Mar 24,2021 06:37

బీమా సంస్థల ప్రైవేటీకరణ, ఎల్‌ఐసి లో వాటాల అమ్మకానికి మోడీ ప్రభుత్వం చట్టాలను సైతం సవరిస్తోంది. ఇందుకు ఎల్‌ఐసి ఉద్యోగుల నుంచి, బీమా రంగ పరిరక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అయినప్పటికి మోడీ అండ్‌ కో ఎల్‌ఐసి ని లిస్టింగ్‌ చేసి, ప్రభుత్వ వాటాల అమ్మకానికి మొండిగా ముందుకెళ్తోంది.

ఏదైనా సంస్థను లిస్టింగ్‌ చేయడం అంటే, అందులో వాటాలను షేర్‌ మార్కెట్‌లో అమ్మడం. 1956లో పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థగా ఆవిర్భవించిన ఎల్‌ఐసి ఇప్పటిదాకా 100 శాతం ప్రభుత్వ సంస్థగానే ఉంది. ప్రభుత్వం ఎల్‌ఐసి లో వాటాలు అమ్మాలని నిర్ణయించడం వలన, ఎల్‌ఐసి లో ఉన్న ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించాలి. అందుకోసం ఐపిఓ (ప్రారంభ పబ్లిక్‌ ఆఫర్‌) పేరుతో వాటాలను అమ్ముతారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎల్‌ఐసి ని దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోనే గాక, విదేశీ స్టాక్‌ ఎక్స్చేంజిలలో కూడా లిస్టింగ్‌ చేసే పనిలో వుంది. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న 'దీపం'కు సలహాదారులుగా డెలాయిట్‌ కంపెనీ, ఎస్‌బిఐ కాప్స్‌ కంపెనీలను నియమించింది. ఎల్‌ఐసి నిజవిలువ నిర్ధారించడానికంటూ మిల్లిమాన్‌ సంస్థను నియమించింది.

ఎల్‌ఐసి ఆస్తుల విలువ ఎంత?
ఎల్‌ఐసి నేడు దేశంలో అతి పెద్ద ఆర్థిక సంస్థ. 1956లో ఎల్‌ఐసి లో కేంద్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు మూలధన పెట్టుబడి పెడితే, ఇప్పుడు ఆస్తులు రూ.32 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఎల్‌ఐసి అధీనంలో ఉన్న ఆస్తులు, సమీకరిస్తున్న నూతన వ్యాపారాన్ని పరిగణనలోకి తీసుకుని కొన్ని ఆక్చురీ సంస్థలు ఎల్‌ఐసి నిజ విలువను రూ.9 లక్షల కోట్ల నుండి రూ.11 లక్షల కోట్లగా అంచనా వేస్తున్నాయి. ఇందులో 10 శాతం వాటాలు విక్రయించినా, రూ. 80 వేల కోట్ల నుండి ఎల్‌ఐసి విలువ కనుక్కోవడం సామాన్యమైన విషయం కాదు. నిజానికి ఎల్‌ఐసి ఆస్తుల మార్కెట్‌ విలువ, బుక్‌ వాల్యూ కన్నా అనేక రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎల్‌ఐసి తాజా బ్యాలన్స్‌ షీట్‌ ప్రకారం ఎల్‌ఐసి భౌతిక ఆస్తుల విలువ రూ. 2500 కోట్లు మాత్రమే. ముంబై లో ఉన్న ఎల్‌ఐసి కేంద్ర కార్యాలయం మార్కెట్‌ విలువే సుమారు రూ.2,000 కోట్ల పైమాటే! వైజాగ్‌ లో ఎల్‌ఐసి కార్యాలయం బుక్‌ వాల్యూ కేవలం రూపాయేనట. దీన్ని బట్టి ఎల్‌ఐసి నిజవిలువ, బుక్‌ వాల్యూ కన్నా రూ. లక్షల కోట్లు ఎక్కువ ఉంటుంది. బుక్‌ వాల్యూ ఆధారంగా వాటాలు అమ్మితే, లక్షల కోట్ల రూపాయలు అప్పనంగా ప్రయివేటు వారి చేతుల్లోకి వెళ్తాయి!

