
బంధుమిత్రులు, అతిథుల రాకపోకలతో వామనరావు ఇల్లంతా ఒకటే హడావిడి.
మూడ్రోజుల కిందటే వాళ్లీ కొత్తింట్లోకి వచ్చారు. గృహప్రవేశానికొచ్చి ఇంకా ఉన్న బంధువులు, అప్పుడు రాలేక ఇప్పుడొచ్చి శుభాకాంక్షలు చెప్తున్న వాళ్లతో కొత్తిల్లు కళకళలాడుతోంది.
వామనరావు, ఆయన భార్య పరిమళ ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
వచ్చిన వాళ్లందరికీ ఇంట్లో అణువణువూ చూపిస్తూ ఉప్పొంగిపోతున్నారు. 'ఈ ఫ్లోరింగ్ అంతా రాక్ మార్బుల్స్, రాజస్థాన్ నుంచి తెప్పించాం. ఇది కన్సీల్డు కిచెన్, ఇది మాస్టర్ బెడ్‌రూమ్, పక్కది చిల్డ్రన్ బెడ్‌రూమ్, ఆ తరువాద్ది గెస్ట్‌రూమ్, అది పూజ గది, మూలది స్టోర్‌రూమ్, పైన లెఫ్ట్ కార్నర్‌లోది జిమ్, రైట్ సైడ్‌ది పెట్ కార్నివాల్, టాప్‌లో ఉన్నది పెంట్ హౌస్, ఇది సిటౌట్, లోపలది కారిడార్, సైడుది డ్రాయింగ్ రూమ్, ఇదే చేపల అక్వేరియం ప్లేస్' ఇలా అన్నీ చూపిస్తూ మురిసిపోతున్నారా భార్యాభర్తలు. వామనరావు చూపుల్లో విజయదరహాసం, పరిమళ మాటల్లో దర్పం స్పష్టంగా కనబడుతున్నాయి.
లిప్ట్, పనిమనిషికి ఔట్ రూమ్, స్విమ్మింగ్ పూల్, విశాలమైన గార్డెనింగ్‌తో ఈ మూడు అంతస్తుల పాలరాతి కట్టడం.. నిజంగానే ఒక అద్భుత కళాఖండంగా మెరిసిపోతోంది.
వామనరావు ఆదాయ పన్నుల శాఖలో ఉన్నతోద్యోగి. పరిమళ ధనిక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయి.
పదిహేనేళ్ల నుంచీ అద్దిళ్లల్లో ఉంటున్న వాళ్లకీయిల్లు కలల సౌధం.
వారం రోజులు గడిశాయి. హడావిడి సద్దుమణిగింది.
'ఇక వెళ్లస్తాన్రా!' అంటూ తన బట్టలున్న చేతి సంచీ తీసుకుని బయలుదేరాడు వామనరావు మామయ్య గంగయ్య.
'ఇంకో రెండ్రోజులుండి వెళ్దువుగాని మామయ్యా!' అన్నాడు వామనరావు.
'నేనిక్కడ ఇక చేసే పనేముంది? ఇప్పటికే వారం రోజులైపోయింది. నేనెళ్లకపోతే అక్కడ చేనెండిపోతుంది' అన్నాడు మామయ్య.
మధ్యాహ్నం భోజనం చేస్తేగానీ వెళ్లడం కుదరదు.. ససేమిరా! అని మొహమాట పెట్టేసింది పరిమళ.
ఆమె మాటను కాదనలేకపోయాడు గంగయ్య. గంగయ్య, వామనరావు తల్లి వేణమ్మకి స్వయానా అన్నయ్య.
తనది పేదరికమైనా ఉన్నతమైన మనస్సు. వాళ్లది ఒక చిన్న పల్లెటూరు. తనని ఊళ్లో అందరూ బాగా గౌరవిస్తారు.
వాళ్ల ఊళ్లో ఒక మోతుబరి రైతుకు నమ్మిన బంటుగా ఉండి, పొలం చూసుకుంటున్నాడు గంగయ్య.
