అమకతాడు టోల్ ప్లాజా కార్మికుల
సమస్యలు పరిష్కరించాలి
- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు
ప్రజాశక్తి - క్రిష్ణగిరి
క్రిష్ణగిరి మండల పరిధిలోని అమకతాడు టోల్ ప్లాజా కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం క్రిష్ణగిరి మండల పరిధిలోని అమ్మకతాడు టోల్ ప్లాజా దగ్గర కార్మిక యూనియన్ అధ్యక్షులు అయ్యరాజు అధ్యక్షతన సిఐటియు జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. సిఐటియు జెండాను జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.నాగరాజు ఆవిష్కరించి మాట్లాడారు. అమకతాడు టోల్ ప్లాజాలో 10 సంవత్సరాలకు పైగా చాలీ చాలని వేతనాలతో కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. టిఎ, డిఎలు ఇవ్వాలన్నారు. గతంలో టిఫిన్, భోజన సౌకర్యాలు కల్పించేవారని, కరోనా నుండి వాటిని నిలిపివేశారని చెప్పారు. దానిని వెంటనే కొనసాగించాలని, డ్యూటీకి రావడానికి, పోవడానికి అయ్యే ప్రయాణ ఖర్చులు కంపెనీయే భరించాలని, సంవత్సరానికి ఒక నెల వేతనం బోనస్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాహనదారులతో ఎదురయ్యే ఇబ్బందులను కంపెనీయే పరిష్కరించాలని తెలిపారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి.శివరాం, డోన్ మండల కార్యదర్శి పి. రామాంజనేయులు, పట్టణ అధ్యక్షులు నక్కి శ్రీకాంత్, మండల, పట్టణ కోశాధికారులు బి.నాగమద్దయ్య, యు.శ్రీనివాసులు, ప్రజా నాట్యమండలి జిల్లా కన్వీనర్ కోయిలకొండ నాగరాజు,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.ఏ.చిన్న రెహమాన్, హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బి.నాగన్న, అమకతాడు టోల్ ప్లాజా ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కోశాధికారి శ్రీనివాసులు, నాయకులు రమేషు, రాముడు, మధు, నాగేంద్రుడు, వెంకటేష్, ఆర్‌కె.వి.రాజు, కార్మికులు పాల్గొన్నారు.










