
మాటలు నేర్చే వేళ మొదటి పలుకు అమ్మ భాషలోనే పలుకుతాం.. పెరిగి పెద్దయ్యి పాఠశాలకు వెళ్లే వరకూ అమ్మభాషలోనే ఎన్నో నేర్చుకుంటాం.. బడిలో పాఠ్యాంశాలు అమ్మభాషలోనే అవగాహన చేసుకుంటాం. అందుకే అమ్మభాష అంటే అందరికీ మక్కువే! ఆ ఇష్టం గురించి చెప్పే మాటలు, పాటలు మనకు ఎక్కువే! భాష కేవలం సమాచారం కోసమే కాదు.. అవసరపడే అక్షరం కలకాలం వెలుగొందుతుంది. పాలకుల ఆంగ్లభాషా మాధ్యమంపై మోజు.. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన పరిస్థితిని తెచ్చింది. 'విద్య అనేది.. సమాజం పెంపొందేలా ఉండాలి! అదే సందర్భంలో విద్య అనేది అభ్యాసానికి పునాది. అందుకు మాతృభాషలోనే ప్రాథమిక విద్య నేర్వాలి!' అని యునెస్కో ఈ ఏడాది ఇచ్చిన నినాదం. అందుకే అమ్మ భాషే అందరికీ మూలధనం. దీనిపైనే ఈ అట్టమీది కథనం.
మన మాతృభాష తెలుగు వ్యాప్తికి, మనుగడకి సంబంధించి కొన్నేళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ ఐదు ప్రపంచ తెలుగు మహాసభలూ దీనిపైనే జరిగాయి. ఆయా ప్రాంతాల యాస, మాండలికాలు ఎన్నున్నా.. అవన్నీ అల్లుకున్నది తెలుగు పందిరికే అన్నది మరిచిపోకూడదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు మాట్లాడేది తెలుగే. ప్రాథమిక విద్య వరకైనా మాతృభాషలో ఉంటేనే పిల్లల ఆకళింపుకు సులువు. దీన్ని అమలు చేయాల్సింది పాలకులే!

ఘనమైన చరిత్రే మనది..
తెలుగు భాషకు వెయ్యేళ్లకు పైబడిన చరిత్ర, విస్తృతమైన సాహిత్యం ఉంది. అందుకే అందరం మాట్లాడే అమ్మభాష తెలుగు ఘనమైనది. పద్యాలూ పాటలూ, కథలూ కావ్యాలూ, నాటకాలూ నాటికలూ, ప్రబంధాలూ మహా గ్రంథాలూ.. ఇలా ఆయా కాలాలను, ప్రజల జీవితాల్ని ప్రతిబింబించాయి. ఇలా అనేక సాహిత్య ప్రక్రియలు వర్థిల్లాయి. జనజీవన స్రవంతిలోకి సజీవంగా ప్రవహించాయి. ఏవైనా తీయతీయని తేనెలొలికే తెలుగు పలుకులు వెల్లువలా ప్రవహించాయి. ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగూ ఉందంటే అతిశయోక్తి కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ, దేశం బయటా దాదాపు 16 కోట్ల మంది వరకూ తెలుగు మాట్లాడతున్నారని ఒక అధ్యయనం. మనదేశంలో హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగే. తెలుగుకు ప్రాచీన భాష హోదా ఉంది. ఇవన్నీ మన తెలుగు ఘనకీర్తులే. కానీ తెలుగు వాడుక రోజురోజుకూ తగ్గిపోతుందన్నది ఒక నమ్మాల్సిన వాస్తవం. ఇప్పటికిప్పుడే ఈ ప్రమాదం ప్రభావం కనిపించకపోవచ్చు.. కొన్నేళ్లకు ప్రాభవం కోల్పోయిన భాషల్లో తెలుగు భాష చేరుతుందనేది యునిసెఫ్ హెచ్చరిక.