షేర్‌ విలువ ఎలా లెక్కిస్తారు?
ఎల్‌ఐసి చట్టానికి ప్రభుత్వం ప్రతిపాదించిన 27 సవరణలు పరిశీలిస్తే, ప్రస్తుతం ఎల్‌ఐసి కి ఉన్న రూ. 100 కోట్ల మూలధనాన్ని రూ. 25 వేల కోట్ల ఆధరైజ్డ్‌ క్యాపిటల్‌ (అనగా రూ.2500 కోట్ల షేర్లు, షేర్‌ ముఖ విలువ రూ.10 రూపాయల చొప్పున) కింద పెంచుతారు. ఎల్‌ఐసి ఆధరైజ్డ్‌ క్యాపిటల్‌ రూ. 25,000 కోట్లకు పెంచుతారు గనుక...10 శాతం షేర్లు విక్రయించినా, రూ. 2500 కోట్ల విలువైన షేర్లు అమ్ముతారు. అంటే 10 రూపాయల ముఖవిలువ కలిగిన, 250 కోట్ల షేర్లను ఐపిఓ రూపేణా మార్కెట్‌ లోకి విడుదల చేస్తారు. ఒకవేళ నిజవిలువ రూ.10 లక్షల కోట్లు అని తేలిస్తే, ఒక్కో షేర్‌ విలువ రూ. 400 ఉంటుంది.

అయితే వాస్తవంగా జరిగేది ఇంకొకటి. ఈ వాటాల అమ్మకంలో సామాన్యులకు, చిన్న మదుపుదారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మన దేశంలో మొత్తం డిమాట్‌ అకౌంట్లు (స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలంటే డిమాట్‌ అకౌంట్లు ఉండాలి) దాదాపు 4 కోట్లు ఉంటే, అందులో కేవలం 0.95 కోట్ల అకౌంట్లు చురుకుగా ఉన్నాయి. న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలో 2017లో 14.56 శాతం ప్రభుత్వ వాటాలను (12 కోట్ల షేర్లను) అమ్మారు. అందులో సామాన్యులకు దక్కిన వాటా కేవలం 0.8 శాతం మాత్రమే! చాలా ప్రభుత్వ బ్యాంకులలో సామాన్యుల వాటా 2 శాతం లోపే. కాబట్టి లిస్టింగ్‌ చేయటం వలన దేశంలో కొద్ది మంది ధనికులు, విదేశీ పెట్టుబడిదారులకు మాత్రమే వారి వాటాల విలువ, లాభాలు మెరుగుపడతాయి.

