May 09,2021 11:35

ఇంటి బయట అంట్లు తోముతున్న లచ్చమ్మకు ఇంట్లోంచి సెల్‌ఫోన్‌ మోగుతున్న శబ్ధం వినబడుతోంది. ''ఒరేయ్... అంజిగా ! ఆ ఫోన్‌ కాస్త ఎత్తరా ! ఇప్పటికీ రెండు సార్లయింది. ఆ ఫోను మోగబట్టి, నేనిలా మొరగ బట్టి లేవరా ! లేచి చేసిందెవరో కనుక్కో ...'' లోపల పడుకున్న అంజిగాడికి వినిపించేలా కాస్త గట్టిగానే గొంతు పెకిలించింది లచ్చమ్మ. లచ్చమ్మ కేకలకు... పొద్దున్నే గుడినెక్కి కొక్కొరొక్కోమంటూ పల్లెనంతా నిద్రలేపిన కోడిపుంజు కూడా ఉలిక్కిపడి మరొక్కసారి... 'కొక్కొరొక్కో'' మంటూ గట్టిగా కూతబెట్టి లచ్చమ్మకు గొంతు సాయం చేసింది. అంజిగాడు గాఢ నిద్రలో తేలుతున్నాడు. కుంభకర్ణుడి కునుకు వాడిది. మంచం మీద పడ్డాడంటే చాలు.... పక్కనే పిడుగుపడ్డా లేచే రకం కాదు. ఫోను మళ్ళీ మోగడం మొదలెట్టింది. సహనం కోల్పోయింది లచ్చమ్మ. ఉన్నపళంగా లేచి అటకమీది కర్రెట్టుకుని అంజిగాడి వీపుమీద ఒక్కటేసింది. చీమ కుట్టినట్టు కూడా లేదు అంజిగాడికి. లచ్చమ్మకు కోపం రెట్టింపైంది. శక్తినంతా కూడగట్టుకుని.... కర్రను పైకెత్తింది. ఇంతలో ఫోన్‌ మళ్లీ మోగింది. లచ్చమ్మ దృష్టి అటువైపు మళ్ళింది. ఫోనెత్తి...''ఎవరూ! మాట్లాడేది? కొత్త పల్లె నుంచి లచ్చమ్మను మాట్లాడుతుండ'' అనగానే- ''నేనమ్మా మీ అన్న సుబ్బయ్యను మాట్లాడుతుండ. బాగుంటివా తల్లి'' అన్న మాటలు వినగానే లచ్చమ్మకు ప్రాణం లేసొచ్చింది.
   ''ఎన్నాళ్లయిందన్నా! నీ గొంతు సెవిన బడి. ఎట్టాగుంటివే... ఇన్నాళ్ళకు గురుతుకొచ్చెనా ఈ పిచ్చి చెల్లి.'' లచ్చమ్మ మాటలకు సుబ్బయ్య ''అట్టా అనుకోమాకమ్మా! పని మీద బడి ఈలు దొరక్కపోయె... మీ వదిన, నా కొడుకూ అందరం బాగుంటిమి. నా సంగతేంలే గానీ! నువ్వు జెప్పమ్మా ఎట్టాగుంటివి? ఏమి జేస్తుంటివి? నీ కొడుకెట్టాగున్నాడు?'' అలా అడిగే పాటికి లచ్చమ్మకు కళ్లళ్లో నీళ్లు తిరిగిన్నాయి.
   ''నా గురించి చెప్పడానికేముందన్నా! కష్టాలు కన్నీళ్లు తప్ప... రెక్కాడితేగానీ.. డొక్కాడని బతుకు. పొలం పనులకెళ్తావుంటి గా పనులు కూడా నిన్ననే అయిపోయినాయి. వర్షాలు పడేదాకా కూలీకెవ్వరూ రావద్దని చెప్పిండ్రు. నా కొడుకంటావా... వానికింకా బతుకు విలువ తెలిసింది కాదాయె. పొద్దస్తమానమూ సినిమాలని, షికార్లని రెక్కల్లేని పచ్చిలెక్క ఊరంతా పిచ్చి కుక్క లెక్క తిరిగొస్తాడు. కొడుకు సేతికొచ్చాడనుకుంటే ఈడి వాలకం ఇట్టా ఏడ్చినాది. సేద్దాం అంటే పనుల్లేవు. ఈ రెండు నెలలూ మాకు గొడ్డుకాలమన్నా! ఏం జెయ్యాల్లో ఎట్టా బతకాలో తలకెక్కుతలేదు...'' అంటూ లచ్చమ్మ తన బాధనంతా కుమ్మరించింది.