ఏ భాష అయినా మన అవసరాలు తీర్చుకోవటానికే ఉపయోగపడుతుంది. ఒక సమూహపు ప్రజావసరాలు, జీవనం ఆ సమూహానికే పరిమితమైనప్పుడు, ఆ సమూహం అమ్మ భాషకు వచ్చే ఇబ్బందేమీ లేదు. ఇతర సమూహాలతో, ప్రాంతాలతో కలిసినప్పుడు మాటల్ని ఇచ్చిపుచ్చుకోవటంతో రెండు భాషలూ పరిపుష్టమవుతాయి. ఇది భాష పుట్టినప్పటి నుంచీ అనుభవంలో ఉన్నదే! కానీ, మన భాషకు మించి పరాయి (ఆంగ్ల) భాషకు ఆధిపత్య స్థానం ఇవ్వటమే ప్రమాదకర ధోరణి. ఇప్పుడు జరుగుతున్నది ఇదే! ఈ ధోరణి క్రమేణా అమ్మభాషకు చెల్లుచీటీని ఇస్తుంది.
ఎన్నెన్ని అందాలో.. ఎన్నెన్ని అల్లికలో..
భావ వ్యక్తీకరణ సాధనం భాష. ఇది సాధారణమైన విషయమే. కానీ, దానితో మనకు అంతకుమించిన అనుబంధం ఉంది. మన అవసరాల్ని మన భాషే అర్థం చేసుకుని, అవగాహనయ్యేలా చెబుతుంది. ఉదాహరణకు మన కుటుంబాల్లోని అనుబంధాల్నే పరిశీలిద్దాం. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, మామయ్య, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అత్త, పిన్ని, బాబాయి, పెద్దమ్మ, వదిన, మరదలు, బావ, మరిది ... ఇలా అనుబంధాల్ని పెనవేసే కమ్మని పిలుపులు మనవి. ఆంగ్లం వచ్చాక అందర్నీ కలిసికట్టుగా ''అంకుల్, ఆంటీ'' అనడమే ఎక్కువైంది. అది ఎలానో వివరణ అడగాలి. ఆఖరుకు అమ్మమ్మ, నాన్నమ్మల్ని 'గ్రాన్మా, గ్రానీ' అని పిలుస్తూ.. పిలిపించుకుంటూ గొప్పగా ఫీలవుతున్నారు. మాతృభాషలో అయితే చిట్టి అత్తయ్య, పెద్దత్తయ్య, పెద్దమామయ్య, చిన్నమామయ్య, చిన్నత్తయ్య, పెద్దనాన్న, పెద్దమ్మ, బుజ్జిపిన్ని, బుల్లి బాబాయి.. ఇలా పిలుపుల్లో నిర్ధిష్టంగా, ఇష్టంగా మన బంధాలను వ్యక్తంచేసుకోవొచ్చు. కొన్ని విషయాలు ఆంగ్లంలో చెప్పలేం. మన వ్యవసాయ పనిముట్లనే తీసుకుందాం. పార, పలుగు, తట్టా, బుట్టా, కంకి, కొడవలి, నాగలి, అరక వంటివి మనకే సొంతం. అలాగే విత్తనాలు చల్లడం, నాట్లు వేయడం, ఏరువాక, కుప్పనూర్చడం, తూర్పారబట్టడం వంటివీ వినసొంపుగా ఉంటాయి. ఆటపాటల్లోని ఒప్పులకుప్ప ఒయ్యారి భామ, వానా వానా వల్లప్ప, తొక్కుడుబిళ్ల, వీరి వీరి గుమ్మడిపండు, చిట్టిచిలకమ్మ, చిట్టి చిట్టి మిరియాలు, బుజ్జిమేక బుజ్జిమేక వంటి సొగసైన పదాల పాటలకు, వ్యక్తీకరణలకు పరాయి భాషలో చెప్పలేం. మన జీవనంలోని అనేక అనుభవాల్లోంచే జాతీయాలు, నానుడులు, సామెతలూ పుట్టాయి. అవి ఒక్క వాక్యంలోనే మొత్తం వ్యవహారం స్ఫురింపజేస్తాయి. 'తింగడు తిరనాళ్లకు వెళ్లాడు.. వచ్చాడు..', 'దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు..' 'ఏరు దాటేదాకా ఏరు మల్లయ్య.. ఏరు దాటాక బోడిమల్లయ్య..' వంటి సామెతలు అందుకు ఉదాహరణలు. 'పండు వెన్నెల జాబిలి.. నిండు పున్నమి జాబిలి', 'ఉట్టిమీద కూడు.. ఉప్పుచేప తోడు', 'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా..' అనే పాటలు మనకు దృశ్యాన్నే కళ్లకు కడతాయి. మనమూ అనుభూతి చెందుతాం. వృత్తి, సంస్కృతిపరంగా, సామాజిక జీవనం, ప్రాంతాల పరంగా మనది అనంతమైన పద సంపద. వాడుక మాటలూ కోకొల్లలు. మనం పెరుగుతున్న క్రమంలో.. పరిసరాల్లో చూసినవీ, విన్నవీ తెలుసుకుంటాం.. నేర్చుకుంటాం. అలా వాటిని వాడుకలోనూ వాడేస్తుంటాం. పరాయి భాషలో వ్యక్తీకరించవచ్చేమో కానీ, లోతైన భావం, సొంపైన పదాలు సాధ్యం కాదు. అందుకే అమ్మభాష అమ్మతో ఉన్నట్లే అనిపిస్తుంది.
