కరోనా నేపథ్యంలో సంప్రదాయ మీడియా... మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధంగా వుందని 'వైర్' పత్రిక వ్యవస్థాపకులలో ఒకరైన ఎం.కె.వేణు ఇటీవల పతాక కథనం రాశారు. పత్రికలు, టీవీ ఛానళ్లు కష్టనష్టాలలో మునిగి పాలకులకు సన్నిహితులైన కార్పొరేట్ల గుప్పిట్లోకి పోతున్నాయని ఆయన ఉదాహరణలతో సహా చెప్పారు. లేదంటే పైకి చెప్పని సబ్సిడీదాతలు వాటిని నడిపిస్తున్నారు. దేశంలో మీడియాను మోడియాగా మారుస్తున్నారనే కథనాలు, కల్పిత వార్తల కలవరం, టీఆర్‌పి స్కామ్‌లలో అరెస్టులు, సుప్రీం కోర్టు దాకా వెళ్లగా మీడియా సంస్థలపై దాడులు మరోవైపు సాగుతుండగా ఈ పరిణామ క్రమం ఆందోళనే కలిగిస్తుంది. ఇదే సమయంలో సోషల్ మీడియా డిజిటల్ మీడియా విస్తరించడం, అందులోనూ అధిక భాగం అధికార పార్టీల స్పాన్సర్డ్ తరహాలో నడుస్తుండగా ప్రత్యామ్నాయ ప్రజాశక్తుల ప్రయత్నాలు కూడా చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనే సోషల్ మీడియాను తనకు వ్యతిరేకంగా వాడుతున్నారని ట్రంప్ ఆరోపణలు చేయడం, మోడీ సర్కార్ కూడా తమ మంత్రుల ట్వీట్లను తొలగించారని తగాదా పెట్టుకోవడం, పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ సంస్థల ప్రతినిధులు రావడానికి నిరాకరించడం చూశాం. ఎ.పి లో ఎల్లో మీడియా, బ్లూ మీడియా ఆరోపణలు, తెలంగాణలో మీడియా కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదనే ఫిర్యాదులు వింటున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శ చేసే కొన్ని మీడియా శక్తులు బిజెపి విషయంలో గప్‌చుప్‌గా వుండటం, లేదంటే నామకార్థంగా సరిపెట్టడం ఇంకో వాస్తవం. వీరంతా కూడా పాలక పార్టీల మధ్య గిరిటీలు కొట్టడం తప్ప ప్రజా ఉద్యమాలు, ప్రజాస్వామిక లౌకిక విలువల వంటి అంశాలను పక్కకు ఉపేక్షించడమూ జరుగుతోంది. ఈ మధ్యలో పత్రికలు, చానళ్ల సిబ్బంది జీవితాలు తలకిందులు కావడం మరో కఠోర వాస్తవం. వామపక్ష పత్రికలు మాత్రమే సమరశీల ఉద్యమాలను బలపరుస్తూ సమతుల్యంగా వుండే ప్రయత్నం చేస్తున్నా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
పడిపోయిన ఆదాయాలు, సాంకేతిక మార్పులు