   ''నువ్వేం దిగాలుపడకు తల్లి .. మా కాడ సేతుల్నిండా పని వుంది, రాల్లు పగలగొట్టెపనెమ్మా! కూలీ గూడా బాగానే ఇస్తరు. నీ కొడుకును వెంటబెట్టుకొని రేపే హైదరాబాదుకు వచ్చేయమ్మా' మేము కూడా మా ఊరి నుండి పది రోజులైంది వచ్చి బాగుందమ్మా ఇక్కడ'' ఆత్రంగా గొంతువిప్పాడు సుబ్బయ్య. ''సరేనన్న.. మా ఊరివాళ్ళెవరైనా వస్తారేమో కనుక్కొని జెప్తాన్లే'' అంటూ ఫోను పెట్టేసింది.
   ''ఒరేయ్ ! పడుకుంది సాలు.. లేచి పక్కింటి బజారత్తను, ఎదురింటి శాంతమ్మత్తను నేను రమ్మన్నానని జెప్పు. మీ మామ ఫోను జేసిండు. మనల్ని రేపు హైదరాబాదుకు రమ్మంటున్నాడు''. అంది.
   హైదరాబాదు పేరు చెవిన పడగానే... ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు అంజిగాడు. ''హైదరాబాదుకా! వెల్దాం పదవే... సుబ్బయ్య మామ అక్కడికెప్పుడు బోయిండు?'' అలా అడిగే సరికి... లచ్చమ్మకు ఆశ్చర్యమేసింది. ''నీకు జెప్పినా అర్థం కాదులే గానీ... ముందు వాళ్ళందర్నీ తోల్కోనిరా!'' అంది. నిద్రమబ్బునంతా మంచం మీద దులిపేసి బయటకు పరుగెత్తాడు అంజిగాడు.
   లచ్చమ్మ ఉండేది డోన్‌ పక్కనున్న కొత్తపల్లె. అంజిగాడికి పదేళ్ళు నిండగానే వాళ్ళయ్యకు నూరేళ్లు నిండుకున్నాయి. అప్పటి నుంచి కొడుకు పెంపకం, ఇంటి భారం లచ్చమ్మ మీదే పడింది. అంజిగాడికి సదువబ్బలేదు, ఇరవై యేళ్ళు దాటినా బరువు బాధ్యత తెలిసిరాలేదు. పొద్దస్తమానం సినిమాల పిచ్చి. వాడు అభిమానించే హీరో సినిమా రిలీజవుతుందంటే వాడి హడావుడి అంతాఇంతా కాదు. ఆకలి దప్పికలు మరిచి డోన్‌లోనే మకాం పెట్టేవాడు. వేరే హీరోల ఫ్యాన్స్‌తో గొడవ పడేవాడు. ఒకసారి ఈ విషయంలోనే పోలీసులతో తన్నులు దినొచ్చి ఊర్లో లచ్చమ్మ పరువును వీధి పాలుచేసిండు. ఈ నాకొడుక్కి సినిమాల పిచ్చి ఏ దేవుడొచ్చి ఇడిపించాల్నో ఏమో నంటూ లచ్చమ్మ చాలాసార్లు అంజిగాడ్ని ఇష్టమొచ్చినట్టు కొట్టి ఇంటినుండి గెంటేసింది. తల్లి మనసు కదా! మళ్ళీ ఊరంతా వెతికి...ఇంట్లోకి తెచ్చుకునేది.