ఎల్‌ఐసి ని అమ్మిన సొమ్మును ఏం చేస్తుంది?
ఎల్‌ఐసి వాటాలను అమ్మగా వచ్చిన సొమ్మును ప్రభుత్వం పాలసీదారుల ప్రయోజనాలకు వెచ్చిస్తుందా? ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటుందా! అలా చేస్తే పాలసీదారుల ప్రయోజనాలకు నష్టం కాదా? 2021-22 బడ్జెట్‌ గణాంకాలు పరిశీలించినప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ రూపేణా సుమారు రూ.1,75,000 కోట్లు సేకరించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కనుక, ఎల్‌ఐసి లో వాటాలను అమ్మగా వచ్చిన నిధులను ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం వాడుకోబోతోందని స్పష్టంగా అర్ధమవుతుంది. ఎల్‌ఐసి చరిత్ర చూస్తే 1956లో కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మూలధన పెట్టుబడి పెట్టిన దరిమిలా ఇప్పటిదాకా ఎల్‌ఐసి తన స్వీయ శక్తితో రూ.32 లక్షల కోట్ల ఆస్తులు సమకూర్చుకుంది తప్ప, ప్రభుత్వ సాయాన్ని ఏనాడూ కోరలేదు. ఏడాదికి రూ.3.5 లక్షల కోట్ల నుండి రూ.4.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టగల రిజర్వ్‌ నిధులు కలిగిన ఎల్‌ఐసి సంస్థకు ఎలాంటి నిధుల కొరత లేదు. ఎల్‌ఐసి సంస్థ నిర్వహణకు గానీ, విస్తరణకు గానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి సహకారం అందించలేదు. భవిష్యత్‌లో ఆ అవసరం కూడా లేదు. ఇప్పటిదాకా సంస్థ మిగులులో 95 శాతం వాటా పాలసీదారులకు, 5 శాతం ప్రభుత్వానికి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసి లో పెట్టిన 100 కోట్ల ఈక్విటీ పెట్టుబడిపై 1956 నుండి ఇప్పటివరకు డివిడెండ్‌ రూపంలో రూ.2,8000 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి ఎల్‌ఐసి అందించింది. 2019-20 సంవత్సరానికిగాను, రూ.2,697 కోట్ల రూపాయల డివిడెండ్‌ను ప్రభుత్వానికి ఎల్‌ఐసి అందించనుంది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణల మూలంగా మిగులు పంపిణీ విధానం కూడా పాలసీదారుల ప్రయోజనాలకు ఇబ్బందికరం.

లిస్టింగ్‌ వల్ల పాలసీదారులకు ఒరిగేదేంటి?
లిస్టింగ్‌ చేయటం వలన ఎల్‌ఐసి పాలసీదారులకు లాభం కలుగుతుందనే వాదనలు పూర్తిగా తప్పు. 1956 నుండీ ఎల్‌ఐసి పాలసీదారుల నిధులను పరిపూర్ణంగా సంరక్షిస్తూ వారి ప్రయోజనాలను ఎప్పుడూ కాపాడుతూనే ఉంది. అలాగే పాలసీదారులకు బోనస్‌ అందించే విషయంలో ఎల్‌ఐసి కి మంచి రికార్డు ఉంది. అంతేకాక మంచి సర్వీస్‌ ప్రమాణాలతో క్లెయిములు పరిష్కార పనితీరులో ప్రపంచ బీమా పరిశ్రమలోనే ఎంతో ఉత్తమమైనదిగా కీర్తి గడించింది. 98.27 శాతం క్లెయిమ్‌ లను పరిష్కరించడం ద్వారా ఎల్‌ఐసి ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసి 2.15 కోట్ల క్లెయిములు చెల్లించి ప్రపంచంలోనే క్లెయిమ్‌ పరిష్కారంలో అత్యుత్తమ బీమా సంస్థగా పేరెన్నిక కంది. ఐఆర్‌డిఎ వార్షిక నివేదిక 2018-19 ప్రకారం 99.57 శాతం డెత్‌ క్లెయిమ్‌లను ఎల్‌ఐసి పరిష్కరించింది. ఇప్పుడు లిస్ట్‌ అయిన ప్రైవేట్‌ బీమా కంపెనీలు ఈ విధంగా చెల్లిస్తాయా!

పైగా, లిస్టింగ్‌ వలన ఎల్‌ఐసి జాతీయీకరణ లక్ష్యాలు వెనుకబాటు పట్టి, షేర్‌ హోల్డర్లకు అధిక లాభాలను అందించడం కోసం ఎల్‌ఐసి దృష్టి పెట్టవలసి వస్తుంది. ఇతర ప్రైవేటు బీమా కంపెనీల వలె ఎల్‌ఐసి సైతం పెద్ద పాలసీలను విక్రయించి లాభాలను ఆర్జించే దిశగా పయనించవలసి వస్తుంది. ఈ ప్రక్రియలో పేద మరియు మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే చిన్న పాలసీలు తక్కువ అమ్మాల్సి వస్తుంది. దీనివల్ల బలహీన వర్గాలకు బీమా సౌకర్యాన్ని అందించే సామాజిక లక్ష్యం కుంటుపడుతుంది. అంతేకాక లాభరహితంగా గ్రామీణ ప్రాంతాల్లో బీమాను విస్తరించే లక్ష్యం కూడా వీగిపోతుంది.

