Sep 05,2023 18:04

ప్రజాశక్తి - నూజివీడు రూరల్‌
    ట్రిపుల్‌ ఐటీలో పియుసి-1 చదువుతున్న నలుగురు విద్యార్థులు అమెరికా పర్యటనకు ఎంపికైనట్లు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ఆచార్య జివిఆర్‌.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అమెరికా పర్యటన నిమిత్తం ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో అన్ని జిల్లాల్లో 1, 2 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అర్హత పరీక్ష నిర్వహించిందన్నారు. దీనికి 105 మంది విద్యార్థులు హాజరు కాగా తుది దశలో పదిమందిని ఎంపిక చేసి అమెరికా పర్యటనకు పంపిస్తున్నట్లు తెలిపారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన ఎ.రిషితా రెడ్డి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జి.గణేష్‌, అంజనా సాయి, ఏలూరు జిల్లాకు చెందిన పి.గాయత్రి, తిరుపతికు చెందిన వి.యోగేశ్వర్‌ ఆర్‌జియుకెటి నూజివీడు క్యాంపస్‌లో చదువుతున్నారని తెలిపారు. వీరంతా ఈనెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ యునైటెడ్‌ నేషన్స్‌ ప్రధాన కార్యాలయం, కొలంబియా విశ్వవిద్యాలయం, ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం తదితర ప్రాంతాలలో మాట్లాడతారని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఎఒ పి.ప్రదీప్‌, ఇతర ఆచార్యులు, సిబ్బంది, సహచర విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.