ఆంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకీ విశాఖ ఉక్కును ఎందుకు అమ్ముతున్నారు? గుజరాతీ కార్పొరేట్ కంపెనీలకో, పోస్కోకో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కారుచౌకగా అందించాలనుకుంటున్నారా? లేక విశాఖ స్టీల్‌ప్లాంట్ నష్టాల్లో నడుస్తుంది కాబట్టి అమ్మాలనుకుంటున్నారా ?
నష్టాలలో లేదు
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాలలో ఉన్నదన్న ప్రచారం వాస్తవం కాదు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రారంభించిన దగ్గర నుండి ఇప్పటివరకు కూడా పెట్టిన పెట్టుబడి రూ.4889 కోట్లు. 'హిందూ' పత్రిక అంచనా ప్రకారం విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రస్తుత ఆస్తుల విలువ రూ.3 లక్షల 20 వేల కోట్ల పైనే ఉంటుందని అంచనా. రూ.4889 కోట్ల పెట్టుబడితో రూ.3.2 లక్షల కోట్ల ఆస్తులను పొందడం అంటే...సంస్థ నష్టాల్లో వుందా లాభాల్లో వుందా ?
ప్లాంట్ విస్తరణకు ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. ప్లాంటు విస్తరణకు కావలసిన ధనాన్ని తమ కష్టంతో వచ్చిన సొంత లాభాలతో సమకూర్చుకున్నారు. ఇంకా కావలసి వస్తే బ్యాంకు నుండి అప్పు తీసుకున్నారు. 12 లక్షల టన్నుల ఉత్పత్తి నుండి 63 లక్షల ఉక్కు ఉత్పత్తిని సాధించింది. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలతో 2 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి స్థాయికి చేరుకోగల సామర్ధ్యం ఉంది. దేశ అభ్యున్నతికి విశాఖ ఉక్కును వనరుగా ఉపయోగించుకుని ప్రగతిని సాధించవచ్చని విశాఖ ఉక్కు నిరూపించింది. ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారుల ధనాన్ని నష్టాలలో కూరుకుపోతున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెట్టలేమని విడ్డూరపు ప్రకటనలు చేస్తున్నారు.
లాభాలు ఎందుకు తగ్గాయి ?
హుదూద్ తుఫాన్ వల్ల స్టీల్ ప్లాంటుకు రూ.1000 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. రాజకీయ అవసరాల కోసం రాయబరేలిలోని రైలు చక్రాల ఫ్యాక్టరీలో రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టమని విశాఖ స్టీల్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా రూ. 2 వేల కోట్లను స్టీల్ ప్లాంట్ నష్టపోయింది. గనుల కోసం, ఒరిస్సా లోని ఒరిస్సా మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఒఎండిసి)లో రూ. 381 కోట్ల వాటాలను ప్రభుత్వం కొనిపించింది. పర్యావరణ అనుమతుల కోసం మరో రూ. 500 కోట్ల ఖర్చు పెట్టించారు. కానీ గనుల లోంచి ఇనుప ఖనిజం రాలేదు. 2010లో బర్డ్ గ్రూప్‌లో రూ. 361 కోట్లు పెట్టుబడిగా పెట్టి 51 శాతం వాటాలు కొనమని కేంద్రం ఆదేశించింది. వాటాలు కొని 10 ఏళ్ళైనా, నేటికీ ఒక్క టన్ను ఇనప ఖనిజం కూడా రానివ్వలేదు. చెయ్యని నేరానికి రూ. 1400 కోట్ల అపరాధ రుసుము విధించారు. ఇప్పటికే రూ. 500 కోట్లు చెల్లించారు. ఈ విధంగా 861 కోట్ల సొమ్ము వృధా అయ్యింది. 1971లో విశాఖ ఉక్కును ఎస్‌ఎఐఎల్ (సెయిల్) సంస్థ కింద ప్రారంభించారు. 'సెయిల్' సంస్థకు, 200 సంవత్సరాలు తవ్వినా తరగని ఇనప గనులున్నాయి. సెయిల్ సంస్థ నుండి విశాఖ ఉక్కును ఎందుకు విడగొట్టారు? 1982లో ఏ ప్రయోజనాలను ఆశించి విశాఖ ఉక్కును ఆర్‌ఐఎన్‌ఎల్ (రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్) కిందకు తెచ్చారు? 'సెయిల్'లో ఎందుకు విలీనం చేయరు? గత మూడు నాలుగు సంవత్సరాలను ఫోకస్ చేస్తూ అంతకు ముందు ప్లాంట్ సాధించిన అద్భుత ఫలితాలను విస్మరించడం సరికాదు. రూ.279 కోట్ల అమ్మకాలతో మొదలై 2018-19 సంవత్సరానికి 20 వేల కోట్లకు పైగా అమ్మకాలతో సాలీనా 14.5 శాతం వృద్ధిరేటు సాధించింది. ఇంత వృద్ధి రేటును సాధించిన మరొక ఉక్కు ఫ్యాక్టరీని చూపించమనండి.
స్వంత గనులు ఎందుకు కేటాయించలేదు ?
