- ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచ రాజకీయాలలో వ్యూహాత్మకంగా ఎంతో కీలక స్ధానంలో ఉన్నది. దక్షిణాసియా, మధ్య ఆసియా, పశ్చిమాసియా మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది. అమెరికా విదేశాంగ విధానం పరిశీలిస్తే వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాలలో లేక చమురు/ఖనిజ నిక్షేపాలు వున్న ప్రాంతాలలో జోక్యం చేసుకోవటం దాని ఆధిపత్య, సామ్రాజ్యవాద ధోరణిని తెలుపుతుంది. ఇరాక్, లిబియా, సిరియా, ఈజిఫ్టు మొదలగు దేశాలలో అమెరికా జోక్యం తన సామ్రాజ్యవాద ప్రయోజనాలను కాపాడుకోవటానికే.
అమెరికా ఐదు దశాబ్దాల క్రితం వియత్నాంలో ఓటమి చెందిన విధంగా, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో అవమానకరమైన రీతిలో ఓటమిపాలైంది. అస్రఫ్ ఘని నేతృత్వం లోని ప్రభుత్వం, సైన్యం కుప్పకూలిన తీరు చూస్తే...అమెరికా, దాని నాటో మిత్రపక్షాలు అక్కడ నెలకొల్పిన ప్రభుత్వం ఎంత డొల్లదో బయటపడింది. బయట శక్తులు వచ్చి బలవంతాన ప్రభుత్వాలను నడపాలనుకుంటే సాధ్యం కాదని ఆఫ్ఘనిస్తాన్ పరిమాణాలు నిరూపించాయి. 'ఆఫ్ఘనిస్తాన్ కోసం సుమారు 75 లక్షల కోట్లు (ట్రిలియన్ డాలర్లు) పైన ఖర్చు చేశార. 3 లక్షల మందితో శక్తివంతమైన సైన్యాన్ని సమకూర్చాం. వారికి అత్యాధునిక ఆయుధాల శిక్షణ ఇచ్చాం. ఎన్నో నాటో దేశాల సైన్యం కంటే ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పెద్దది. తాలిబన్లకు లేని వాయుసేనను కూడా సమకూర్చి, నిర్వహణ బాధ్యతను చేపట్టాం. కాని తాలిబన్లపై పోరాడేందుకు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం ఇష్టపడలేదు. యుద్ధం చేడానికి ప్రయత్నించకుండానే కుప్పకూలిపోయింది. వారికి అన్నీ సమకూర్చాంగాని, భవిష్యత్తు కోసం పోరాటం చేయాలన్న సంకల్పాన్ని నింపలేకపోయాం' అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడాన్ని బట్టి అక్కడి ప్రభుత్యం రెండు దశాబ్దాలుగా ప్రజా మద్దతు పొందలేకపోయిందని, ప్రజలలో అమెరికా వ్యతిరేకత ఉన్నదని స్పష్టమైంది.
ఆఫ్ఘనిస్తాన్ ప్రాధాన్యత
ప్రాచీన చరిత్ర, అపురూప కళా, సంస్కృతులకు నెలవైన ఆఫ్ఘనిస్తాన్ గత శతాబ్ద కాలంగా సంక్షోభాలను ఎదుర్కొంటూనే ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ విస్తీర్ణం 6.52 లక్షల చదరపు కిలోమీటర్లు, జనాభా 3.7 కోట్లు ఉన్నది. జనాభాలో 74 శాతం గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తూ ఉండగా, అక్షరాస్యత 43 శాతం ఉన్నది. తలసరి ఆదాయం, మానవాభివృద్ధి అతి తక్కువగా ఉన్నది. 1990-2001 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలలో సుమారు 4 లక్షల మంది మరణించగా, 2001 తరువాత 1,50,000 మంది మరణించారు.
ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచ రాజకీయాలలో వ్యూహాత్మకంగా ఎంతో కీలక స్ధానంలో ఉన్నది. దక్షిణాసియా, మధ్య ఆసియా, పశ్చిమాసియా మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది. అమెరికా విదేశాంగ విధానం పరిశీలిస్తే వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాలలో లేక చమురు/ఖనిజ నిక్షేపాలు వున్న ప్రాంతాలలో జోక్యం చేసుకోవటం దాని ఆధిపత్య, సామ్రాజ్యవాద ధోరణిని తెలుపుతుంది. ఇరాక్, లిబియా, సిరియా, ఈజిఫ్టు మొదలగు దేశాలలో అమెరికా జోక్యం తన సామ్రాజ్యవాద ప్రయోజనాలను కాపాడుకోవటానికే. మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్ దేశాలలో లక్షల కోట్ల విలువ చేసే సహజ వాయు, చమురు నిక్షేపాలు ఉన్నాయి. వాటికి రహదారిగా ఆఫ్ఘనిస్తాన్ ఉపయోగ పడుతుంది.ó ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా బంగారం, రాగి గనులు విస్తారంగా ఉన్నాయి. వీటితో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయటానికి అవసరమైన 'లిథియం' అనే ఖనిజం ఆఫ్ఘనిస్తాన్‌లో విస్తృతంగా ఉన్నది. 2030-2040 నాటికి ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగి లిథియంకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఖనిజ సంపద దానికి శాపంగా మారిందని పారిపోయిన అధ్యక్షుడు అస్రఫ్ ఘని ఒక సందర్భంలో వ్యాఖ్యానించాడు.