  హైదరాబాదు అనగానే అంజిగాడి ఆలోచన్లు ఆకాశంలో తేలుతున్నాయి. అక్కడ పెద్ద పెద్ద టాకీసులుంటాయి. సినిమా హీరోలందరూ అన్నే వుంటరంట! షూటింగులు దగ్గర్నుంచే చూడొచ్చు. ఈ విషయం తొందరగా నా దోస్తులతో జెప్పాలంటూ వాళ్లందరినీ పోగుచేసి, చెప్పిండు. ''ఒరేరు అంజిగా! హైదరాబాదంటే మనూర్లెక్క గంటల్లో సుట్టేసేది కాదురా.. పెద్ద సిటీ.. ఇలాంటి వంద పల్లెలైనా దానికి సరితూగవు. హీరోలుండేది.. జూబ్లిహిల్స్‌లో.. అర్థమైందా! ఎగిరెగిరి పడకుండా ముందు వెళ్లి అడ్రస్సు కనుక్కో!'' అన్నాడొకడు.
   ఆ సాయంత్రం తాము హైదరాబాద్‌లో వెళ్లాల్సిన అడ్రసును మామనడిగి అనుక్కున్నాడు. అతడు చెప్పిన అడ్రసులో జూబ్లి హిల్స్‌ అని వుండటం చూసి, చాలా ఆనందపడ్డాడు. ఆ మర్నాడు డోన్‌ దాకా వచ్చి దోస్తులందరూ అంజిగాడ్ని బస్సెక్కించారు. ''మనందరి గురించి మన హీరోతో మాట్లాడతా. వెళ్లొస్తానంటూ'' బస్సెక్కాడు అంజిగాడు. సుబ్బయ్య మామ జెప్పినట్టుగానే బస్సెక్కగానే ఫోనుజేసి చెప్పాడు.
బస్సు హైదరాబాదుకొచ్చేలోపు మధ్యాహ్నం అయింది. లచ్చమ్మ అంజిగాడు అందరూ బస్టాండులో దిగగానే... సుబ్బయ్య వాళ్లందరినీ తోల్కొని జూబ్లిహిల్స్‌ సిటీ బస్‌ ఎక్కించాడు. అంజిగాడు హైదరాబాదు నగరాన్ని కిటికీ దగ్గరే కూర్చుని కళ్లప్పగించి చూస్తున్నాడు. పెద్ద పెద్ద సినిమా హాల్లు, వాల్‌ పోస్టర్లు కనువిందు జేస్తున్నాయి. అరగంటలో అందరూ జూబ్లిహిల్స్‌లో దిగారు. వాళ్లందర్నీ... సుబ్బయ్య ఉన్నచోటుకు తీసుకెళ్లాడు. వదినను, అల్లుడ్ని చూడగానే లచ్చమ్మ మురిసిపోయింది. ఒకరితో ఒకరు మనసిప్పి మాట్లాడుకున్నారు. సుబ్బయ్య కొడుకు శీను, అంజిగాడికి మంచి తోడైనాడు. అందరూ కల్సి మరుసటి రోజు పొద్దున్నే పనిలోకెళ్ళారు. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా రోజులు గడిచేకొద్ది ఆ రాళ్లు పగలగొట్టే పని అలవాటైంది. వందలాది మంది పనిజేస్తున్న ఆ చోటకు దగ్గర్లోనే టెంటు గుడిసెల్లో చిన్నపాటి అద్దెకున్నారంతా. తన చెల్లిని, మేనల్లుడిని సుబ్బయ్య తన ఇంట్లోనే ఉండమన్నాడు.
వారం చివర్లో కూలీ డబ్బులిచ్చారు. అందరి కళ్లల్లో ఆనందం. అంజిగాడికి మాత్రం ఎప్పుడెప్పుడు హీరోలు కనబడతారా.. తన అభిమాన హీరో ఇంటికెప్పుడెల్దామా! అంటూ ఒకటే ఆరాటం. వాడి ఉబలాటమంతా శీనుగాడితో చెప్పుకొన్నాడు. ''వచ్చే ఆదివారం తప్పకుండా వెళ్దాం. నిన్ను మీ హీరో ముందు నిలబెట్టడం నా బాధ్యత..'' అని శీనుగాడి చెప్పేసరికి అంజిగాడు ఎగిరి గంతేసాడు.
ఆదివారం దగ్గరకొస్తుంది. టీవీల్లో, రేడియోల్లో, పత్రికల్లో ఒకటే వార్తలు... కరోనా గురించి. అది అంజిగాడి ఆశకు శాపమైంది. ప్రభుత్వం ఉన్నపళంగా లాక్‌డౌన్‌ విధించింది. ఎవరూ బయట తిరక్కుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు, సూచనలు అమలు చేసింది. పనికొచ్చిన వాళ్లంతా మా బతుకులిట్లా తెల్లారి పోయనాయని ఉన్నచోటే కుప్పకూలిపోయారు.
రోజులు యుగాల్లా గడుస్తున్నాయి. ''ఎన్నాల్లిలా పస్తులతో బతకాలన్నట్టు సానామంది కూలీలు కాలినడక సొంతూరుకు సాగిపోతుండ్రు. నీకు కాళ్ళనొప్పులు కదా లచ్చమ్మా! నీ కొడుకును దోల్కొని అన్నీ సక్కబడ్డాక వొద్దువులే.. మేము ఎట్టాగో అట్టాగా మనూరుకు జేరుకుంటాం'' అని లచ్చమ్మతో పాటు వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఏమీ పాలుపోక వాళ్ళను చూస్తూ నిలబడి పోయింది లచ్చమ్మ. ''నువ్వేం మనస్సు నొచ్చుకోకు తల్లి.. ఈ తతంగమంతా అయిపోయ్యేదాకా నా దగ్గరే వుందువు గానీ.. నా సెల్లి నాకు బరువైతదా!'' అన్న సుబ్బయ్య మాటలకు సరేనన్నట్టు తలూపింది లచ్చమ్మ.
ఓ రోజు ఉదయాన్నే అంజి, శ్రీను ఇద్దరూ కలిసి ఎవ్వరికీ కన్పించకుండా హీరోలున్న వీధికి వెళ్లారు. అంజిగాడి హీరో ఇల్లు కనబడింది. వాడి ఆనందం కట్టలు తెంచుకుంది. చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు. ఆలస్యం చేయకుండా ఇంటి ముందు కెళ్ళి గేటులోంచి తొంగిచూసాడు. బైట వరండాల్లో మెత్తడి గడ్డి మీద వాకింగ్‌ చేస్తున్నాడు వాడి సూపర్‌ హీరో.. శీను కూడా చూశాడు. అంతలో అంజిగాడు గొంతు పెద్దది చేసి ''అన్నా! బాగుంటివా! నేనన్నా అంజిగాడ్ని. నువ్వంటే పాణమన్నమాకు. నీ సినిమాలెన్ని సార్లు చూసామో లెక్కలేదన్నా! ఎట్టాగైనా నిన్ను సూద్దామని, వచ్చినానన్నా. ఇన్నాళ్ళకు నిన్ను కళ్ళారా సూసుకుంటి. ''అన్నా! నువ్వు సూపరన్నా. ఎంత బాగుంటివే..!'' అంజిగాడి మాటలు కట్టలు తెంచుకుంటున్నాయి. వాడి మాటలు విని ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు ఆ హీరో... అంజిగాడ్ని పిచ్చివాణ్ణి చూసినట్టు చూసి.. ''వాచ్‌మెన్‌.. అక్కడ bవరో చూడు''.. అంటూ లోపలికెళ్లిపోయాడు. అంజిగాడి నోరు మూగ బోయింది. వాచ్‌మెన్‌ వచ్చి, ''సార్‌ బిజీగా వున్నాడు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపొమ్మన్నాడు.'' అన్నాడు.
