Mar 27,2021 06:44

బైడెన్‌ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన రెండు మాసాలకే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ భారత్‌లో పర్యటనకు వచ్చారు. దీనిద్వారా రక్షణ భాగస్వామిగా, మిత్రపక్షంగా భారత్‌కు అమెరికా అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఒక సంకేతం ఇచ్చింది. ఆస్టిన్‌ భారత్‌కు రావడానికి ముందు జపాన్‌, దక్షిణ కొరియాల్లో పర్యటించారు. ఆసియాలోని ఈ రెండు దేశాలు అమెరికాకు సన్నిహితమైన మిలటరీ, వ్యూహాత్మక మిత్రపక్షాలు. ఆ తరువాతి పర్యటనకు భారత్‌ను ఎంచుకోవడం ద్వారా జపాన్‌, దక్షిణ కొరియాలతో సరి సమాన హోదాను భారత్‌కు ఇస్తున్నట్లు లాయిడ్‌ తెలియజేశారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా విధానానికి సంబంధించి భారత్‌-అమెరికా భాగస్వామ్యం మూలస్తంభంగా వుందని ఆయన అభివర్ణించారు. చైనాపై శతృత్వంతో భారత్‌-అమెరికా వ్యూహాత్మక పొత్తు, సైనిక భాగస్వామ్యాన్ని పటిష్టపరచుకునేందుకు బైడెన్‌ తన ముందున్న ట్రంప్‌ మాదిరే ఎక్కడ లేని ఆతృత ప్రదర్శిస్తున్నారు. క్లింటన్‌, బుష్‌, ఒబామా, ట్రంప్‌ వరకు వరుసగా వచ్చిన ప్రభుత్వాలన్నీ ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం (ఇప్పుడు ఇండో-పసిఫిక్‌) లో భారత్‌ను మిత్రపక్షంగా చేర్చాలన్న లక్ష్యాన్ని అనుసరించాయి.


ఎల్‌ఇఎంఓఇ (లెమోవ్‌), సిఓఎంసిఎఎస్‌ఎ (కామ్‌కాసా), బిఇసిఎ (బెకా) ఈ మూడు మౌలిక ఒప్పందాలను ఉపయోగించడం ద్వారా రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఆస్టిన్‌తో రాజ్‌నాథ్‌ జరిపిన సమావేశంలో అంగీకారం కుదిరింది. ఇది, అమెరికన్‌ మిలటరీపై భారత సాయుధ బలగాలు మరింతగా ఆధారపడేలా చేస్తుంది. అమెరికా ఇండో-పసిఫిక్‌ కమాండ్‌, సెంట్రల్‌ కమాండ్‌, ఆఫ్రికా కమాండ్‌లతో సహకారాన్ని పెంపొందించేందుకు భారత్‌ అంగీకరించినట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. దీంతో భారత్‌- అమెరికా సంయుక్త కార్యకలాపాల, సమన్వయ పరిధి మరింత విస్తృతమైంది. పశ్చిమాసియా లోనూ, ఆఫ్రికా లోనూ అమెరికా ఆధిపత్య లక్ష్యాలను నెరవేర్చేందుకు మోడీ ప్రభుత్వం సుముఖంగా వున్నట్లు కనిపిస్తోంది.


ఆస్టిన్‌ పర్యటనకు ముందుగా, చుతుర్ముఖ కూటమి (క్వాడ్‌) లో సభ్యదేశాలైన - అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ నేతలతో మార్చి 12న మొదటి శిఖరాగ్ర స్థాయి సమావేశం జరిగింది. అధికారిక ప్రకటన వంటివేమీ లేకుండానే, చైనాను ఎదుర్కోవడానికి క్వాడ్‌ వ్యూహాత్మక ఫోరమ్‌గా రూపొందుతోంది. 2020 ఏప్రిల్‌-మే మాసాల్లో లడఖ్‌లో సరిహద్దు ఘర్షణల తర్వాత, భారతదేశ భద్రతా ప్రయోజనాల రీత్యా చైనాను ఎదుర్కొనేందుకు క్వాడ్‌ను అవసరమైన ప్రతిఘటనా శక్తిగా చూసేవారికి ఒక విషయం స్పష్టం చేయాల్సి వుంటుంది. మోడీ ప్రభుత్వం మన:పూర్వకంగానే ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో చేరిందనేది గమనించాల్సిన విషయం. 2017లో భారత్‌లో ఒబామా పర్యటన సందర్భంగా జారీ చేసిన జాయింట్‌ విజన్‌ (ఉమ్మడి దార్శనికత) ప్రకటనతో ఈ వ్యూహం మొదలైంది. ట్రంప్‌ హయాంలో క్వాడ్‌ పునరుద్ధరణకు ముందు కూడా లడఖ్‌లో సరిహద్దు ఘర్షణలు చెలరేగాయి.


విదేశాంగ విధానం, వ్యూహాత్మక వైఖరి అనేవి ఒక దేశ ఆంతరంగిక విధానాలకు కొనసాగింపుగానే ఉంటుంది. మోడీ ప్రభుత్వం దేశీయంగా అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల పరిధిని పెద్దయెత్తున విస్తరించింది. అన్ని రంగాల్లోను మరింతగా ప్రైవేటీకరణ, అంతర్జాతీయ ఆర్థిక పెట్టుబడుల ప్రవేశానికి వీలు కల్పించే చర్యలు తీసుకుంటోంది. ఇటీవల బ్యాంకింగ్‌, బీమా రంగాలను ప్రైవేటీకరించేందుకు తీసుకుంటున్న చర్యలన్నీ అమెరికా సుదీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్లే.


ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ గుండుగుత్తగా ప్రైవేటీకరించడానికి సిద్ధమవుతున్నారు. చివరికి రక్షణ రంగాన్ని కూడా వదల్లేదు. 2020 సెప్టెంబరులో, రక్షణ ఉత్పత్తిలో ఎఫ్‌డిఐని ఆటోమేటిక్‌ రూట్‌ ద్వారా 74శాతానికి పెంచారు. ముందస్తు అనుమతితో వంద శాతం ఎఫ్‌డిఐని కూడా అనుమతించవచ్చు. భారత దేశంలోని కార్పొరేట్లు ఇప్పటికే రక్షణ ఉత్పత్తిలో ప్రవేశించాయి. భారత కార్పొరేట్లతో కలిసి అమెరికా ఆయుధ తయారీదారులు సంయుక్త పరిశ్రమలు స్థాపించాలని మోడీ ప్రభుత్వం ఆశిస్తోంది. లేదా నేరుగా భారత్‌లోనే ఉత్పత్తి యూనిట్లను స్థాపించాలని భావిస్తోంది. బలమైన అమెరికా సంబంధాలు కలిగిన ప్రైవేటు రంగంలో సైనిక పారిశ్రామిక సముదాయాన్ని అభివృద్ధిపరచాలని భారత్‌ లోని బడా బూర్జువా వర్గం ఆశిస్తోంది. ఈలోగా, ఆయుధాలు, పరికరాలకు భారత్‌ను ఒక పెట్టుబడి మార్కెట్‌గా మార్చేందుకు అమెరికా ఒత్తిడి తీసుకు వస్తోంది.


అమెరికాతో సైనిక పొత్తు పెట్టుకోవడం ద్వారా మోడీ ప్రభుత్వం ఇప్పటికే అమెరికాకు గులాంగిరీ చేసే స్థితికి వెళ్లింది. దీనివల్ల భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. రష్యా నుండి ఎస్‌-400 క్షిపణి విధ్వంసక వ్యవస్థను భారత్‌ కొనుగోలు చేసినట్లైతే అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదించిన సిఎఎటిఎస్‌ఎ (ఆంక్షల చట్టం ద్వారా అమెరికా శత్రువులను ఎదుర్కోవడం) కింద ఆంక్షలు విధిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఇటీవలి పర్యటనలో లాయిడ్‌ కూడా ఇదే సందేశాన్ని చేరవేశారు. భారత్‌లో వున్నపుడు ఈ విషయాన్ని ఏదో ఒక రకంగా చేరవేయాలని విదేశీ సంబంధాలపై సెనెట్‌ కమిటీ చైర్మన్‌ బాబ్‌ మెనెండెజ్‌ ఆయనను కోరారు.


ఎస్‌-400 క్షిపణి వ్యవస్థనను కొనుగోలు చేసినందుకు నాటో మిత్రపక్షమైన టర్కీపై ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది. రష్యా పట్ల బైడెన్‌ ప్రభుత్వం మరింత ఘర్షణాయుతమైన, కఠిన వైఖరిని తీసుకుంటోంది. పైగా, రష్యా నుండి అధునాతనమైన క్షిపణి విధ్వంసక వ్యవస్థను భారత్‌ కొనుగోలు చేయడాన్ని సానుకూల దృక్పథంతో తీసుకునే అవకాశం లేదు.


ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో గుత్తాధిపత్యానికై జరుగుతున్న పోరాటంలో అమెరికాకు డూప్‌గా భారత్‌ తయారవడాన్ని మోడీ ప్రభుత్వం అనుమతిస్తోంది. క్వాడ్‌ లోని ఇతర భాగస్వామ్య దేశాలైన జపాన్‌, ఆస్ట్రేలియాలు భారత్‌లా కాకుండా చైనాతో ఎన్ని విభేదాలున్నా ఆ దేశంతో విస్తృతంగా ఆర్థిక, వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తూనే వున్నాయి. చైనాతో పాటు, వారు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో వున్నారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం లోని 15 దేశాలు ఈ భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి.


మార్చి 18, 19 తేదీల్లో అలస్కాలో చైనా ప్రభుత్వ నేతలతో బైడెన్‌ ప్రభుత్వం ఉన్నత స్థాయి చర్చలు జరిపింది. ఇతర అంశాలపై ప్రతికూల వైఖరి కొనసాగిస్తూనే ఏకాభిప్రాయం వున్న రంగాల్లో చైనాతో కలిసి పనిచేయాలని అమెరికా భావిస్తోంది. ఆసియాలో అమెరికన్‌ ఆధిపత్య ప్రయోజనాలు నెరవేర్చేందుకు మోడీ ప్రభుత్వ సాగిలపడే వైఖరి ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ దృక్పథం నుండి వచ్చిందే. సామ్రాజ్యవాద అనుకూల, కమ్యూనిస్టు వ్యతిరేకతే వీరి వైఖరి. ఇటువంటి వైఖరి లేదా దృక్పథం భారతదేశ జాతీయ ప్రయోజనాలకు, సార్వభౌమాధికారానికి చేటు తెస్తుంది.
                                                              ('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)