Feb 14,2022 07:19

పటియాలా : కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌ షాకు రైతు సెగ తగిలింది. పంజాబ్‌లోని పటియాలాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనటానికి వచ్చిన ఆయనకు వ్యతిరేకంగా సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పంజాబ్‌ శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కనీసమద్దతు ధర (ఎంఎస్‌పి)తో పాటు మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుచేయకుండా.. తాత్సారం చేస్తుండటంతో, యుపి సహా పలు రాష్ట్రాల్లో బిజెపి నాయకులకు సెగ తగులుతోంది. పటియాలాలో సభాస్థలి వద్దకు రైతులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భద్రతాబలగాలు మోహరించాయి. అయినా రైతులు వెనక్కితగ్గలేదు. రోడ్డుపై బైటాయించారు.ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడిగటానికి వచ్చారంటూ నిలదీశారు. రైతు ఉద్యమాల్లో అమరులను కించపర్చేలా బిజెపి నేతలు మాట్లాడుతున్నారనీ, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నేతల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తామని రైతు నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, ఆప్‌ సహా అన్ని ప్రతిపక్షాలను సభలో అమిత్‌షా టార్గెట్‌ చేశారు. ఐదేళ్లలో డ్రగ్స్‌ రహిత పంజాబ్‌గా తీర్చిదిద్దుతామని, దేశంలోనే నెంబర్‌1గా నిలుపుతామని అన్నారు. వేదికపై నుంచి అమిత్‌ షా, మాజీ సిఎం అమరీందర్‌సింగ్‌ 'జై శ్రీరామ్‌' అంటూ నినాదాలు చేశారు.