''ఒరేయ్ అంజి! రోజులు బాగా లేవురా! ఇలాంటప్పుడొస్తే ఎవరైనా ఇలానే వెళ్ళిపొమ్మంటారు. పరిస్థితులు కుదుటపడ్డాక వద్దాంలే.. '' అంటూ ఇంటికి తీసుకెళ్లాడు శీను. అంజిగాడిని ఏదో తెలియని బాధ, ఏవేవే ఆలోచన్లు చుట్టేసాయి. ఉలుకూపలుకూలేని వాడిలా అయిపోయాడు.
రోజులు గడిచేకొద్ది లచ్చమ్మకు కాళ్ళనొప్పులెక్కువయ్యాయి. తెచ్చుకున్న మాత్రలన్నీ అయిపోయినాయి. నడవడం కష్టమయ్యింది. ఒకరోజు ఉన్నట్టుండి లచ్చమ్మకు ఒళ్లంతా వేడెక్కింది. ఊరు కొత్త కదా! హాస్పిటల్లు, మెడికల్‌ షాపులెక్కడున్నాయో తెలియట్లేదు. మెయిన్‌ రోడ్డు మీదకు పోలీసులు ఎవ్వరినీ రానివ్వట్లేదు. అంజి, శీను ఆ రాత్రంతా మెడికల్‌ షాపుల కోసం ఎలా గాలించారు. అమ్మ జ్వరంతో ఒణికిపోతోంది. ఇన్నాళ్లు నా కోసం ఎంతో కష్టపడ్డ మా అమ్మను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూగూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వున్నందుకు అంజిగాడు కుమిలిపోయాడు.

లాగైనా అమ్మను కాపాడాలి. అందుకు మార్గం ఎంచుకున్నాడు. తెల్లారాక ఒక్కడే బయలుదేరి వెళ్లాడు. వాడు అభిమానించి, ఆరాధించిన ఆ హీరో ఇంటికి..
హీరో వరండాలో పేపరు చదువుతూ కనిపించాడు. గేటు తీసుకుని ఆత్రంగా లోపలికెళ్ళబోయాడు అంజిగాడు. వాచ్‌మెన్‌ అడ్డుకున్నాడు. అంజిగాడు వాళ్ళ హీరోతో ''అన్నా! ఒక్కసారిలా ఇలా రండన్నా... మాయమ్మకు జబ్బు చేసినది. అక్కడ ఎంతోమంది ఆకలితో అల్లాడిపోతుండ్రు.. నువ్వే వచ్చి సాయం చేయాలన్నా'' అని కన్నీళ్ళెట్టుకున్నాడు. అంజిగాడి మాటలకు ఆ హీరో కోపంతో గేటు దగ్గరకొచ్చి ''ముందు ఇక్కడినుండి వెళ్లిపో.. లేదా పోలీసులను పిలుస్తానని బెదిరించాడు. మీ అమ్మకు వచ్చింది జ్వరం కాదు. కరోనా వ్యాధి. వెంటనే ఆలస్యం చేయకుండా క్వారంటైన్‌కు తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు. ముందు ఆ గేటు వదులు.. ఆ వ్యాధి నీక్కూడా అంటుకొని ఉంటుంది. వాచ్‌మెన్‌! వాడ్ని త్వరగా ఇక్కడి నుండి పంపించేసి.. సానిటైజర్‌ స్ప్రే చేసి ఆ ప్లేసంతా క్లీన్‌ చెయ్యమని'' చెప్పి లోపలికెళ్ళాడు.
ఆ హీరో అలా మాట్లాడే సరికి అంజిగాడికి ఒళ్లంతా ఒణుకుపుట్టింది. ఉప్పెనలా ఎగిరి పడ్డాడు. వాడి ఆవేశాన్ని ఆపడం వాచ్‌మెన్‌ వల్ల కూడా కాలేదు. అంతలోనే పోలీసులొచ్చి ''ఎవర్రా నీవు కుర్రకుంక! ఇక్కడ లొల్లి జేస్తుండవు. పద స్టేషన్‌కు అని లాక్కెళ్లబోయారు. ''హలో సార్‌! ఆ అబ్బాయిని విడిచిపెట్టండి''. ఎదురింట్లో నుండి అంజిగాడి సంగతంతా చూస్తున్న హీరోయిన్‌ ప్రణతి బయటకొచ్చింది. పోలీసులతో మాట్లాడి వారిని పంపించేసింది. ''ఏంటబ్బాయి! ఎవరు నువ్వు? మీ అమ్మగారికి ఏం అయ్యింది. నేనంతా విన్నాను. వెళ్తాంపద'' అంటూ అంజిగాడితో పాటు వాళ్లున్న చోటుకెళ్లింది హీరోయిన్‌ ప్రణతి. లచ్చమ్మ పరిస్థితి చూసి ''ఓ మై గాడ్‌.. ఫీవర్‌ ఎక్కువైందని''. వెంటనే ఇంటికి ఫోను చేసింది. పది నిముషాల్లో కారొచ్చింది. కార్లోంచి ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ తీసుకుని లచ్చమ్మకు ఇంజక్షన్‌ చేసింది. కొన్ని మాత్రలు ఇచ్చి ''భయపడాల్సిన పనిలేదు, రెండు రోజుల్లో తగ్గిపోతుందిలే'' అంటూ అక్కడున్న వారందరికీ ధైర్యం చెప్పింది. అందరూ ఆశ్చర్యంతో ఆమెనే చూస్తున్నారు. అసలేం జరిగిందో ఎవరికీ బోధ పడటంలేదు. కలగంటున్నట్టుంది అందరికీ.. ''భయపడకండీ నాకు వైద్యం తెలుసు. డాక్టర్‌ను అవ్వబోయి, యాక్టర్‌నయ్యానంతే...'' నంటూ చిన్నగా నవ్వి కారెక్కి వెళ్ళిపోయింది. ఆమెకు కృతజ్ఞతగా అందరూ చేతులు జోడించారు. అంజిగాడికి మాత్రం ఆమె నడిచొచ్చిన దేవతా అన్పించింది.
ఆ హీరోయిన్‌ మర్నాడు ఉదయాన్నే జీపులో వచ్చింది. అక్కడున్న వాళ్లకంతా అన్నం పొట్లాలు ఇచ్చింది. ఇంట్లోకొచ్చి లచ్చమ్మను ''ఎలా వుందమ్మా'' అని అడిగింది. ''పర్లేదమ్మా నీ దయవల్ల బాగానే వుంది''. ''నాదేముందిలెండి నన్నింతవరకు లాక్కొచ్చిన్న నీ కొడుకును మెచ్చుకో'' అని అంజిగాడి వైపు చూసింది. అంజిగాడి కళ్లనిండా నీళ్లు తిరిగాయి. బయటకొచ్చి అందర్నీ ఉద్ధేశించి ''ఈ రోజు నుండి మీరేమి విచారపడకండి...నేనున్నాను. రోజు ఇలానే మీకు భోజనం తీసుకొస్తాను. రోజులు బాగాలేవు. బయటకెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా వుండమని'' చెప్పి వెళ్ళింది. లచ్చమ్మ మాదిరిగానే కూలీకొచ్చి చిక్కుకున్న వారు దాదాపు వందకు పైగా అక్కడే ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్ళందరికీ అమ్మలా రోజూ అన్నం పెట్టి, వైద్యుడిలా సేవలందించి కనిపించే దైవంలా వారి గుండెల్లో కొండంత అభిమానం సంపాదించింది ప్రణతి.
