Aug 04,2021 07:06

న్యూఢిల్లీ : అమెరికాతో అణు ఒప్పందం భారతదేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర విదేశాంగ విధానంపై రాజీ పడేదిగా ఉన్నందునే వామపక్షాలు దానిని వ్యతిరేకించాయని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆయన మంగళవారం పిటిఐతో మాట్లాడుతూ పై విధంగా పేర్కొన్నారు. సైనిక, వ్యూహాత్మక పొత్తులో భారత్‌ను భాగస్వామిని చేసేందుకు అమెరికా ఒత్తిడితో వచ్చిన ఒప్పందమిది. దీని వల్ల భారతదేశ ఇంధన భద్రతకు అసలు విలువే లేకుండా పోతుంది. అణు ఒప్పందం కుదిరిన దశాబ్దం తర్వాత జరుగుతున్న ఘటనలన్నీ తాము వ్యక్తం చేసిన ఆందోళన సరైనదేనని రుజువుచేస్తున్నాయి. ఈ ఒప్పందం వల్ల దేశంలో పౌర అవసరాలకు కనీసం ఒక్క మెగావాట్‌ కూడా అణు విద్యుత్‌ ఉత్పత్తి పెరగలేదు. ఈ ఒప్పందం వల్ల ఒనగూడిందేమీ లేదు. అమెరికాతో సన్నిహిత సైనిక పొత్తుకు లోబడి ఉండే ఒక మిత్రపక్షంగా భారత్‌ మారడం తప్ప. దేశ సార్వభౌమత్వం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి పట్ల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని వామపక్షాలు ఈ వైఖరి తీసుకున్నాయి. దీనితో చైనాకు ఎలాంటి సంబంధం లేదు. అణు సరఫరాదారుల గ్రూపు భారత్‌కు ఇచ్చిన మినహాయింపునకు చైనా అంతిమంగా మద్దతిచ్చినా వామపక్షాలు ఈ వైఖరి తీసుకున్నాయని సిపిఎం నేత చెప్పారు.
ఈ విషయంలో వామపక్షాలను చైనా ప్రభావితం చేసిందంటూ విజరు గోఖలే రాసిన పుస్తకంలోని వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన అన్నారు. ఆ సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బిజెపి సైతం పార్లమెంట్‌లో ఈ అణు ఒప్పందాన్ని వ్యతిరేకించిందనే విషయం బహుశా ఆయనకు తెలియదనుకుంటానని ఏచూరి వ్యాఖ్యానించారు.