వారం రోజుల ముందే గంగయ్య ఇక్కడకొచ్చి చిన్నా, పెద్దా పనులు చక్కబెడుతూ వచ్చాడు. ఇల్లు కడిగించడం, మామిడి తోరణాలు కట్టడం, ఆవు, దూడని తెచ్చి గృహప్రవేశానికి ఇల్లంతా తిప్పడం. వచ్చిన అతిథులకి ఏలోటూ రాకుండా చూసుకోవడం వంటి ఎన్నో పనులు మామయ్యే దగ్గరుండి చూసుకున్నాడు.
మామయ్యే చిన్నప్పటి నుంచీ వామనరావు కుటుంబానికి పెద్ద ఆసరా. అమ్మమ్మ ఇంటికెళ్లినప్పుడు భుజాల మీద ఎక్కించుకుని, పొలం తీసుకెళ్లి తియ్యటి తాటి ముంజలు, తేగలు వంటి ఎన్నో రుచులు పంచేవాడు. వచ్చినప్పుడల్లా బోలెడు తినుబండారాలు తెచ్చేవాడు. అందుకే ఇప్పటికీ తనకీ, చెల్లికీ మామయ్యంటే.. ఓ మధురమైన బంధం, ఆత్మీయ భావం.
మధ్యాహ్నమైంది.. భోజనం ముగిసింది. ఊరికి ఉపక్రమించాడు మామయ్య. వెళ్తూ, వెళ్తూ హాల్లో నెమ్మదిగా ఆగాడు మామయ్య. 'బాబూ! చిన్నమాట!' అని వామనరావుని పిలిచాడు.
'చెప్పు మామయ్యా!' అన్నాడు వామనరావు.
'ఇల్లు చాలా గొప్పగా కట్టేవు బాబూ! అందరూ నీ ఇంటి గురించి చెప్పుకుంటుంటే.. ఇది మా మేనల్లుడిల్లని చాలా పొంగిపోయాను బాబూ! కాకపోతే..!?' అని సందేహిస్తుండగా!
'చెప్పు మామయ్యా! ఫర్వాలేదు' అన్నాడు వామనరావు.
'ఈ ఇంట్లో.. అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుడికి గదుంది. చిన్న పిల్లలకు, రాబోయే అతిథులకీ గదులున్నాయి. పనిమనుషులకి, ఆఖరికి పెంపుడు కుక్కకీ, చేపల తొట్టికీ గదులున్నాయి కానీ, నిన్ను కన్నతల్లి కోసం ఎక్కడా తనకంటూ ఒక గది కనిపించడం లేదయ్యా?' అన్నాడు.
ఆ విషయం గురించే అంతగా ఆలోచించని వామనరావు మామయ్య మాటలకి షాకయ్యాడు.
'లంకంత ఇంటిలో ఆమె పడిమీదే తుంగ చాపేసుకుని పడుకుంటోంది. మీకోసం ఎవరైనా వస్తే! కనిపించకుండా తలుపెనకాలో! దొడ్డివైపు సందులోకో వెళ్లిపోయి, మరుగు చూసుకుంటోంది. తనకంటూ స్థిరమైన గదిలేక అదీ 'గడీలాటలో మప్పీలా గడియకో చోటుకి మారుతోంది'. దాని అవస్థ చూస్తుంటే! పూర్వమున్న తాటాకింట్లోనే స్వేచ్ఛగా ఉందనుకుంటున్నాను. అసలు ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది ఒక్క తల్లే రా! నీయంత చదువు, జ్ఞానం నాకు లేకపోయినా? వయసు పంచిన అనుభవంతో చెబుతున్నా. నేను తప్పు మాట్లాడుంటే మరోలా అనుకోవద్ది!' అంటూ చెప్పి వెళ్లిపోయాడు మామయ్య.
మామయ్య మాటలు మనస్సు లోతుల్లో ఎక్కడో గుచ్చుకున్నాయి.