ఆప్ఘనిస్తాన్ పరిణామాలు
ఆప్ఘనిస్తాన్ ప్రాంతంలో మానవ నివాసం ప్రాచీన శిలాయుగం నాటి నుండి ఉన్నది. సింధు నాగరికత ఈ ప్రాంతంలో కూడా వ్యాప్తి చెంది ఉన్నది. ఆధునిక కాలంలో తొలి ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధానంతరం కొంత కాలం బ్రిటిష్ ఆధీనంలో ఉన్నది. 1973లో జహీర్‌షా పై తిరుగుబాటు అనంతరం రిపబ్లిక్‌గా మారింది. 1978లో సోవియట్ రష్యా అండతో 'డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' ఏర్పడింది. ఆ ప్రభుత్వం అందరికి విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం వంటి లక్ష్యాలతో పని చేసింది. సోవియట్ అండతో ఏర్పడిన ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా మతోన్మాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. 'ముజాహిద్దీన్‌లు'' పేరుతో వారిని చేరదీసింది. పాకిస్తాన్ భూభాగం నుండి ముజాహిద్దీన్‌లు కార్యకలాపాలు నిర్వహించేవారు. పాకిస్తాన్ భూభాగంలోనే వారికి శిక్షణ ఇచ్చారు. 1989లో ఆఫ్ఘనిస్తాన్ ముజాహిద్దీన్‌ల వశమైంది. అప్పటి వరకు అధికారంలో ఉన్న నజీబుల్లా ప్రభుత్వం కుప్పకూలింది. 1994లో ముల్లా ఒమర్ నాయకత్వంలో ఆవిర్భవించిన తాలిబన్లు 1996 నాటికి ఆఫ్ఘనిస్తాన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అయితే 2001లో అమెరికాలో 'ట్విన్ టవర్స్' పై ఉగ్రవాదుల దాడుల తరువాత, అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేసింది. అల్ ఖైదా నాయకుడు బిన్‌లాడెన్‌కు తాలిబన్లు మద్దతు ప్రకటించడం అమెరికాకు ఆగ్రహాన్ని తెప్పించింది. అమెరికాతో పాటు నాటో సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లో తిష్టవేశాయి. 2003లో ఆఫ్ఘనిస్తాన్‌తో నూతన రాజ్యాంగాన్ని ప్రకటించి, ఎన్నికలు జరపగా హమీద్ కర్జారు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2014లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎన్నికైన అస్రఫ్ ఘని..గతవారం తాలిబన్ల తిరుగుబాటు తరువాత విదేశాలకు వెళ్లిపోయాడు.
తాలిబన్లు-అమెరికా సృష్టి
ముల్లా ఒమర్ 1994లో కాందహార్‌లో తాలిబన్ సంస్థను స్థాపించాడు. తాలిబన్ అంటే విద్యార్థి అని అర్థం. ఉత్తర పాకిస్తాన్‌లో నిర్వహించిన క్యాంప్‌లలో వీరికి శిక్షణ ఇచ్చేవారు. అమెరికా మద్దతుతో పాకిస్తాన్ అండదండలతో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లోని ముజాహిద్దీన్‌లను ఓడించి 1998 నాటికి చాలా వరకు దేశాన్ని తమ ఏలుబడి లోకి తెచ్చుకున్నారు. చిరకాలం పాటు యుద్ధ సంక్షోభం వల్ల నానా అగచాట్లు పడిన ఆఫ్ఘన్ ప్రజలకు అది గొప్ప ఊరట అనిపించి తాలిబన్లను సమర్థించారు.
