
ప్రజాశక్తి-పామూరు: పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ అన్నారు. ఇజ్రాయిల్ పాలస్తీనాపై కొనసాగిస్తున్న యుద్ధాన్ని ఆపాలని, శాంతిని నెలకొల్పాలని, ఆ దేశ పౌరులను కాపాడాలని ఆయన కోరారు. ఆదివారం పామూరు సుందరయ్య భవన్ సెంటర్‌లో సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐక్య రాజ్య సమితి యుద్ధాన్ని ఆపాలని చెప్పినప్పటికీ అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగిస్తోందని అన్నారు. తీవ్రవాదులను చొరబాటుదారులను కాకుండా జనసంచారం ఉండే ప్రదేశాలలో దాడులు చేసి అమాయక ప్రజలను చంపుతున్నారని, యావత్ ప్రపంచం ఖండిస్తున్నా యుద్ధం ఆపకుండా అమాయక ప్రజలను బలి తీసుకుంటున్నారని, యావత్ ప్రజానీకం ఖండించాలని పిలుపునిచ్చారు. మోడీ ఈ చర్యలను తీవ్రంగా ఖండించకుండా కంటి తుడుపు చర్యలుగా మాట్లాడుతున్నారని అన్నారు. గత ఐదు నెలల నుంచి మణిపూర్లో మతాల మధ్య మారణహోమం జరుగుతున్నా మోడీకి కనిపించడం లేదని, వెంటనే మణిపూర్‌లో మారణహోమాన్ని ఆపి ప్రజలను రక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కొమ్మలపాటి మాల్యాద్రి, సయ్యద్ గౌస్‌బాషా, వైవి నారాయణ, సిహెచ్ వెంకటేశ్వర్లు, రామయ్య, భానుమతి, మాతారమ్మ, షేక్ అల్లాబక్షు, మహాదేవయ్య, అంజలి తదితరులు పాల్గొన్నారు.