ఉన్నఫళంగా సోఫాలో సతికిలపడ్డాడు వామనరావు. తనను తాను సరిపెట్టుకోలేని నిస్సహాయతేదో అతన్ని ఆవరించింది. కాసేపటికి తేరుకుని, కిటికీలోంచి అమ్మకోసం చూశాడు.
సందులోంచి ప్రహరీ అవతలున్న బయటి వాళ్లెవరితోనో అమ్మ మాట్లాడుతోంది.
చిన్నగా మాటలు వినబడుతున్నాయి.
'అవును ఇది నా కొడుకిల్లు, ఆడు పెద్ద ఆఫీసరు. మా కోడలు కూడా చాలా భాగ్యమంతుల పిల్ల' అని ఇరుగూ పొరుగుతో కొడుకు, కోడలు గొప్పలు తెగ చెప్పేస్తోంది. వామనరావుకి కన్నీళ్లాగలేదు. 'ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది తల్లి ఒకత్తేరా!' అన్న మామయ్య మాటలు గుర్తొచ్చాయి.
'మామయ్య చెప్పింది నిజమే కదా!' అనుకున్నాడు.
'అమ్మ మాకోసం ఎంత కష్టపడింది జీవితమంతా మాకోసం అరిగిపోయింది అమ్మ. మా బతుకుల్లో వెలుగులు కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోయింది. ఓసారి చిన్నప్పుడు వర్షానికి మా తాటాకింట్లో చూరు నుంచి నీళ్లు కారిపోతుంటే మాకు మైకా సంచి కప్పి, రాత్రంతా తాను తడుస్తూ కూర్చుంది అమ్మ. కాలేజీ వాళ్లు పొరుగు రాష్ట్రాలకు టూర్ పెడితే నన్నూ పంపించిందమ్మ. తరువాత తెలిసింది నాకోసం తన పెళ్లినాటి జరీ పట్టుచీర అమ్మేసిందని. తను రక్తం మరిగించినా, కండలు కరిగించినా.. మాకోసమే కదా!'
అనుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు. కళ్లల్లో నీళ్లు ధారాపాతమౌతున్నాయి.
కళ్లు ఒత్తుకున్నాడు వామనరావు. ఒక్కసారి తన బాల్యాన్ని నెమరు వేసుకున్నాడు.
అప్పుడు వామనరావుకి ఆరేళ్లు. చెల్లి సత్యకి మూడేళ్లు. పొద్దున్నే సద్దన్నం తిని, నాన్న పద్దరాజు పనికెళ్లాడు.
కాసేపటికే గుండె గుభేలుమనే కబురొచ్చింది. ఆ వార్త ఇంట్లో విషాదాన్ని నింపింది. పొలంలో పనిచేస్తున్న పద్దరాజుని మోటారు విద్యుత్ తీగ మృత్యువై కబళించింది. పని ముగించుకుని, కూలీ డబ్బులుతో వస్తాడనుకున్న ఆ ఇంటికి పద్దరాజు శవమై వచ్చాడు. వేణమ్మ ఆచేతనతో ద్ణుఖ సాగరంలో మునిగిపోయింది. ఏం జరిగిందో తెలియని వయస్సులో ఆ అమాయక పిల్లలు బిత్తర చూపులు చూస్తున్నారు. ఆ హాఠాత్పరిణామం ఇంటిల్లిపాదినీ కుంగదీసింది. వేణమ్మ రోజులు గడుస్తున్నా బాధ నుంచి కోలుకోలేకపోతోంది. యజమాని లేక ఇల్లు అనాధి అయిపోయింది. వేణమ్మకి మొదట్నుంచీ భర్తా, పిల్లలకి వండి పెట్టడం తప్ప మరో వ్యాపకం తెలియదు. క్రమ క్రమంగా ఇంట్లో అన్నీ నిండుకుపోయాయి. రోజు గడవడం కష్టమైపోతోంది. ఇరుగూ పొరుగూ కాస్త చేత సాయం అందించినా ఎంతకాలం గడుస్తుంది? కూర్చుని తింటే కొండలాగుతాయా? బిల్లు కట్టలేకపోతే.. కరెంటు కట్ చేసేశారు. పాల సరఫరా ఆగిపోయింది. ఇంట్లో బియ్యం డబ్బా ఖాళీ అయింది. పిల్లలు కిరాణా కొట్టుకి సామానుకు వెళ్తే... 'మీనాన్న వెయ్యి రూపాయలు ఇవ్వాలి. చెల్లించకుండానే పైకెళ్లిపోయాడు. ఇప్పుడు మీకు అరువిస్తే బాకీ ఎవరు తీరుస్తారు? అని' తిప్పి పంపించేశాడు షావుకారు.
