల కాలానికి రూ.3669 కోట్ల బాదుడుకు సిద్ధమైంది. కేంద్రం విధించిన షరతులకు అంగీకరించి అప్పు తెచ్చుకున్న రాష్ట్రం ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సర్దుబాటు ఛార్జీల కింద రూ.3669 కోట్లు వసూలుకు ఎపిఇఆర్‌సి అనుమతివ్వడం వెనుక ఇదే ప్రధాన కారణమనే అభిప్రాయాన్ని పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల్లో భాగంగా కంపెనీలను ప్రైవేటీకరించాల్సి వుంది. వాటిని తీసుకునే కంపెనీలు నష్టాల్లో వుంటే ముందుకు రావు. దీంతో ఇప్పుడున్న నష్టాలకు సంబంధించిన బకాయిలన్నీ ప్రజల నుండి వీలైనంత తొందరగా వసూలు చేసి లాభాల్లోకి వచ్చిన తరువాత ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టనున్నారు. దీనిలో భాగంగానే స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు సిద్ధమాయ్యరు. వ్యవసాయ బోర్లకూ మీటర్లు బిగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రీ పెయిడ్ మీటర్లు బిగించాలని నిర్ణయించారు. ఇవన్నీ బిగించిన తరువాత వాటి నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు. ప్రీ పెయిడ్ మీటర్లంటే ముందుగానే విద్యుత్‌కు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసుకోవడం (సిమ్‌కార్డు రీఛార్జి టైపు). ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కేంద్రం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తోంది. ప్రస్తుతం ట్రాన్స్‌మిషన్, జనరేషన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు సంబంధించి సుమారు రూ.20 వేల కోట్ల బకాయిలున్నాయి. వీటిని నిర్వహణ ఖర్చులుగా ప్రభుత్వం చూపిస్తోంది. ఇంత పెద్దమొత్తంలో బకాయిలు తీర్చుకోవాలంటే సర్దుబాటు ఛార్జీలకు అనుమతి ఇవ్వాలని ఆయా కంపెనీలు ఎపిఇఆర్‌సి ని కోరాయి. అది కూడా వీలైనంత త్వరగా వసూళ్లకు అవకాశం కల్పించాలనీ విన్నవించాయి. మూడు విడతలుగా 21 కోట్ల వసూళ్లు చేసుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ సంస్థలు ప్రతిపాదించిన మొత్తంలో రూ.3669 కోట్లను తొలి ఎనిమిది నెలల కాలంలో వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. వాస్తవంగా బిల్లుల రూపంలో ఇప్పటికే ప్రజల నుండి పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నాయి. తాము ధరలు పెంచలేదని, భారాలు వేయలేదని పైకి చెబుతున్నా బిల్లుల్లో మాత్రం విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. గత రెండేళ్లలో కరోనా పేరుతో, బిల్లుల్లో తప్పుల పేరుతో ఇష్టారాజ్యంగా వసూళ్లు చేశాయి.
ఆ కాలంలో సర్దుబాటు నిజమేనా
వాస్తవంగా 2014-2019 మధ్య కాలంలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. అయితే విడిపోయిన సమయంలో ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో చౌకగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఆర్‌టిపిపి, ఎన్‌టిటిపిఎస్ వంటి సంస్థల్లో ఉత్పత్తిని నిలిపేశారు. అయినా కేంద్రం విధించిన షరతుల మేరకు ప్రైవేటు సంస్థల నుండి అనివార్యంగా విద్యుత్‌ను కొనుగోలు చేశారు. రాష్ట్రంలో అప్పుడే సంస్కరణలపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. చౌకగా విద్యుత్ వస్తుంటే ఉత్పత్తి చేసుకోకుండా, రిత్విక్, సాయి సుధాకర్ వంటి సంస్థల నుండి కొనుగోలు చేశాయి. రిత్విక్ కంపెనీ యజమాని సిఎం రమేష్ ప్రస్తుత బిజెపి ఎంపిగా ఉన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్తత్తి, వినియోగం, అమ్మకం విషయంలో కేంద్రం పూర్తిస్థాయిలో పట్టు సాధించింది. కీలకమైన ఈ వ్యహారంలో అప్పటి చంద్రబాబు నాయుడు గానీ, ఇప్పటి జగన్ మోహన్‌రెడ్డి గానీ కేంద్రాన్ని ప్రశ్నించడం మానేశారు. షరతుల్లో భాగంగా చెప్పింది చేసేస్తున్నారు.