దేశంలో అత్యగ్ర స్థానాన వుండే 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రచురణకర్త బెన్నెట్ కాల్మన్ కంపెనీతో సహా సంక్షోభంలో చిక్కాయి. 'టైమ్స్' సర్క్యులేషన్ 2020లో సగానికి సగం తగ్గి తర్వాత కొద్దిగా కోలుకుంది. ఏడాదికి ఏడు వేల కోట్ల వ్యాపారం జరిగినా గతానికి చేరుకునే అవ కాశం ఎక్కడా లేదట. దక్షిణ భారతంలో ప్రతిష్టాత్మకమైన 'హిందూ', ఉత్తరాదిన 'హిందూస్తాన్ టైమ్స్' వంటివి కూడా దెబ్బతిన్నాయి. ఇదంతా కేవలం కరోనా కారణంగానే కాదు. కరోనా పత్రికల క్షీణతను వేగిరపర్చిందే గాని ఏకైక కారణం కాదు. మొదట టీవీ ఛానళ్లు తర్వాత డిజిటల్ మీడియా తెచ్చిన సాంకేతిక మార్పులు ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు యువతలో నలభై శాతం మొబైల్ ఫోన్లలో లాప్‌టాప్‌లలో తప్ప పత్రికలు పట్టుకుని చదవడానికి ఇష్టపడటం లేదని రాయిటర్స్ సర్వేలో తేలింది. కరోనా వల్ల పంపిణీ నిలిచిపోవడం దీన్ని అలవాటు చేసింది. ఉధృతి తగ్గాక పంపిణీ పున:ప్రారంభమైనా పాత పరిస్థితి రాలేదు. పశ్చిమ దేశాల్లో పత్రికల వ్యాప్తి తర్వాత కొన్ని దశాబ్దాలకు టీవీలు వచ్చాయి. కాని ఇండియాలో డెబ్బయ్యవ దశకానికి అటూ ఇటుగా పత్రికలు టీవీలు కూడా విస్తరించాయి. 2000 సంవత్సరం మొదటి దశాబ్దంలో కూడా భారీగానే పెట్టుబడులు పెట్టారు. అంతర్జాతీయంగా అప్పటికే పత్రికలు మూతపడే ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్‌లో విభజన ఉద్యమం మీడియానూ ప్రభావితం చేసింది. 2014 ఎన్నికల తర్వాత ఈ మార్పులన్నీ ఒక కొలిక్కి వచ్చాయి.
మోడీ సర్కారు దాడులు, ఒత్తిళ్లు
మోడీ ప్రభుత్వం కొద్ది కాలంలోనే మీడియా స్వేచ్ఛపై దాడులు చేయడం, హేతువాద రచయితలు, సంపాదకులపై ప్రజాపక్ష మేధావులపై దాడులు పెంచడం, ఆర్ణబ్ గోస్వామి వంటివారిని ఆకాశానికెత్తడం ప్రగతిశీల, మధ్యేవాద మీడియాకు విఘాతంగా పరిణమించింది. వాటిపై నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఇ.డి ని, ఆదాయపు పన్ను శాఖను ఉసిగొల్పి నిబంధనలు మార్చి ఆంక్షలతో వేధించడం పెరిగింది. ఎన్.డి టి.వి, వైర్, న్యూస్ స్కాన్ వంటి వాటిపై దాడులను ఇందుకు ఉదాహరణలుగా చూడొచ్చు. అసలు ప్రధాని ఏడేళ్లలో ఒక్కసారి కూడా పూర్తి స్థాయి మీడియా సమావేశం జరపకపోవడం తూష్ణీభావాన్ని వెల్లడించింది. రాష్ట్రాలలో పాలకులు చాలామంది అదే వరవడిని అమలు చేశారు. ఎడిటర్లుగా యాంకర్లుగా తాము చెప్పినవారిని పెట్టి తమకు అనుకూలంగా కథనాలు ఇవ్వకపోతే ప్రసారాలు, ప్రకటనలు నిలిపివేయడం పరిపాటిగా మారింది. మామూలుగానే పాలక వర్గాలలో ఎవరో ఒకరికి కొమ్ముకాసే అలవాటు, అవసరం వున్న మీడియాధిపతులు వారి వెనక రాజకీయార్థిక శక్తులు స్వంత ఎజెండాలను మరింత బలంగా రుద్దడమూ పెరిగింది.
డిజిటల్ మొగ్గుకు వెనక...