ఇంట్లో రేపు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది వేణమ్మకి. ఇప్పుడు భర్త బెంగకన్నా ఆర్థిక సమస్యలే అసలు గుదిబండలయ్యాయి. ఈదలేని ఈ సంసార సాగరంలో శాశ్వత మునకే పరిష్కారమనుకుంది. అర్ధరాత్రి అంతా మాటు మణిగాక ఇంటి దూలానికి చీరకొంగు ముడివేస్తోంది వేణమ్మ. చేయి తగిలి అటకమీదున్న ఇత్తడి బిందె కిందపడి, ఠంగుమని చప్పుడైంది. నులక మంచం మీద పడుకున్న సత్య ఉలిక్కిపడి 'అమ్మా! అమ్మా!' అంటూ లేచి, ఏడుపు మొదలెట్టింది. 'ఏమీ లేదు పడుకో!' అని సముదాయించి, దుప్పటి కప్పి మళ్లీ పడుకో పెట్టేశాడు పక్కలో ఉన్న వాళ్లన్నయ్య. ఆ చీకట్లో మాసిపెట్టిమీంచి దీపకాంతి పిల్లల మొఖాల మీద పడుతోంది. నిద్రిస్తున్న ఆ పసిమొగ్గలు అమాయక ముఖాలు చూసి, కడుపు తరుక్కుపోయింది వేణమ్మకి.
'వీళ్లను అనాథలు చేసి, నేనిలా వెళ్లిపోవడం సమంజసమేనా?' అనిపించింది. ఒక్క క్షణం పిల్లలకోసం ఆలోచించింది. తన నిర్ణయం మార్చుకుంది. ఉబుకుతున్న ద్ణుఖాన్ని ఆపుకోలేక బిగ్గరగా ఏడుస్తూ మంచం మీదున్న ఇద్దరి పిల్లల్ని గట్టిగా గుండెలకు హత్తుకుంది. ఇలాంటి పిచ్చిపని ఇంకెప్పుడూ చేయకూడదనుకుంది.
ఒకరోజు అమ్మిచ్చిన పదిరూపాయాలతో టిఫిన్ తెచ్చుకోవడానికి వీధిచివరున్న హోటల్‌కి వెళ్లారు పిల్లలిద్దరూ. ఎంత సేపటికీ వాళ్లు రాకపోవడంతో అమ్మ తెగ కంగారు పడిపోయింది. వాళ్ల కోసం వీధిలోనే నిలబడిపోయింది. చాలాసేపటికి పిల్లలు బిక్క మొఖాలేసుకుని వచ్చారు. 'టిఫినేదీ?' అంది అమ్మ.
'అక్కడ చాలా మంది ఉన్నారు. మేము చాలాసేపు నిలబడ్డాం! టిఫిన్లు అయ్యిపోయాయి!' అని చెప్పారు పిల్లలు.
'కాలం కలిసిరాపోతే తాడే పామై కరుస్తుందంటే ఇదేనేమో?' అనుకొంది అమ్మ. 'అన్ని కష్టాలూ మనకే రావాలా?' అంటూ ఇంట్లో ఉన్న నూకలతో గబగబా ఉప్మా చేసి పెట్టి ఆ పూటకి పిల్లల కడుపు ఆకలి తీర్చింది అమ్మ.
