Jun 11,2023 23:49

అనకాపల్లి నెహ్రూచౌక్‌ జంక్షన్‌లో నిరసన తెలుపుతున్న వామపక్ష పార్టీల నాయకులు,

ప్రజాశక్తి - విలేకర్ల బృందం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యాన ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు పూనుకోవడంతో పాటు విశాఖ రైల్వే జోన్‌, ఇతర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌ షా గో బ్యాక్‌, గో బ్యాక్‌ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
అనకాపల్లి : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటనకు వ్యతిరేకంగా అనకాపల్లి నెహ్రూ చౌక్‌ జంక్షన్‌లో వామపక్షాలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సిపిఎం సీనియర్‌ నాయకులు ఎ.బాలకృష్ణ, సిపిఐ ఎంఎల్‌ నాయకులు పి.అజరు కుమార్‌ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేస్తూ అంబానీ, అదానీలకు సంపదను దోచి పెడుతుందని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వలేదని, ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర బిజెపి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంటా శ్రీరామ్‌, బి.ఉమామహేశ్వరరావు, బుగిడి నూక అప్పారావు, ఐద్వా నాయకులు జి.సుబాషిణి, సిపిఐ నాయకులు రాజాన దొరబాబు, వియ్యపు రాజు, తాకాసి వెంకటేశ్వరరావు, పాత్రపల్లి వీరు యాదవ్‌ పాల్గొన్నారు.
కె.కోటపాడు : కేంద్ర హోంమంత్రి పర్యటనను నిరసిస్తూ ఆదివారం కె.కోటపాడు, ఎ.కోడూరు గ్రామాల్లో వామపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు గండి నాయన బాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తూ, విభజన హామీలను అమలు చేయకుండా ఆంధ్రకు తీరని అన్యాయం చేస్తూ ఏ మొహం పెట్టుకొని విశాఖపట్నంలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు యర్రా దేముడు, ముత్యాలనాయుడు, గాడి ప్రసాద్‌, సిపిఐ నాయకులు రెడ్డి అప్పలనాయుడు, ఇల్లాకు రాము, పొంతపల్లి రామారావు, సీముసిరి సూర్యనారాయణ పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌ : విశాఖపట్నంలో కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా పర్యటనను నిరసిస్తూ నర్సీపట్నం అబిడ్స్‌ సెంటర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు డిసి హెచ్‌ క్రాంతి మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 ఏళ్ల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి ఏమి చేసిందని ప్రశ్నించారు. అమిత్‌ షా ఏ మొహం పెట్టుకొని విశాఖపట్నంలో విజయోత్సవ సభను ఏర్పాటు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హౌదాపై ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు సూర్యప్రభ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎల్వి.రమణ, మిడ్‌ డే మీల్స్‌ రాష్ట్ర అధ్యక్షులు కే.ప్రసన్న, రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి జి.ఫణింద్ర కుమార్‌, సిపిఎం నాయకులు లోవరాజు, విజయలక్ష్మి పాల్గొన్నారు.
సిఐటియు ఆధ్వర్యాన రాస్తారోకో
పరవాడ: అమిత్‌ షా పర్యటనకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యాన పరవాడ సినిమా హాల్‌ జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.నాయుడు, బి.అప్పారావు, జి.అప్పారావు, సిహెచ్‌.నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన
గాజువాక : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిలుపుదల చేస్తామని అమిత్‌ షా ప్రకటన చేయాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, ఉక్కు నిర్వాసితులు సంఘం ఆధ్వర్యాన పెదగంట్యాడ జంక్షన్లో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గాజువాక వైసిపి ఇన్‌ఛార్జి తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడుతూ, పార్టీలకు, యూనియన్లకు అతీతంగా సోషల్‌ మీడియా ద్వారా, ప్రజా సంఘాలతో కలిసి ఐక్యంగా ప్రజా ఉద్యమం నిర్మించినప్పుడే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణపై వెనక్కి తగ్గుతుందన్నారు. ప్రతి ఉద్యోగీ, కాంట్రాక్టు కార్మికులు, నిర్వాసితులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం అధ్యక్షులు గోందేశీ సత్యారావు, పులి వెంకటరమణారెడ్డి, మార్టుపూడి పరదేశి, గోందేశీ మహేశ్వరరెడ్డి, మసేనురావు, పిట్టా రెడ్డి, డివి.రమణ, మంత్రి శంకర్‌ నారాయణ, సిఐటియు నాయకులు కణితి అప్పలరాజు పాల్గొన్నారు.