Sep 03,2023 21:09

అమలుకు నోచని ఇంటింటికీ రేషన్‌

చాపాడు : ప్రభుత్వం ఇంటింటికీ రేషన్‌ అందించే లక్ష్యంతో రేషన్‌ బియ్యం పంపిణీ ఆటోలను ఏర్పాటు చేశారు. చాలా గ్రామాల్లో, వార్డుల్లో పూర్తి స్థాయిలో అమలు కావడంలేదు. రేషన్‌ షాపుల వద్దనే ఆటోలను నిలిపి రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. చాపాడు మండల పరిధి లోని చాలా గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో వీధుల వెంట బియ్యం పంపిణీ చేపడితే రోజుకు వందలోపు కార్డులకు మాత్రమే బియ్యం పంపిణీ చేయడం కష్టం. రేషన్‌ షాపుల వద్ద పంపిణీ చేస్తుండడంతో ఒక రోజులో 200 నుంచి 3వందల కార్డుదారులకు బియ్యం పంపిణీ చేపడు తున్నారు. ఎండియు ఆపరేటర్లు ఈ పాస్‌ మిషన్లలో వేలి ముద్రలు వేసి రేషన్‌ డీలర్లకు పంపిణీ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగా పంపిణీ కొనసాగుతుండడంతో ప్రతి ఇంటికి రేషన్‌ లక్ష్యం నీరుగారుతోందనే విమర్శలున్నాయి. రెవెన్యూ సిబ్బంది రేషన్‌ పంపిణీని పర్యవేక్షించాలని ఆదేశాలు ఉన్నా వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎండియు ఆపరేటర్లు, రేషన్‌ డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు రేషన్‌ పంపిణీ ప్రక్రియను తరచూ తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
-మైదుకూరు మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీలో రేషన్‌ బియ్యం కోసం పడిగాపులు కాస్తూ శనివారం ప్రజలు కనిపించారు. ఇప్పటికైనా అధి కారులు ఇంటి వద్దకు రేషన్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని లబ్ధి దారుల డిమాండ్‌ చేస్తున్నారు. రేషన్‌ కోసం బారులు తీరిన వ్యవహారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మైదుకూరు తహశీల్దార్‌ అనురాధ స్పందించి రేషన్‌ పంపిణీ వద్దకు సిబ్బందిని పంపారు. సిసి రోడ్లు వేస్తుం డడంతో అన్ని వీధులకు ఒకే చోట ఇస్తున్నామని తెలిపారు. మరుసటి నెల నుండి ఇంటి వద్దకు రేషన్‌ పంపిణీ చేయాలని తహశీల్దార్‌ ఆదేశించారు. అన్ని గ్రామాల, వార్డులలో ప్రతి ఇంటికి రేషన్‌ అందేలా చర్యలు తీసు కోవాల్సి ఉంది. మైదుకూరు ఇందిరమ్మ కాలనీలో శనివారం బియ్యం కోసం బారులు తీరిన ప్రజలు