ఉన్నట్టుండి ఒక మెరుపులాంటి ఆలోచన ఆమె మనసును తట్టింది. అనుకున్నదే తడవుగా దాన్ని కార్యరూపం దాల్చింది వేణమ్మ. వాళ్లింటి దగ్గరే టిఫిన్ సెంటర్ మొదలుపెట్టింది. కాలం, అవసరం దేన్నైనా నేర్పిస్తాయన్నట్టు ఆ వ్యాపారాన్ని తొందరగానే ఆకళింపజేసుకుని, ముందుకెళుతోంది ఆమె.
ఇప్పుడు వేణమ్మ టిఫిన్ వ్యాపారం బాగా సాగుతోంది. కుటుంబం ఏలోటూ లేకుండా గడిచిపోతోంది. రుచీ, శుచీ, శుభ్రం ఉండటంతో వేణమ్మ టిఫిన్‌కి గిరాకీ పెరిగింది. పిల్లలిద్దరూ చక్కగా చదువుకుంటున్నారు. ఎన్ని బాధలున్నా ఎప్పుడూ చిరునవ్వు మాయని ముఖం వేణమ్మది. ఆప్యాయమైన పలకరింపు, చేత సాయం ఆమె నైజం.
కలివిడికి, మంచితనానికి ఆమెకు ఊళ్లోనే మంచి గుర్తింపు తెచ్చాయి.
వేణమ్మకి డబ్బులు చేయి తిరగడంతో కిరణాకొట్టుతో సహా భర్త చేసిన పాతబకాయిలన్నింటినీ తీర్చేయాలనుకొంది.
'నాన్న ఎప్పుడో చేసిన బాకీలు ఇప్పుడు ఎవ్వరూ అడగట్లేదుగా? ఇప్పుడున్న ఫళంగా తీర్చడమెందుకు?' అమ్మతో అన్నాడు వామనరావు.
'రుణ శేషం, శత్రు శేషమన్నారు పెద్దలు.. మనం ఎప్పుడూ ఎవ్వరికీ బకాయి ఉండిపోకూడదు. మళ్లీ ఎన్ని జన్మలెత్తినా? తీర్చలేం' అంది అమ్మ. పద్దరాజు చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా తీర్చేసింది వేణమ్మ.
తల్లి శ్రమకు ప్రతిఫలంగా అన్నట్టు పిల్లలిద్దరూ కష్టపడి చదువుకుని, ప్రయోజకులయ్యారు. తనకు పెద్దగా చదువు లేకపోయినా పిల్లలు చదువు విషయంలో ఏలోటూ లేకుండా శ్రద్ధ పెట్టింది వేణమ్మ. సత్య టీచర్ శిక్షణ పూర్తిచేసింది. ఆమెకు పక్కూళ్లోనే మరో మాష్టారుతో వివాహం జరిగింది. వామనరావు రకరకాలు ఉద్యోగాలు చేసి, చివరికి ఆదాయ పన్నుల శాఖలో గ్రూప్ వన్ ఉద్యోగం సాధించాడు. డబ్బులు బాగా ఉన్న ఓ మోతుబరి వామనరావు గుణగణాలు, ఉద్యోగం చూసి ఏరికోరి మరీ వాళ్లమ్మాయి పరిమళని ఇచ్చి, వివాహం చేశాడు.
వామనరావు భార్యా పిల్లల్నేసుకుని చాలా ఊళ్లు తిరిగాడు. వేణమ్మ మాత్రం తన ఊరు, తన ఇల్లు, తన పని వదిలిపెట్టలేదు. తమ దగ్గరికి వచ్చేయమని కొడుకు ఎన్నిసార్లు అభ్యర్ధించినా? ఆమె చిరునవ్వుతో సర్ది చెప్పేసేది. 'ఈ మట్టి, ఈ ఇల్లు, ఈ పని, నా ప్రాణం.. ఒంట్లో ఓపికున్నంతకాలం ఇలా నడవనీ నాయినా, కాలూ చేయీ వంగిన తరువాత ఎలాగూ నీకు తప్పదు.. నన్నిబ్బంది పెట్టకంటూనే' పదిహేనేళ్ల గడిపేసింది వేణమ్మ.