ఆలోచనలు ఎన్నో.. ఆచరణలో సున్నా..
ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. తెలుగుభాషా ప్రాభవం పెంచటానికి పలు తీర్మానాలు చేశాయి. ఆ ఆలోచనలు దారి ఒకతీరు.. కానీ, ఆచరణలో మరోతీరు.. అమలులో ఒక్కటీ కాలేదు. మహాసభల సందర్భంలో తెలుగుకు ప్రాచీన హోదా గురించిన చర్చలు చేశారు. హోదా రావటం వల్ల తెలుగు వికాసం గురించి, ఎన్నెన్ని విస్తృత కార్యకలాపాలకు అవకాశం ఏర్పడుతుందో భాషావేత్తలు, సాహిత్య అభిమానులూ ఆశావహం వ్యక్తం చేశారు. కానీ, ఇన్నేళ్లలో జరిగింది శూన్యం. పైపెచ్చు మాతృభాష వికసించి, పరిమళించాల్సిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మొగ్గలోనే వసివాడేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగమే ప్రభుత్వ బడుల్లో ఆంగ్లమాధ్యమం తేవాలన్న ఆలోచనలు. పాలనలో తెలుగు వాడుక, తెలుగులో కోర్టు తీర్పులు, అరుదు. సమూలమైన మార్పు ఊసే లేదు. కేవలం సాహిత్య భాషగా ఉంటే, అది పుస్తకాలకే పరిమితమవుతుంది. పాఠశాల మాధ్యమంలో, పాలనా వ్యవహారాల్లో మాతృభాషకు స్థానం ఉండాలి. అప్పుడే అది ఒక అవసరంగా, ఒక వ్యవహారిక సాధనంగా మారుతుంది. మాటల్లో ఉన్న తెలుగు ఘనత చేతల్లో లేనప్పుడు ఫలితం శూన్యం. అవసరానికి ఉపయోగపడనిది కాలక్రమంలో మూలనపడడం సహజమైన ప్రక్రియ. తెలుగు భాష పరిస్థితి అలాకాకుండా చూడాలి. బహుభాషల ప్రవేశం విద్యా విధానాన్ని, సమాజాన్ని అభివృద్ధి చేసేలా ఉండాలి. అభ్యాసం అమ్మ భాషలో ఉంటేనే అవగాహన కలిగేది. అందుకే ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలి. ఇదే యునెస్కో చెప్పేది.
భాషతోనే భావం కలిగేది..
అమ్మభాష, సంస్కృతుల ఆవశ్యకతను, ఆకాంక్షను చాటిన తొలి గొంతు తెలుగువారిదే! 'ప్రజల భాషలో పరిపాలన జరగటం ప్రజాస్వామ్యానికి అవసరం' అనే ఆదర్శంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డ మొదటి రాష్ట్రం మనదే! భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాక దేశ భాషలకు సముచిత స్థానం ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. ప్రధాన భాషలను అధికార భాషలుగా గుర్తించటం, విద్యా విధానంలో పట్టభద్ర స్థాయి వరకూ రాష్ట్ర భాషా మాధ్యమం ప్రవేశపెట్టడం జరిగింది. తెలుగులో 1957లో సాహిత్య అకాడమీ, 1968లో తెలుగు అకాడమీ వచ్చాయి. 1969-1974కి తెలుగు మాధ్యమం పియుసి నుంచి బిఏ, బికాం, బిఎస్సీ స్థాయి వరకూ విస్తరించింది. కానీ, ఆ తర్వాత తెలుగుకు క్రమంగా ప్రాధాన్యం తగ్గింది. ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాధాన్యమూ తగ్గింది. వీటిస్థానే ప్రయివేటు ప్రాబల్యం పెరిగింది. దీంతో అమ్మభాషకు అన్యాయం మొదలైంది. ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నవాళ్ళకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభమైంది. తెలుగు మాధ్యమం అంటే తేలికభావం ఏర్పడింది. ఈ భావం తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో గట్టిగా స్థిరపరిచేలా కార్పొరేట్లు ఆధిపత్యం సాధించారు. ఇదే తెలుగు భాషా అన్యాయానికి ప్రధాన కారణం. అది ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ప్రాథమిక విద్య నుంచే ఆంగ్లంలో చదువు నేర్వటం అవసరమనే భావన పెరిగింది. ఆంగ్లం వద్దనడం తమ అస్థిత్వాన్ని పెంచేదంటూ కొన్ని వాదనలు ముందుకొచ్చాయి. ఇవన్నీ శాస్త్రీయ ఆలోచన విస్మరించే వాదనలే! వాస్తవానికి అమ్మభాషలోనే పిల్లలకు పాఠ్యాంశాలు అర్థమయ్యేది. ఆంగ్లంలోనే బోధన చేస్తే అదనపు సౌకర్యాలు, సహకారం పిల్లలకు అవసరం. నేటి మన రాష్ట్ర పరిస్థితుల్లో అంతటి ఆర్థిక స్థోమత లేని కుటుంబాలే ఎక్కువ. పరభాష నేర్చుకోవచ్చు. కానీ అదే ప్రధానభాష అయితేనే సమస్య.
మాతృభాషలోనే అభివృద్ధి..
అభివృద్ధి చెందిన ప్రతి దేశంలోనూ మాతృభాషలోనే విద్య నేరుస్తున్నారు. మన దేశంలోనూ 1968లో పార్లమెంటు సమ్మతించిన జాతీయ విద్యావిధానమూ ఇదే! కానీ, తర్వాతర్వాత కార్పొరేట్ల చేతల్లోకి విద్య చిక్కుకుపోయింది. దీంతో అమ్మభాషకు తీవ్రమైన అవమానం, అన్యాయం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో వీరి ప్రభావం మరీ ఎక్కువ. ఈ విద్యావిధానం విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో తీవ్ర ఒత్తిడిని కలిగించాయి. అత్యధిక ఫీజులు చెల్లించే పరిస్థితే కాకుండా, మొత్తం విద్యావ్యవస్థే నాశనమయ్యే పరిస్థితి దాపురించింది. అనారోగ్యకరమైన పోటీలు, బట్టీయం పద్ధతులు సామాజిక దృష్టినీ లోపింపజేశాయి. ఫలితం సమాజాభివృద్ధిపైనా తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆ విద్యావిధానమే తలకెత్తుకోవాలన్నది పాలకుల ధోరణి. తెలుగులో విద్యాబోధన అనేది ఒక పనికిమాలినదనే భావన పెంచుతున్నారు. తెలుగు మాట్లాడడం తప్ప రాయడం, చదవడం రాని, అర్థంకాని కొత్త తరాలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, కొన్నాళ్లకి తెలుగు భాష అనేది ఒకటి ఉందని చెప్పుకోవాల్సి వస్తుంది. అందమైన తెలుగు అక్షరం అదృశ్యం అయిపోవడం నిశ్చయం అనేది భాషా నిపుణులు ఆందోళన.
తెలుగు వెలుగుతోనే చెల్లుబాటు..