దీనివల్ల కనీసం దేశానికైనా మేలు జరుగుతుందా?
భారత ఆర్థిక వ్యవస్థలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేది ఎల్‌ఐసి మాత్రమే! ప్రతి సంవత్సరం రూ. 3.5 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్లు వరకు పెట్టుబడి పెట్టగలిగే నిధులను సమీకరిస్తుంది. అందువల్ల నిధుల కోసం ఎల్‌ఐసి మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి లేదు. మార్చి 31, 2020 నాటికి ఎల్‌ఐసి రూ.30.67 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రజా సంక్షేమానికి అందించింది. ఇందులో రూ. 24.10 లక్షల కోట్ల నిధులను కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీలలో, హౌసింగ్‌, నీటిపారుదల సౌకర్యాల కల్పన కోసం ఎల్‌ఐసి కేటాయించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు ఎల్‌ఐసి రూ. 2.23 లక్షల కోట్ల పెట్టుబడులు (65 పైసల వడ్డీతో) అందించింది. 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (1.4.2012 నుండి 31.03.2017 వరకు) కేంద్ర ప్రభుత్వానికి ఎల్‌ఐసి రూ.14,23,055 కోట్లు సమకూర్చింది. 13వ పంచవర్ష ప్రణాళిక రెండు సంవత్సరాలలోనే (1.4.2017 నుండి 31.03.2019) ఎల్‌ఐసి రూ. 7,01,483 కోట్లు అందించింది. దేశ అంతర్గత వనరుల సమీకరణ లో ఎల్‌ఐసి వాటా 25 శాతం పై మాటే! దేశీయ రైల్వే అభివృద్ధికి ఎల్‌ఐసి రూ.లక్షా యాభై వేల కోట్లు, జాతీయ రహదారుల అభివృద్ధికి మరో రూ. లక్ష పాతిక వేల కోట్లు అందించనుంది. ఎల్‌ఐసి ని స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేస్తే, అది కొద్ది మంది కార్పొరేట్లకు, ధనిక మదుపుదారులకు తప్ప దేశ ప్రయోజనాలకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఒకసారి లిస్టింగ్‌ అయితే షేర్‌ హోల్డర్ల ప్రయోజనాలకు తప్ప దేశ ప్రయోజనాలకు పని చేయడం సాధ్యం కాదు. విఎస్‌ఎన్‌ఎల్‌, బాల్కో, సెంచువార్‌ హోటల్‌ ఉదంతాలను చూస్తే ఈ విషయం మనకు అర్ధమవుతుంది. మదుపుదారులు ఎల్‌ఐసి వాటాలను లాభాలను ఆర్జించేందుకు కొంటారు తప్ప, దేశ ప్రయోజనాల కోసం కాదని మెడ మీద తల ఉన్న ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది!

మన దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా కంటే ముందుగానే దెబ్బ తింది. కరోనాతో పూర్తిగా వెనుకబాటు పట్టింది. దేశాభివృద్ధికి పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటించిన 'ఆత్మ నిర్బర్‌ భారత్‌' విజయవంతం కావాలంటే, దేశానికి ఏటేటా భారీగా పెట్టుబడులు అందించే ఎల్‌ఐసి సంస్థను 100 శాతం ప్రభుత్వ అజమాయిషీ లోనే కొనసాగించి, బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
                                      * పి. సతీష్‌ (వ్యాసకర్త ఎల్‌ఐసి ఉద్యోగ సంఘ నాయకులు)