ప్రజాశక్తి-గుంటూరు : దీపావళి సందర్భంగా బాణాసంచా ప్రమాదాలు లేకుండా సురక్షితంగా, ప్రశాంతంగా ప్రజలు పండుగను జరుపుకునేందుకు అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు.గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎం వేణుగోపాల్‌రెడ్డి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలిశర్మ, డిఆర్‌ఓ కె. చంద్రశేఖరరావుతో కలసి బాణసంచా విక్రయాలపై రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్, కమర్షియల్ టాక్స్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, దీపావళి బాణసంచా హోల్ సేల్ దుకాణాదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాణసంచా హోల్‌సేల్ దుకాణాలలో, సరుకు నిల్వ చేసే గోడౌన్లలో నిబంధనల ప్రకారం చేపట్టాల్సిన రక్షణ చర్యలపై పలు సూచనలు చేశారు.గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలతో పాటు తెనాలి, పొన్నూరు పట్టణాల్లో, మండల కేంద్రాల్లో తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు. అనధికార బాణసంచా నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని, తాత్కాలిక దుకాణాల కోసం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆర్‌డిఒకు ఈనెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, పండుగకు నాలుగు రోజుల ముందే అనుమతులు మంజూరు చేస్తారని వివరించారు. అనుమతుల జారీకి సింగిల్ విండో విధానంలో దరఖాస్తులు స్వీకరించి, నిబంధనల మేరకు జీఎస్టీ చెల్లింపులకు సంబంధిత అధికారి కూడా అందుబాటులో వుంటారన్నారు. ప్రజల భద్రత దష్ట్యా ప్రమాదాల నివారణకు విక్రేతలు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలూ కచ్చితంగా పాటించాలన్నారు. అనుమతులు లేని విక్రేతలు రోడ్లపై బాణసంచా విక్రయించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బాణాసంచా విక్రయాలకు ఏర్పాటు చేసే షాపులను లాటరీ పద్దతిలో కేటాయించాలన్నారు. సమావేశంలో గుంటూరు ఆర్డిఒ పి.శ్రీఖర్, తహశీల్దార్లు శ్రీకాంత్, రవిబాబు, సాంబశివరావు , నగేష్ , డీఎస్పీ బాల సుందరం, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి, తెనాలి మున్సిపల్ కమిషనర్ జశ్వంత్‌రావు పాల్గొన్నారు.
సమవేశంలో మాట్లాడుతున్న గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి