ప్రజాశక్తి-అద్దంకి: రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి దశలవారీగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు నాయకులు జి వెంకట్రావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు ఆందోళన శిబిరానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వీఆర్‌ఏల ప్రధాన డిమాండ్ అయిన పే స్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పని చేస్తున్న వారందరినీ వీఆర్‌ఏలుగా నియమించాలని, అర్హులకు విఆర్‌ఓ, అటెండర్, వాచ్‌మెన్లుగా ప్రమోషన్ ఇవ్వాలని, డిఏ రికవరీ నిలిపివేసి టిఏతో కూడిన వేతనం అమలు చేయాలని కోరారు. ఈ డిమాండ్స్ పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళన చేయాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈ ఆందోళన చేపడుతున్నామని అన్నారు. సిఐటియు నాయకులు జి వెంకట్రావు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం అధికారంలో ఉందని, వీఆర్‌ఏ సమస్యలను పరిష్కరించాలని అనేకసార్లు వీఆర్‌ఏలు అధికారులకు ప్రభుత్వ పెద్దలకు సమస్య విన్నవించినా ఫలితం శూన్యమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వీఆర్‌ఏలకు ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదన్నారు. వీరికి 21 వేల జీతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. డిఎలో కూడా కోత విధించిం దని, రికవరీ ఆపాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఏమాత్రం దయ చూపలేదని అన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో మరో దశ పోరాటం చేయాలని సంఘం నిర్ణయించిందన్నారు. ఉద్యమ కార్యచరణలో భాగంగా శుక్రవారం మండల కేంద్రాల్లో దీక్షలు, ఆగస్టు 7, 8 తేదీల్లో కలెక్టరేట్ వద్ద దీక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఆగస్టు 23, 24 తేదీల్లో విజయవాడలో రాష్ట్రస్థాయి దీక్షలు, ఆగస్టు 25న చలో విజయవాడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం నాయకులు ఎం నరసింహారావు, కె స్వాములు, టి నాగేశ్వరరావు గురవమ్మ, పుట్టియ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
యద్దనపూడి: మండల కేంద్రమైన యద్దనపూడి గ్రామ తహశీల్దారు కార్యాలయం వద్ద గురువారం గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల హనుమంతరావు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అశోక్, జిల్లా కార్యదర్శి కరీముల్లా, విఆర్‌ఎలు షామిలి, నజ్మా, మాధవి, దయాకర్, కాసీం వలి, రత్నకిషోర్ తదితరులు పాల్గొన్నారు.