ఆంగ్లంలో మాట్లాడితేనే, ఇంగ్లీషు తెలిస్తేనే పనులు జరుగుతాయి అన్న భావన బలంగా స్థిరపడేలా మన పాలనా యంత్రాంగం ఉంది. దీని వెనుక పెట్టుబడిదారులకు అనుకూలమైన కుట్ర దాగి ఉంది. వారి దగ్గర పనిచేసే క్రమంలో భాష సమస్య రాకూడదనేదే పాలకుల ఎత్తుగడ. ఏ భాష మనుగడ సాగించాలన్నా అది పరిపాలనా భాషగా ఉండాలి. మాతృభాష ప్రజల అన్ని అవసరాలనూ తీర్చగలగాలి. అప్పుడే దానికి మనుగడ. అన్ని కార్యాలయాల్లో ప్రజలు సమా చారం ఇచ్చిపుచ్చు కోవడం, సంభాషణలు తెలుగులోనే జరపడం వల్ల భాష పట్ల గౌరవం పెరుగుతుంది. తెలుగు మొత్తం సమాజపు భాషగా వికసిస్తుంది. తెలుగు కలకాలం వినపడాలన్నా, కనపడాలన్నా.. అది అధికారిక హోదా పొందాలి. అప్పుడే తెలుగు వెలుగొందుతుంది. అన్నింటా చెల్లుబాటు అవుతుంది. చెల్లుబాటు జరిగినప్పుడు, జరుగుబాటు కుదిరినప్పుడు.. భాషే కాదు సమాజమూ వర్థిల్లుతుంది.

ఐక్యరాజ్య సమితి హెచ్చరిక..
ఐక్యరాజ్య సమితి ప్రపంచ భాషల విషయంలో కొన్ని హెచ్చరికలు చేసింది. సగానికి సగం భాషలు మాతృభాషలుగా మారి కనుమరుగు అవుతున్నాయని ప్రకటించింది. గడచిన మూడు శతాబ్దాల కాలంలోనే ప్రపంచంలో ఉన్న ఆరువేల భాషల్లో సగం భాషలు ప్రమాదంలో పడ్డాయని, అంతరించిపోతాయని చెప్పింది. ఇది నిజంగా మానవాళి మనుగడకు ప్రమాద హెచ్చరిక. భాష అంతరిస్తే క్రమంగా ఆ జాతి అంతరించినట్లే. జాతి అంతరిస్తే ఆ చరిత్ర కనుమరుగైనట్లే. మానవ సాంస్కృతిక వారసత్వానికి ఈ మాటలు కూలుతున్న నిచ్చెన మెట్లలాంటివని గుర్తించకపోతే మానవజాతికే పెనుముప్పు. ప్రకృతి విపత్తు లాంటిదే భాషావిపత్తు. తెలిసి తెలిసి భాష విషయంలో మనమే సమాధులను నిర్మిస్తున్నట్లుగా కనిపిస్తోంది. భాష అంతరించిపోవడం అంటే ఆ భాష మాట్లాడేవారు లేకపోవడమే. కానీ ప్రమాదంలో పడడం అంటే.. ఒక జాతి పిల్లలు కనీసం 30 శాతం మంది తమ సొంత భాషని నేర్వటం మానేస్తే, వారి భాష ప్రమాదంలో పడినట్టు.. అని ఐక్యరాజ్య సమితి వివరంగా చెప్పింది.

'యునెస్కో' ప్రకటన
బంగ్లాదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 21ని 'అంతర్జాతీయ మాతృభాషా దినం'గా ప్రకటించాలన్న అభ్యర్థనను యునెస్కో స్వీకరించింది. అప్పటికే కెనడాలో 'ప్రపంచ మాతృభాషా ప్రేమీ మండలి' అనే సంస్థ ఉండేది. ఇంగ్లీషు, కుచి, కాంటినీస్, జర్మన్, ఫిలిప్పినో, బెంగాలి, హిందీ భాషలు మాట్లాడే ప్రజల ప్రతినిధులు అందులో ఉండేవారు. వీరూ ఫిబ్రవరి 21ని 'అంతర్జాతీయ మాతృభాషాదినం'గా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని, యునెస్కోను కోరారు. భారత్, పాకిస్థాన్, శ్రీలంకతో సహా 28 ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలన్నీ ఈ ప్రతిపాదనకు మద్దతు పలికాయి. 1999, నవంబర్ 17న జరిగిన యునెస్కో 30వ సాధారణ సమావేశంలో ఫిబ్రవరి 21ని 'అంతర్జాతీయ మాతృభాషా దినం'గా పాటించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది.
