Nov 06,2023 21:30

మహిళకు కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే పద్మావతి

            ప్రజాశక్తి-గార్లదిన్నె   'అమ్మా.. మా ఊర్లో మందు అమ్మనీయకుండా చేయండి..' అంటూ ఎమ్మెల్యే పద్మావతి ముందు మండల పరిధిలోని కోటంక మహిళలు వాపోయారు. సోమవారం మండల పరిధిలోని కోటంక గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం పథకాల లబ్ధిని విరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఎమ్మెల్యే ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు. తమ గ్రామంలో ఉన్న బెల్ట్‌ షాపుల కారణంగా కల్తీ మందు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కల్తీ మందు తాగడం వల్ల మృత్యువాత పడుతున్నారన్నారు. దీంత చాలామంది మహిళలు ఇప్పటికే విధవలుగా మారుతున్నారన్నారు. కావున మీరైనా స్పందించి బెల్ట్‌షాపులు ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వెంకటనారాయణ, తహశీల్దార్‌ ఉషారాణి, కన్వీనర్‌ నరేందర్‌రెడ్డి, తాతిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, సుబ్బిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.