బకాయిలన్నీ ప్రజల పైనే
ఆయా కంపెనీల బకాయిలను ప్రజల నుండి వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా సర్దుబాటు ఛార్జీల పేరుతో అదనపు భారాలు మోపుతోంది. ఇఆర్‌సి ఇచ్చిన అనుమతి మేరకు ఎనిమిది నెలలోపు వసూళ్లు అయిపోతే వెంటనే మరోవిడత విధింపు అనివార్యంగా ఉంటుంది. లేకపోయినా కొనసాగింపు ఉంటుంది. వీలైనంత త్వరగా బకాయిలు వసూలు చేసుకోవాలనే ఉద్దేశంతోనే అతి తక్కువ కాలానికి అంత పెద్ద మొత్తం వసూలు చేసుకునే అవకాశం కల్పించారనే విమర్శలూ వస్తున్నాయి.
అధిక ధరకు విద్యుత్ కొనుగోలు
రాష్ట్రంలో 2017ా19 మధ్య కాలంలో విద్యుత్ ఉత్పత్తి సరిపడినంత ఉన్నప్పటికీ సంస్కరణల్లో భాగంగా సోలార్ విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రానికి 8354 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా 30 శాతం సోలార్ విద్యుత్‌ను కొనుగోలు చేశారు. వాస్తవంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు తక్కువ. అయినా జెన్‌కో మాత్రం ఎక్కువ ధరకు కొనుగోలు చేసింది. అదీ రిత్విక్స్ ఎనర్జీ, సాయి సుధీర్, ఎంఈఐఎల్ కంపెనీల నుండి ఏకంగా కిలో వాట్‌ను రూ.10.65కు కొన్నారు. అదే జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి రూ.3.87 పైసలు, హైడల్ విద్యుత్ రూ.1.37 పైసలుగా ధర నిర్ణయించారు. ఒకవేళ విద్యుత్ సరిపోయినంత వుంటే అధిక ధరకు కొనుగోలు చేస్తున్న సోలార్ విద్యుత్‌ను నిలిపేసి థర్మల్ విద్యుత్ కొనుగోలు చేసుకోవాల్సి వుండగా అదేమీ చేయకుండా ప్రైవేటు సంస్థల నుండి కొనుగోలు చేశారు. సదరన్ గ్రిడ్ ఫ్రీక్వెన్సీని కొనసాగించాలనే పేరుతో అవసరం లేకపోయినా విద్యుత్ కొనుగోలు చేపట్టారు. ప్రైవేటు యూనిట్ల నుండి పిపిఏ (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్) ప్రకారం కొనుగోలు చేస్తున్న విద్యుత్‌ను నిలిపేసి జెన్‌కో నుండి తీసుకోవచ్చు. అయినా అధికారులు జెన్‌కో ప్లాంట్లలో విద్యుత్ నిలిపేశారు. పైగా సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఇసిఐ) కడప యూనిట్ నుండి రూ.2.88కే కొంటోంది. అదే ఒప్పందంలో కిషోర్ ఎలక్ట్రో ఇన్‌ఫ్రా, శ్రీపవర్, గజానన్, అమృతజల్ ఉత్పత్తి కేంద్రాల నుండి యూనిట్ రూ.5.67కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వీటితోపాటు న్యూ ఎరా వెంచర్, వల్లాల సుజాత ఎనర్జీ, సాయి అచ్యుత ఎనర్జీ, నుండి రూ.6.49 కి, సుమేరు నుండి 6.45 కి చేసుకున్నారు. ఇలా ఒప్పందాలు చేసుకోవడం కూడా సంస్కరణల్లో భాగమే.
ఇప్పుడు మానిటైజేషన్ పేరుతో ట్రాన్స్‌మిషన్ లైన్లను, చౌకగా విద్యుత్తు ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తు, సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ప్రైవేటు హస్తగతం చేస్తే వినియోగదారుల పరిస్థితి ఏమిటో ఊహించనలవి కాదు.
వల్లభనేని సురేష్
వ్యాసకర్త : ప్రజాశక్తి బ్యూరో చీఫ్










