
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా): పశ్చిమాసియాపై తన ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా మరోసారి కుట్రలు చేస్తోందని ఐసిఇయు సంయుక్త కార్యదర్శి వి.వి.కె.సురేష్ పేర్కోన్నారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ ఆధ్వర్యంలో 'పాలస్తీనా సమస్య పరిష్కారాలు' అనే అంశంపై మంగళవారం సెమినార్ నిర్వహించారు. ఈ సదస్సుకు ఐసిఇయు అధ్యక్షులు జె. సుధాకర్ అధ్యక్షత వహించగా సురేష్ మాట్లాడుతూ పశ్చిమాసియాపై తన ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా మరోసారి కుట్రలు చేస్తోందని, పైగా గాజాతో సహా మొత్తం పాలస్తీనాను కైవసం చేసుకునేలా ఇజ్రాయిల్‌ను పురిగొల్పుతోందని అన్నారు. ఇజ్రాయిల్ మిలటరీ బలగాలు గాజా ప్రాంతంలో విధ్వంసం సష్టిస్తున్నాయని. గత 20 రోజుల్లో మహిళలు, చిన్న పిల్లలు, జర్నలిస్టులతో సహా సుమారు 9 వేల మంది పాలస్తీనా పౌరులు మరణించారని, వేల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారన్నారు. పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయిల్ చేస్తున్న దుర్మార్గమైన, అమానుషమైన దాడులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని ప్రకటించారు. పాలస్తీనా ప్రజల హక్కులను గౌరవించాలని, గాజా ప్రాంతంలో తక్షణమే శాంతి నెలకొనేలా చర్యలు చేపట్టాలని, ఇజ్రాయిల్ తాను ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి పాలస్తీనాకు ఇచ్చేసేలా అంతర్జాతీయ సమాజం తన కృషిని పెంచాలని ఆయన అన్నారు. గాజాలోని సామాన్య ప్రజలకు ఆహారం, మంచినీరు. వైద్యం వంటి ముఖ్యమైన సదుపాయాలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసిఇయు డివిజన్ ప్రధాన కార్యదర్శి జి.కిషోర్ కుమార్, టి.చంద్రపాల్, ఎల్.రాజశేఖర్, వై.స్వామినాథ్, వి.ఆర్.ఎన్.ఠాగూర్, ఎస్.వి.రత్నారావు, బిహెచ్.మాధుర్, పి.నాగయ్య పాల్గొన్నారు.