మీడియా సంస్థలకు పాఠకులు లేదా ప్రేక్షకుల ద్వారా వచ్చే ఆదాయం పరిమితం. అడ్వర్టయిజ్‌మెంట్లు అతి కీలక ఆర్థిక వనరు. అందులోనూ ఎఫ్.ఎం.సి.జి లు (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) యాడ్స్, ప్రభుత్వాల ప్రకటనలు ముఖ్యం. దేశంలో రాజకీయ విభజన తీవ్రమైన తర్వాత వ్యాపార ప్రకటనల ఆదాయం దారుణంగా పడిపోయింది. కరోనాలో యాడ్ప్ చాలా కాలం నిలిచిపోవడమే గాక నలభై శాతం రేటు తగ్గించారు. చేతికి పట్టనన్ని పేజీలు వేసిన పత్రికలు ఇప్పుడు పలచగా వస్తున్నాయి. వాటి లోని ఉద్యోగులను ఊచకోత కోశాయి. అన్నీ బాగుంటేనే వార్తా ఛానళ్లకు పత్రికలకు యాడ్ ఆదాయంలో ఎనిమిది శాతం మాత్రమే వస్తుంది. అధిక భాగం వినోదపు ఛానళ్లకు వెళుతుంది. డిజిటల్ మీడియా చౌకగా అందుబాటు లోకి రావడమే గాక తమ చెప్పుచేతల్లో వుంటుంది గనక యాడ్స్ అటు మళ్లుతున్నాయి. పత్రికల సర్క్యులేషన్, టీవీల రేటింగుల కన్నా డిజిటల్ మీడియాలో వీక్షకుల సంఖ్య పారదర్శకంగా వుంటుందని అడ్వర్టయిజర్లు అంటున్నారు. అన్ని చానళ్లకూ డిజిటల్ విభాగాలు ఆదాయవనరుగా మారాయి. వాటి ప్రసారాలు కూడా అందుకు తగినట్టే మలచబడుతున్నాయి. ఈ ఆదాయంపై కమిషన్ గూగుల్, యూ ట్యూబ్, ట్విట్లర్ వంటి వాటికి ఎక్కువగా పోతుంది. వాటిలోనే వార్తలు కథనాలు చూడటం ఒకవైపు, యాడ్స్ కూడా అటు వైపు మరలాయి. సినిమాలు కూడా ఓటిటి పేరిట నెట్ ఫ్లిక్స్ అమెజాన్ వంటి వాటిలో ప్రసారమవుతుండటంతో సినిమా థియేటర్ల ప్రాభవం కొడిగట్టింది.
వీటన్నిటి ఫలితంగా పత్రికలు ఎడిషన్లు మూసివేయడం, ఇతరులకు ఇవ్వడం, వెబ్ లోకి మారడం జరిగిపోతున్నది. జీ నెట్‌వర్క్‌తో సహా అమ్మకానికి పెట్టబడుతున్నాయి. లోలోపల అమ్ముడుపోయిన సంస్థలు మరెన్నో. అందుకు నిరాకరించేవాటి పైనా ఒత్తిళ్లు. ఎన్‌డి టి.వి ని అదానీ కొన్నట్టు ప్రచారం జరిగి, దాని వాటాల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. అయితే అదేమీ జరగలేదని ఆ సంస్థ అధినేతలైన ప్రణరు రారు, రాధికా రారు ప్రకటించారు. న్యూస్‌క్లిక్‌ను లేనిపోని దాడులతో లొంగదీసుకోవాలని ప్రయత్నించి సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు ఏదో సర్వే నాటకం నడిపిస్తున్నారు. అంబానీకి తెలుగులో అతి పెద్ద మీడియా గ్రూపుతో సహా దేశవ్యాపితంగా చాలా సమాచార సామ్రాజ్యం వుంది. బిర్లాలు అంతకు ముందే రంగంలో వున్నారు. ఇప్పుడు అదానీ గ్రూపు కాలూనడంతో మీడియాలో కార్పొరేట్ పట్టు మరింత బిగుస్తుంది. ట్విటర్ వంటివి కూడా లాభాల కోసం ఆయా దేశాల పాలకవర్గాలతో ఎలాగూ అవగాహనకు వస్తాయి. డీమానిటైజేషన్ నుంచి ఇప్పటి మానిటైజేషన్ వరకూ లోతుపాతులు విప్పి చెప్పకపోగా సానుకూలంగా చిత్రించడం, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలలో ప్రజాస్వామిక భావజాలానికి వ్యతిరేకంగా కథనాలు ఈ క్రమంలో మరింత పెరుగుతున్నాయి. కనుకనే మీడియా స్వేచ్ఛను కాపాడుకోవడంతో పాటు ప్రజాస్వామిక వాణిని వినిపించే కర్తవ్యం ఇంకా కష్టతరమవుతుంది.
- తెలకపల్లి రవి