లాక్‌డౌన్‌ రోజులు పెంచుకుంటూ పోతోంది ప్రభుత్వం. తాను చెప్పినట్టుగానే రోజూ ఆకలిగొన్న వారికి అన్నం పెట్టి ఆదుకుంటుంది హీరోయిన్‌ ప్రణతి. కొందరు ఆమెనుద్దేశించి ''కోట్లు దీసుకుని తెరమీద హీరోల్లా నటిస్తే సరిపోదు, ఇలా మనుషుల మధ్య కొచ్చి వారి కష్టాలు తీర్సినోడే అసలైన హీరో. హీరోలు జెయ్యాల్సినపని హీరోయిన్‌ జేస్తుందిక్కడ అంత అందం, హోదా వుండి కూడా మనలో కల్సిపోయి, మన బాగోగులు జూసుకుంటూ ఏ రోగానికి భయపడకుండా... మనకండగా నిలబడిందే.. నిజంగా ఈ తల్లి మనపాలిట దేవతామూర్తి'' అని కొనియాడారు. వాళ్ల మాటలన్నీ అంజిగాడికి వినబడుతున్నాయి. రేయింబవళ్ళు నిద్రకాసి, టాకీసుల సుట్టూ ఎర్రితిరుగుల్లు తిరిగి, కటౌట్లకు దండలేసి, దండం బెట్టింది ఈ హీరోలకా! తలుసుకుంటేనే నా మీద నాకే చిరాకేస్తుంది. కళ్లారా చూసిన నిజాలు, ఎదురైన అనుభవాలు అంజిగాడికి కనువిప్పు చేశాయి. ఇన్నాళ్లు పేరుకుపోయినా ఆ పిచ్చి అభిమానమంతా ఒక్కసారిగా కడిగేసినట్టయింది. ఇప్పుడు వాడి మనసు తేటతెల్లమయ్యింది. ఆపదలో వున్నవారిని ఆదరిస్తున్న ప్రణతి మేడమ్‌ సేవలో అంజీ, శీను కూడా పాలుపంచుకున్నారు. అందుకు ఆమె చాలా సంతోషించింది.

   ''ఏం అంజీ! మీ అమ్మ ఆరోగ్యం పూర్తిగా నయమయ్యిందిగా! మా అమ్మను కూడా చూద్దువుగానీ రా!'' అంటూ ఓ రోజు అంజిగాడ్ని వాళ్ళింటికి తీసుకెళ్లింది ప్రణతి మేడమ్‌. ఆమె మనసులాగే ఇల్లు కూడా విశాలంగా, అందంగా వుంది. తన మీద మేడమ్‌ కురిపిస్తున్న అభిమానానికి మురిసిపోయాడు అంజిగాడు. ''అంజీ! చూసావా మా అమ్మ.. ఇప్పటికీ ఎంత ఆరోగ్యంగా వుందో.. ఈ సంవత్సరమే వందేళ్లు దాటాయి''. ''మీరెంతైనా డాక్టర్‌ కదా మేడమ్‌.. అందుకే మీ అమ్మగారు ఇంతవరకూ బాగున్నారు''. ''నువ్వన్నది నిజమే అంజి, నా కోసం ఎంతో కష్టపడి నన్నింతదాన్ని చేసిన మా అమ్మంటే నాకు ప్రాణం. అందుకే! అందరితో చెప్తుంటాను. మా అమ్మే నా హీరో'' అని. ఎందుకో ఆ మాట అంజిగాడికి అద్భుతం అనిపించింది. ఆ మాటను అట్టాగే భద్రంగా గుండెలో దాచుకున్నాడు.
లాక్‌డౌన్‌ విధించి రెండు నెలలు పూర్తయ్యాయి. ప్రజలు సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి ప్రభుత్వం బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. ఎవరి ఊర్లకు వాళ్లు వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు మమ్మల్ని కడుపులో బెట్టుకుని సూసుకుంటిరని.. అన్నా వదినలకు వందనాలు చెప్పింది లచ్చమ్మ. అది తమ బాధ్యతంటూ బదులు జెప్పారు ఆ దంపతులిద్దరూ. ప్రణతి ఆ కార్మికులందరి ప్రయాణ ఏర్పాట్లు దగ్గర ఉండి చూసింది. అందరూ చేతులెత్తి నమస్కరిస్తూ ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అంజి, శ్రీను ప్రణతి మేడమ్‌ దగ్గరకొచ్చారు. ''మేడమ్‌! అంజిగాడు మీ కోసం చాలా కష్టపడి అచ్చు తప్పులేకుండా లెటర్‌ రాసాడు. ఇదిగో తీసుకోండని చేతిలో పెట్టి బస్సు దగ్గరికెళ్లాడు శ్రీను. మేడమ్‌ వైపు నేరుగా చూసి మాట్లాడాలంటే అంజిగాడికి బెరుకు. తనకు సరిగ్గా మాట్లాడడం రాదని వాడి అభిప్రాయం. మౌనంగా నిలబడ్డాడు. ఆమె పాదాల మీద పూలు కుమ్మరించి... ''మీరు మా దేవత మేడమ్‌'' అంటూ పరుగున బస్సు దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడి అభిమానానికి నువ్వెరపోయింది ప్రణతి. చేతిలో వున్న లెటర్‌ చూసింది...
