Aug 29,2021 06:09

అమ్మ చెప్పే ఊసులు, లాలింపులు, జోలపాటల నుంచి అమ్మ పలికించే హావభావాల వరకు... అన్నీ అమ్మ దగ్గర నుంచే నేర్చుకోవడం ప్రకృతి ధర్మం. 'ఆకేసి, పప్పేసి, నెయ్యేసి...అమ్మకో ముద్దా, నాన్నకో ముద్దా, నీకో ముద్దా...' అంటూ, 'చందమామ రావే...జాబిల్లి రావే' అంటూ గోరు ముద్దలు తినిపిస్తూ...చిన్ని చిన్ని మాటలు నేర్పుతుంది. 'చిట్టి చిలకమ్మా...అమ్మ కొట్టిందా?' అంటూ లాలిస్తుంది. తెలుగులోనే మాట్లడడం, తెలుగులోనే వినడం, అర్థం చేసుకోవడం అమ్మ దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. అందుకే అది మనకు మాతృభాషగా మారింది. భాష ఏదైనా...తొలి పలుకులు నేర్పేది అమ్మే. అమ్మ దగ్గర నుంచే నేర్చుకుంటాం గనుకనే ఎవరి మాతృభాష వారికి గొప్ప. 'తెలుగు భాష తియ్యదనం/ తెలుగు జాతి గొప్పతనం/ తెలుసుకున్న వాళ్ళకి/ తెలుగే ఒక మూలధనం/ తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా/ తెలుగు మరచిపోతే/ వాళ్ళని నువు మరచినట్టురా' అని ఓ సినీ కవి చెప్పినట్లుగా...తెలుగు భాష తియ్యదనాన్ని, గొప్పదనాన్ని వేనోళ్ళా కొనియాడుతుంటాం. రోజుల బిడ్డ అయినా తల్లి మాటకు, తల్లి స్పర్శకు స్పందిస్తుంది. అలాగే తెలుగు భాష మాట్లాడినప్పుడు మన శరీరంలో 72000 న్యూరాన్లు యాక్టివేట్‌ అవుతాయని శాస్త్రీయంగా నిరూపితమైంది.
అయితే, ఏం తినాలో...ఏం కట్టుకోవాలో...ఏ భాషలో మాట్లాడాలో... ఏ భాషలో చదువుకోవాలో కూడా ప్రభుత్వాలే చెప్పడం అభ్యంతరకరం. ఇది వ్యక్తి స్వేచ్ఛకీ, వ్యవస్థ వికాసానికీ ఆటంకం. ఒకే జాతి, ఒకే భాష అంటూ మోడీ ప్రభుత్వం హిందీనో, సంస్కృతాన్నో బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు మాతృభాషను పక్కన పెట్టి, ఆంగ్లభాషలో విద్యాబోధన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి మన దేశంలోని 196 భాషలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, వీటిలో దాదాపు వంద భాషలు వేగంగా అంతర్థానమవుతున్నాయని యునెస్కో హెచ్చరించింది. 2019ని దేశీయ భాషల అంతర్జాతీయ సంవత్సరంగా యునెస్కో ప్రకటించింది. అంతరించిపోయే ప్రమాదమున్న భాషల్ని కాపాడుకోవడానికి సత్వరం ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నది లక్ష్యం. దీనికి భిన్నంగా సాంస్కృతిక జాతీయవాదం పేరుతో ఒక భాషను అందరిమీదా రుద్దాలని బిజెపి ప్రభుత్వం చూస్తోంది. అలాగే రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే పాఠాలు బోధించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తెలుగు భాషాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన తెలుగు అకాడమీని... తెలుగు-సంస్కృత అకాడమీగా మార్చి, మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఒక భాష... బోధనా మాధ్యమంగా కానీ, పరిపాలనా భాషగా కానీ, మీడియా ఉపకరణంగా కానీ లేనట్టయితే అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటుందని భాషా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
'దేశ భాషలందు తెలుగు లెస్స' అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఇటాలియన్‌ భాష మాదిరిగా ఎక్కువ అచ్చులు వుండటంతో తెలుగు భాషను 'ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌' అని వెనీసుకు చెందిన వర్తకుడు, పరిశోధకుడు నికొలో డా కాంటి కితాబునిచ్చాడు. విదేశీయుడైన సి.పి.బ్రౌన్‌...తెలుగు భాష నేర్చుకోవడమే కాకుండా తెలుగులో నిఘంటువును రూపొందించాడు. ఆధునిక కాలంలో రాణించడానికి ఆంగ్ల భాష నేర్చుకోవడం అవసరమే. కానీ, మాతృ భాషను మరువకూడదు. 'మాతృభాషను సరిగ్గా నేర్వలేనివాడు ఇతర భాషలలో ఎన్నటికీ ప్రావీణ్యం గడించలేడు' అంటాడు జార్జ్‌ బెర్నార్డ్‌షా. మన భాష మన ఉనికి. మాతృ భాషని ప్రేమించలేనివాడూ, మాట్లాడరానివాడూ ప్రాణం లేని శరీరం లాంటి వాడు. 'తెలుగువాడివై తెలుగు రాదనుచు/సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా/అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు/సకిలించు ఆంధ్రుడా చావెందుకురా' అంటాడు కాళోజి. మనసులో భావాలను వ్యక్తం చెయ్యాలంటే మాతృ భాషను మించినది లేదు. గ్రాంథికం లోని వచనాన్ని వ్యవహారిక భాషగా మార్చి...భాషకు సొబగులు అద్దిన మహనీయుడు గిడుగు రామమూర్తి. వాడుక భాష కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా ఆగస్టు 29న 'తెలుగు భాషా దినోత్సవం' జరుపుకుంటున్నాం. ఏ ఉద్దేశంతోనైతే గిడుగు పోరాటం చేశారో...ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. తెలుగు భాషను కాపాడాల్సిన ప్రభుత్వం... ఆంగ్ల భాషను బలవంతంగా రుద్దుతోంది. తెలుగు భాష వెలుగులు మసక బారకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడిపై ఉంది. లేదంటే జాతి సృజన... భవిత ప్రశ్నార్థకమౌతుంది.