వామనరావు పదోన్నతుల్లో పెద్దస్థాయి ఉద్యోగంతో నగరానికి చేరుకున్నాడు. ఇక అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకుని ఇల్లు కట్టుకోవడానికి సన్నాహాలు మొదలెట్టాడు. భార్యాభర్తలిద్దరూ తాము కట్టుకోబోయే ఇంటి గురించి ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎన్నెన్నో మోడల్స్ గాలించారు. తమ ఇల్లక అద్భుతం కావాలనేది వాళ్ల చిరకాల స్వప్నం.
పరిమళ వాళ్ల నాన్నగారు కూడా ఆ ఇంటి నిర్మాణానికి ఆర్థికంగా సాయపడ్డాడు. వాళ్లనుకున్నట్టుగా సకల సదుపాయాలు, సర్వ హంగులతో వారి కలల సౌధం సాకారమైంది. వామనరావు అమ్మను కూడా ఒప్పించి, ఈ ఇంటికి తీసుకొచ్చేశాడు. గృహప్రవేశమై అనుకున్నట్టుగా అన్నీ సక్రమంగా జరిగిపోవడంతో ఆనందంగా, చాలా తెలికైపోయాడు వామనరావు.
ఇంతలోనే మామయ్య తమ బాధ్యతని గుర్తు చేయడంతో గతాన్ని జోగుతున్న వామనరావు.. నెమ్మదిగా వర్తమానంలోకి తేరుకున్నాడు. అప్పటికే తెల్లవారిపోయింది.
తన ఆలోచన్ని పరిమళ ముందుంచాడు. ఆమె ఎంతో ఆనందపడింది. ఒక మంచం, టేబుల్, కుర్చీ, టీపాయి హుటాహుటిన గెస్ట్‌రూంలోకి తరలించేశారు. అమ్మా, నాన్న తాలూకు ఫొటోలన్నింటినీ ఆ గదిలో అలంకరించారు. స్టోర్ రూంలో మూలనున్న అమ్మ నులక మంచం, నాన్న వాడిన మడత కుర్చీ, ట్రంకు పెట్టి, బేట్రీ లైటు ఇవన్నీ కూడా ఆ గదిలో సర్దేశారు.
పడి మీద కూర్చున్న వేణమ్మను పరిమళ, వామనరావు చెరొక చేయి పట్టుకుని, మేడమీద అతిథి గది దగ్గరకు తీసుకొచ్చారు. గుమ్మంపైన 'అమ్మ గది' అని పెద్దపెద్ద అక్షరాలతో రాసి ఉంది. అమ్మ కళ్లల్లో ఆనంద భాష్పాలు పుత్ర వాత్సల్యమై కురిశాయి. గదిలోకి కూడా తీసుకెళ్లారు కొడుకు కోడలు. గది నిండా ఉన్న ఆమె తాలూకూ వస్తువులు, స్మృతుల్ని తేరిపార చూస్తూ పరవశించి పోయింది. కొంచెంసేపు ఆమె కన్నీళ్లే మాట్లాడాయి. తమాయించుకుని తెరుకున్నాక 'ముసిలిదాన్ని ఏ పడి మీద తలదాచుకున్నా.. రోజెల్లిపోతుంది. ఈ గదులు, ఏసీలు గట్రా నాకెందుకురా బాబూ?' అంది.
వామనరావుకి మామయ్య మాటలు మళ్లీ గుర్తొచ్చాయి. 'లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది అమ్మ ఒకత్తే!' అని. నాటి నుంచీ వామనరావు అందరికీ చెప్తూనే ఉన్నాడు. 'ఇంట్లో పూజగది కంటే ముందుగా ఉండాల్సింది 'అమ్మ గది' అని అందరికీ చాటుతున్నాడు.
- చిలుకూరి శ్రీనివాసరావు