ఉక్కు తయారీకి వంద రూపాయలు ఖర్చయితే అందులో 61 శాతం కేవలం ముడి పదార్థమైన ఇనుప ఖనిజం కొనటం కోసమే ఖర్చవుతున్నది. సొంత గనులు ఉంటే ఈ ఖర్చు తగ్గటమే కాకుండా విశాఖ ఉక్కు లాభాల బాటలో ప్రయాణిం చేది. వివరమైన ప్రాజెక్టు రిపోర్ట్ (డిపిఆర్)ను ఎం.యన్ దస్తూరి కంపెనీ 1971లో తయారు చేసింది. అందులో బైలాదిల్లా ఇనుప ఖనిజ గనుల్లో 4, 5 బ్లాకులను కేటా యించాలని చాలా వివరంగా నివేదించారు. అయినా ఇప్పటి వరకు స్వంత గనులను ఎందుకు కేటాయించలేదు? ఆంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉక్కు ఉత్పత్తి ప్రారం భించిన 1991 నుంచి మార్కెట్ రేటుకి ఇనప ఖనిజాన్ని కొనక తప్ప టంలేదు. 1991లో టన్ను ఇనప ఖనిజం రేటు రూ.396 ఉంటే, 2004 సంవత్సరానికి రూ. 1085, 2020 కి రూ.4779 అయింది. మధ్యలో రూ.5424 లకు కూడా పెరిగింది.
స్వంత గనులున్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఐఎల్) ప్రతి టన్ను ఇనప ఖానిజానికి రూ. 2396 ఖర్చు పెడుతూ వుంటే, విశాఖ ఉక్కు సంస్థ ప్రతి టన్ను ఇనుప ఖనిజానికి రూ. 6584 ఖర్చు పెట్టవలసి వచ్చింది. అంటే స్వంత ఇనుప గనులు లేనందున విశాఖ ఉక్కు సంస్థ ప్రతి టన్నుకూ అదనంగా రూ. 4188 ఖర్చు పెట్టి ఉక్కును ఉత్పత్తి చేసింది. ఉక్కు ఫ్యాక్టరీలు లేని బ్రాహ్మణి స్టీల్స్ కు, గాలి జనార్ధనరెడ్డికి గనులను కేటాయించారు. జిందాల్, ఎస్సార్ వంటి ప్రైవేట్ సంస్థలకు కూడా ఇచ్చారు. స్వదేశీ ప్రభుత్వ సంస్థ అయిన విశాఖ స్టీల్ కు ఇనప ఖనిజ గనులు ఇవ్వలేదు కానీ ఇనుప ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశీయ ప్రభత్వ సంస్థ అయిన విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏం పాపం చేసింది? ఎందుకు ఇవ్వలేదు? ఉత్పత్తిపరమైన నష్టం లేదు. ఆపరేషన్ నష్టాలు లేవు. పెట్టుబడికి అయిదు రెట్లకు మించి లాభాలను ఆర్జించింది. కేంద్ర ప్రభుత్వానికి రూ. 43 వేల కోట్ల పన్నులు, డివిడెండ్ల రూపంలో చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8 వేల కోట్ల పన్ను చెల్లించింది. అయినా ఎందుకీ సవతి తల్లి ప్రేమ.
ఇనుప ఖనిజం బయట కొన్నప్పటికీ 2014-15 వరకూ సంస్థ లాభాల్లో నడిచింది. 2020 డిసెంబర్ లో రూ. 212 కోట్ల లాభం వచ్చింది. 2021 జనవరిలో రూ.135 కోట్ల లాభం వచ్చింది. 2021 ఫిబ్రవరిలో రూ. 165 కోట్ల లాభం వచ్చింది. 2021 మార్చి లో 300 కోట్ల లాభం రావచ్చంటున్నారు. నష్టాలు వస్తున్నాయనే అబద్ధాన్ని సృష్టించి...పదే పదే వల్లించి...నిజం చేసే ప్రయత్నంలో భాగమే ఈ కుతంత్రం. ప్రైవేట్ వారికి విశాఖ ఉక్కును ఇవ్వటానికే స్వంత గనులను కేటాయించలేదని అర్ధమౌతూనే ఉంది. ప్రభుత్వాలు విశాఖ ఉక్కు సంస్థకు ఇనుప గనులు కేటాయించి ఉంటే ఈ అదనపు ఖర్చు అంతా లాభంగా మారేది. నష్టాల్లో ఉన్న గుజరాత్ పెట్రోల్ కార్పొరేషన్‌ను ఒఎన్‌జిసి లో కలిపేశారు. అలానే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను 'సెయిల్' సంస్థలో కలపవచ్చు కదా! 'సెయిల్' సంస్థకు 200 సంవత్సరాల వరకు లభ్యమయ్యే ఇనుప ఖనిజ గనులున్నాయి. పూర్తి లాభాలతో ఉత్పత్తి చేయవచ్చు.
కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు ఎత్తిన బావుటా దించేది లేదని ఆంధ్ర ప్రజలు, కార్మికులు ముక్తకంఠంతో తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం ఎంత మొండిగా ఉందో కార్మికులు, ప్రజలు కూడా అంతే పట్టుదలతో ఉన్నారు. విశాఖ ఉక్కును ''ఎవడ్రా అమ్మేది? ఎవడ్రా కొనేది?'' అనే నినాదంతో ప్రభుత్వాన్ని గద్దిస్తున్నారు. ప్రజా పోరాట చరిత్రను పాలకులు మరిచిపొతే చరిత్రహీనులు కాక తప్పదు. ప్రజా శక్తి ముందు ఎంతటి వారైనా తల వంచక తప్పదు.
/ వ్యాసకర్త నాటి విశాఖ ఉక్కు ఉద్యమ కార్యకర్త /
డా|| కొల్లా రాజమోహన్











