Mar 12,2023 01:20
మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయికి ఎదుగుతాడనుకున్న కొడుకు తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. విదేశాలకు వెళ్లిన 7 నెలలకే అనుమానాస్పద స్థితిలో అర్ధాంతంగా తనువు చాలించిన ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామంలో శనివారం వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జొన్నతాళి గ్రామానికి చెందిన గోవాడ రమేష్‌ దంపతులు గత ఐదు సంవత్సరాల క్రితం గుంటూరు పట్టణానికి వెళ్లి అక్కడ బార్బర్‌ షాప్‌ నిర్వహించుకుంటున్నారు. వీరి కుమారుడైన నాగసాయి గోపి అరుణ్‌ కుమార్‌(22) ఇంజనీరింగ్‌ పూర్తిచేసి 2022 ఆగస్టు నెలలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ లామ్‌ నార్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ కోర్స్‌లో అడ్మిషన్‌ తీసుకొని టెక్స్‌ ఫోర్టాన్‌ ఏరియాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు స్నేహితులు మరో మహిళా విద్యార్థితో కలిసి ఒకే అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీ నుంచి గోవాడ నాగసాయి గోపి స్నేహితులకు కనిపించకపోవడంతో వీరితో పాటు నివాసం ఉంటున్న స్నేహితురాలు అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అమెరికా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వీరు నివాసం ఉంటున్న అపార్టుమెంట్‌ సమీపంలోని నీటి సరస్సులో నాగసాయిగోపి మృత దేహాన్ని మార్చి 3వ తేదీన అమెరికా పోలీసులు గుర్తించి అమెరికా లోని స్నేహితులకు, ఇండియాలోని వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. గోపి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైన స్నేహితులు అమెరికా నిబంధనలు పూర్తి చేయించి మృతదేహాన్ని తమ సొంత ఖర్చులతో విమానంలో ఇండియా పంపించారు. శనివారం నాగసాయి గోపి మృతదేహం స్వగ్రామం జొన్నతాళి గ్రామానికి చేరుకుంది. అమెరికా నుంచి పోస్టుమార్టం నివేదిక అందితే గాని నాగసాయి గోపి మృతికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుందని బంధువులు తెలిపారు. ఉన్నత చదువులు చదివి కుటుంబాన్ని ఆదుకుంటాడని అమెరికా పంపిస్తే ఏడు నెలలకే శవమై తిరిగి వస్తాడని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఈ ఉదంతంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.