''మేడమ్‌! మా అమ్మే నా హీరో'' అని ఆ రోజు మీ అమ్మగారిని చూపించారు. మా అమ్మ కూడా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వుండాలన్నదే నా కోరిక. అందుకు మీ మాటే నాకు ఆదర్శం. నేను కూడా మా అమ్మను హీరోలా చూసుకుంటా... ఈ మాట సచ్చిన మా అయ్యతోడనో, కనిపించని ఆ దేవుని తోడనో చెప్పను. ఎప్పుడూ జాలి కురిపించే మీ కళ్లసాక్షిగా., సాటివారికి సాయం చేసే మీ చల్లని చేతుల సాక్షిగా.. ఆపదలో వున్నవారి కోసం ధైర్యంగా ముందడుగు వేసే మీ పాదాల సాక్షిగా జెబుతున్న ఈ రోజు నుండి ''మా అమ్మే నా హీరో''.
తలెత్తి చూసింది. వెళ్తున్న బస్సులో నుండి అంజిగాడు ''బారు మేడమ్‌!'' అంటూ చేతులూపాడు. ప్రణతి మేడమ్‌ కళ్లనిండా ఆనంద భాష్పాలు. అవి ఒలికిపోకుండా కళ్లల్లోనే అదిమి పట్టుకుంది. అంజిగాడి అభిమానానికి సాక్ష్యంగా.
బస్సు జడ్చర్లలో ఆగింది.
''అమ్మా!... తాగడానికి ఏమైనా తీసుకురానా!'' అంటూ బస్సు దిగాడు అంజిగాడు. కొడుకు మాటలు విని విస్తుబోయింది లచ్చమ్మ. అప్పుడు హైదరాబాదు కెళ్తునప్పుడు.. ఇదే బస్టాప్‌లో ''దప్పికేస్తుంది కాస్త నీళ్ళు తీసుకురానాయనా'' అంటే మా హీరో సినిమా టి.విలో వస్తుంది. వెళ్ళి నువ్వే తాగిరా పో..'' అని కసురుకున్నాడు. అప్పటికీ, ఇప్పటికీ కొడుకు ప్రవర్తనలో మార్పును చూసి మనసులోనే మురిసిపోయింది లచ్చమ్మ. అమ్మా! ఇదిగో తీసుకోమని కొబ్బరిబొండాను చేతిలో పెట్టి కూర్చున్నాడు. బస్సులో ఎదురుగా వాడి హీరో సినిమానే వస్తుంది. ఆ సినిమా చూడ్డానికి మనసొప్పలేదు అంజిగాడికి. కిటికీవైపు తిరిగాడు. బస్సులో bవరో అన్నారు. ''ఈ మాయదారి రోగమొచ్చి దేశాన్నంతా మార్చేసిందని'' అవును నిజమే! ఆ రోగం సంగతేమోగానీ ఇన్నాళ్లు నా కొడుకు నంటుకున్న రోగం మాత్రం నయమై, మనిషిగా మార్చేసిందని, మనసులో అనుకుంటూ... సీటునానుకుని కునుకుతీస్తున్న అంజిగాడ్ని చూస్తూ అనుకొంది లచ్చమ్మ. 

ఎ.నాగాంజనేయులు
99590 17179