తాలిబన్లు అధికారం లోకి వచ్చిన తరువాత ఇస్లామిక్ పాలన పేరిట కఠిన షరియా చట్టాన్ని అమలు చేశారు. బాలికలు పాఠశాలలకు వెళ్లటాన్ని నిషేధించారు. మహిళలు స్వేచ్ఛ కోల్పోయారు. సాంస్కృతికంగా అనేక ఆంక్షలు విధించారు. సంగీతం, టీవి, సినిమాలను నిషేధించారు. 2001లో బామియన్ బుద్ధ విగ్రహాలను ఫిరంగులతో పేల్చివేశారు. తాలిబన్లు పాకిస్థాన్ లోను అస్థిరత సృష్టించారు. బిన్ లాడెన్ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో అనుబంధం కలిగి ఉండేవారు. 2001లో అధికారం కోల్పోయినప్పటికి, ఆఫ్ఘనిస్తాన్ గ్రామీణ ప్రాంతాలలో తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ, ఇప్పుడు 2021లో అధికారాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తమ దేశంలో 2030 నాటికి 50 శాతం వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని విధాన ప్రకటన చేశాడు. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన 'లిథియం' ఖనిజం ఆఫ్ఘనిస్తాన్‌లో పుష్కలంగా ఉన్నది. జోబైడన్ రహస్యంగా తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకొని, అమెరికా సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉపసంహరించుకున్నాడని కొంతమంది అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికాకు తాలిబన్లకు ఉన్న సంబంధాల దృష్ట్యా అది నిజం కావచ్చు.
ఆప్ఘ్ఘనిస్తాన్ పరిణామాలు - ఇండియా
ఆప్ఘనిస్తాన్‌తో భారత దేశానికి ప్రాచీన కాలం నుండి సంబంధ, బాంధవ్యాలు, సాంస్కృతిక అనుబంధం ఉన్నది. ఆప్ఘనిస్తాన్‌లో సోవియట్ అండతో ఏర్పడిన ప్రభుత్వాన్ని గుర్తించిన తొలి దక్షిణాసియా దేశం ఇండియా. తాలిబన్ల పాలనా కాలంలో కాందహార్ విమాన హైజాక్ సంఘటన వలన రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. 2001 తరువాత ఏర్పడిన ప్రభుత్వాలకు భారత్ అండగా నిలిచింది. ఆప్ఘనిస్తాన్ పునర్‌నిర్మాణానికి 3 వందల కోట్ల డాలర్లు వెచ్చించింది. 2011లో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కింద ఆప్ఘనిస్తాన్‌లో మౌలిక వసతులు, విద్యా, సాంకేతిక సాయం, పెట్టుబడులు పోత్సహించడం మొదలగునవన్నీ చేపట్టింది. భారత విదేశాంగ విధానం అమెరికాకు అనుకూలంగా మారటంతో, భారతదేశం కూడా వ్యూహాత్మక భాగస్వామిగా మారింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం వంద కోట్ల డాలర్లకు చేరింది. ఆప్ఘనిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం గుడ్డిగా అమెరికాను అనుసరించటంతో, ప్రస్తుత పరిణామాలలో ఈ ప్రాంతంలో భారతదేశం ఏకాకిగా మారింది. శాంతియుత, సుస్థిర వాతావరణంలో ఆప్ఘనిస్తాన్ ప్రజలు జీవించేలా చూడటానికి ప్రధాన ప్రాంతీయ శక్తులతో భారతదేశం కృషి చేయాలి. ఆప్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించటానికి భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరగాలి ?
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు విజయం సాధించారు. చైనా, రష్యా, ఇరాన్, పాకిస్తాన్ మొదలైన దేశాలన్ని తాలిబన్ల నాయకత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి గుర్తింపు ప్రకటించాయి. తాలిబన్ల పాలనలో సిరాజుద్దీన్ హక్కనీ, హైబతుల్లా అఖుంజాదీ, ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్, ముల్లా యాకూబ్ ప్రముఖ పాత్ర వహించబోతున్నారు. తొలి పత్రికా సమావేశంలో మహిళలతో సహా అందరి హక్కులు గౌరవిస్తామని ప్రకటించారు. కొత్త ప్రభుత్వం మహిళల హక్కులు గౌరవించడం, మైనారిటీ జాతుల, గిరిజన తెగల హక్కులు గౌరవించడం, ప్రాంతీయ దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడం, ఖనిజ సంపదను దేశాభివృద్ధికి ఉపయోగించడం, అల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలను దూరంగా పెట్టడం వంటి చర్యలు చేపట్టడంతో పాటు నాలుగు దశాబ్దాలుగా యుద్ధాలతో నలిగిపోతున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు సుస్థిర శాంతి, అభివృద్ధి కోసం చర్యలు చేపడితే బాగుంటుంది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
/ వ్యాసకర్త శాసన మండలి సభ్యులు,
సెల్ : 94402 62072 /
కె.ఎస్.లక్ష్మణరావు