ముఖ్యాంశాలు :
- యునెస్కో సభ్యదేశాలు భాషల ప్రేరణగా అంతర్జాతీయ స్వభావం గల సామాజిక, ప్రసార మాధ్యమాల వాతావరణానికి అవసరమైన పరిస్థితులను కల్పించాలి.
- ప్రపంచంలోని అన్ని జాతుల ప్రజల భాష, విజ్ఞానం, సంస్కృతి అందరికీ అందుబాటులోకి రావడానికి అవసరమైన బహుభాషా విద్యా బోధనను దేశాలు ప్రోత్సహించాలి.
- వివిధ సంస్కృతులు గల ప్రజల మధ్య సంభాషణ జరగాలంటే యువతను విద్యావంతుల్ని చేయాలి. అప్పుడే వారిలో పరస్పర గౌరవం, సహనం కలుగుతాయి.
- చిన్నారుల్లో శక్తి సామర్థ్యాలు పెరగాలంటే భాషోచ్చరణ, వ్యాకరణ నిపుణత అవసరం.
- బాలబాలికల్లో క్రియాశీలత, మంచి అవగాహనా పటిమ, సృజనాత్మకతలను పెంపొందించేది స్వభాషే.

బంగ్లాదేశ్ భాషోద్యమం..
దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్‌ను తూర్పు పాకిస్తాన్‌గా పిలిచేవారు. వారి మాతృభాష బెంగాలి. కానీ వారి భాషకు తగిన గుర్తింపు లేదు. అందుకే బంగ్లాదేశ్ ప్రజలు పాకిస్తాన్ అధికార భాషల్లో బెంగాలీని ఒకటిగా గుర్తించాలని ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం నాలుగేళ్లు ఉవ్వెత్తున సాగింది. భాషా చైతన్యాన్ని రేకెత్తించింది. 1952, ఫిబ్రవరి 2 ఉద్యమం తుపానులా ఎగిసిపడిన రోజు. విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. నేతల్ని, మేధావుల్ని, అధ్యాపకుల్ని జైళ్లలో బంధించింది పాకిస్తాన్ ప్రభుత్వం. పోలీసులతో చిత్రహింసలకు గురిచేయించింది. అయినా ఉద్యమం ఉధృతంగా జరిగింది. ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపించింది. దాంతో మాతృభాషే ప్రాణంగా సాగుతున్న ప్రదర్శన ఒక్కసారిగా రక్తంతో తడిసింది. గాలిలో కలుస్తున్న ప్రాణాలు సైతం అమ్మభాష కోసం ఘోషించాయి. వారి బలిదానం వృధా కాలేదు. 1956లో పాకిస్తాన్ రాజ్యాంగం బెంగాలి, ఉర్దూ భాషలను అధికార భాషలుగా ప్రకటించింది. 1953 నుండి ఇప్పటివరకు ఫిబ్రవరి 21వ తేదీని బంగ్లాదేశ్ ప్రభుత్వం మృతవీరుల దినంగా పాటిస్తోంది. వారి స్మారకార్థం మెమోరియల్ స్థాపించింది. అది క్రమంగా సమావేశ స్థలంగా జాతీయస్థాయిలో గుర్తింపునూ పొందింది. ఈ ఉద్యమ ప్రేరణ, దానిపై ఉన్న గౌరవం బంగ్లాదేశ్ విమోచన ఉద్యమానికి పునాదులయ్యాయి. చిందిన రక్తం ఊపిరిలూదింది. 1972లో బంగ్లాదేశ్ తన రాజ్యాంగంలో బెంగాలీని గణతంత్ర రాజ్యభాషగా ప్రకటించింది.