Aug 07,2021 13:17

ముంబయి : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నివాసంతో పాటు ముంబయిలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు జుహులోని అమితాబ్‌ బంగ్లాతో పాటు, చత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్‌, బైకుల్లా, దాదర్‌ రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచి తనిఖీలు చేశారు. అయితే అది నకిలీ బెదిరింపు కాల్‌ అని తేలడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో థానేకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు ట్రక్‌ డ్రైవర్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి కంట్రోల్‌ రూంకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని, ఈ నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టామని కాలర్‌ చెప్పాడని, తక్షణమే గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, బాంబు డిటెక్షన్‌ అండ్‌ దిస్పోజల్‌ స్వ్కాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌, లోకల్‌ పోలీసులు రంగంలోకి దిగి... విస్తృత తనిఖీలు చేపట్టగా... అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదని చెప్పారు. దీంతో మొబైల్‌ నంబర్‌పై ఆరా తీయగా.. థానేలోని శిల్‌ పాఠా ప్రాంతానికి చెందినదిగా గుర్తించామని తెలిపారు. అతడు తాగుడుకు బానిసై ఇలా చేశాడని, కాలర్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు.