అమెరికాను ఇప్పుడు సోషలిస్టు చైనా భూతం ఆవహించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల పాల్గొన్న ప్రతి సమావేశంలోను, ప్రతి విధానపరమైన ప్రకటనలోను 'చైనా ముప్పు' థియరీ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. గత వారం బ్రసెల్స్‌లో జరిగిన నాటో కూటమి సమావేశంలోను, అంతకుముందు కార్న్‌వాల్‌లో జరిగిన జి-7 శిఖరాగ్ర సమావేశంలోను, ఇయు కౌన్సిల్ సమావేశంలోను, బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో జరిపిన సమావేశంలోను, ఆ తరువాత విడుదలజేసిన ప్రకటనల్లోను చైనాను దురాక్రమణదారుగా, ప్రపంచ శాంతికి ప్రమాదకారిగా చిత్రించే యత్నం చేశారు. నిజానికి ప్రపంచ నంబర్ వన్ దురాక్రమణదారు అమెరికానే. ప్రపంచ శాంతికి అమెరికన్ సామ్రాజ్యవాదమే పెద్ద ముప్పుగా తయారైంది. ప్రపంచంలో 70కి పైగా దేశాల్లో 800కి పైగా సైనిక స్థావరాలతో అతిపెద్ద గ్లోబల్ మిలిటరీ నెట్‌వర్కు ఏర్పాటు చేసుకున్నదెవరు? అమెరికా కాదా? వీటిలో సగం దాకా అంటే 400 మిలిటరీ స్థావరాలు చైనా సరిహద్దు చుట్టూ పెట్టింది. చైనా తన సరిహద్దు వెలుపల ఎక్కడైనా ఒక్క మిలిటరీ స్థావరాన్నైనా నెలకొల్పిందా? లేదే. అమెరికా యుద్ధ తంత్రాల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 74,000 కోట్ల డాలర్లు కేటాయించగా, చైనా తన రక్షణ రంగానికి 20,800 కోట్ల డాలర్లు మాత్రమే కేటాయించింది. అంటే అమెరికా కేటాయించినదాంట్లో నాలుగో వంతన్నమాట. అమెరికా మాదిరి ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో చైనా ఎన్నడూ జోక్యం చేసుకోవడం కానీ, విమర్శించడం కానీ చేయలేదే. ఏ సమస్యనైనా అంతర్జాతీయ చర్చలు, సంప్రదింపులద్వారా ఐరాస మార్గదర్శకత్వంలో పరిష్కరించుకోవాలని చెప్తోంది. చెప్పడమే కాదు అందుకు తన పూర్తి సహాయ సహకారాలందిస్తున్నది.
చైనాకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన మరో ప్రచారం మార్కెటింగ్‌యేతర విధానాలు, పద్ధతులను అనుసరిస్తోందనేది. ప్రస్తుతం ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్న చైనా మరో ఏడేళ్లలో నంబర్ వన్ ఎకానమీగా అవతరించనున్నది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులైన స్థితిలో సైతం చైనా నిలదొక్కుకుని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొండంత ఆసరాగా నిలిచింది. ఆర్థిక రంగంలో చైనా అద్భుతాలు సాధించడానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సోషలిస్టు వ్యవస్థ పునాదులు బలంగా ఉండడమే కారణం. దీనిని అంగీకరిస్తే పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులే కదిలిపోతాయి. దోపిడీ, దురాక్రమణలపై నిర్మించబడ్డ సౌధాలు కూలిపోతాయి. అందుకే చైనా ఆర్థిక పరోగతి అనైతిక పద్ధతుల ద్వారా సాధించినదన్న ప్రచారాన్ని అవి లంకించుకున్నాయి. చైనాలో దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని తప్పుపట్టిన అమెరికా, ఇయు దేశాలు తాము మాత్రం బోయింగ్, ఎయిర్‌బస్ వంటి బడా కార్పొరేట్ కంపెనీలకు భారీగా రాయితీలు ఇవ్వొచ్చు. పెట్టుబడిదారీ దేశాల దివాళాకోరుతనానికి ఇదొక నిదర్శనం. మూడు దశాబ్దాలకు పైగా తాము అమలు చేసిన నయా ఉదారవాద విధానాలే ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి దారితీశాయి. ఈ సంక్షోభం నుండి బయటపడే మార్గం కానరాక దిక్కుతోచని స్థితిలో సామ్రాజ్యవాదం ఉంది. సామ్రాజ్యవాద ప్రభుత్వాలు నెత్తికెత్తుకున్న అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి బలం ఆ ప్రభుత్వాలనే శాసించే స్థాయికి పెరిగి పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. అమెరికా ఎత్తుకున్న చైనా వ్యతిరేక పల్లవి వెనక దాగి ఉన్న మూలం ఇదే.
'షింజియాంగ్'లో ఉయిఘర్స్‌ను ఊచకోత కోశారని, వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని పశ్చిమ దేశాలు పెద్దయెత్తున గోల చేస్తున్నాయి. ఇస్లామా ఫోబియా, ఇతర దేశాల్లో కార్మికుల హక్కులను కాలరాయడంలో ముందుండే ఈ దేశాలు ఉయిఘర్స్ గురించి బైడెన్, జాన్సన్‌లు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయి. దీనిపై అమెరికా, ఇయులు దీనిపై రాద్ధాంతం చేయడానికి ఉయిఘర్స్ పట్ల ప్రేమతో కాదు. షింజియాంగ్‌లో వంద కోట్ల టన్నుల మేర చమురు నిక్షేపాలు ఉన్నట్టు ఇటీవల బయటపడింది. దీనికితోడు పశ్చిమాసియా, యూరప్ దేశాలతో వాణిజ్యానికి ఇది చైనాకు ముఖద్వారంగా ఉన్నది. భౌగోళికంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతంలో చిచ్చు రేపేందుకే అక్కడ పరిస్థితిని వక్రీకరించి, ఈ విధమైన ప్రచారానికి దిగుతున్నాయి. పశ్చిమ దేశాల కుతంత్రాలను ఎలా తిప్పికొట్టాలో చైనాకు తెలుసు.










