Mar 06,2021 07:01

మీరు ఏం చేస్తుంటారని ఆమెను అడిగితే 'నేను ఏమీ చేయను. ఇంట్లోనే ఉంటాను' అంటుంది. భర్తను అడిగినా ఆమె ఉద్యోగం చేయదంటాడు. 'ఆమె గృహిణి' (హౌస్‌ వైఫ్‌) అన్న ఇంకోరకమైన సమాధానం కూడా వస్తుంటుంది. గృహిణి అనగానే అర్ధం మారుతుంది. ఇంటికి పరిమితమైపోయి ఇంట్లో ఉండే చాకిరి అంతా చేయటమే గృహిణి పని. కానీ ఆమె పనికి విలువ లేదు. ఎందుకంటే ఆమెది జీతం లేని చాకిరీ.
నిజంగా ఆమె ఏమీ చేయదా? ఆమె...ఇల్లు శుభ్రం చేయాలి. బట్టలు ఉతకాలి. అంట్లు తోమాలి. పిల్లల్ని సాకాలి. వంట చేయాలి. పిల్లలకు స్నానపానాదులు చేయించాలి. స్కూలుకు పంపాలి. ఇంట్లో ఉన్న వయోవృద్ధులను చూసుకోవాలి. భర్తను ఆఫీసుకు పంపాలి. ఇదంతా చేయటానికి రోజుకి ఎంత సమయం పడుతుంది? మన దేశంలో ఒక సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఆరున్నర గంటలు పడుతుంది. పట్టణాలలో 6 గంటల కంటే కొద్దిగా ఎక్కువగా. వాస్తవంలో మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఇళ్లల్లోనైతే తెల్లవారకమందే మొదలయ్యే చాకిరీ పొద్దుపోయే దాకా కొనసాగుతూనే వుంటుంది.
ఇంటి చాకిరీతోపాటు పొలం పనులు చేసే వ్యవసాయ కూలీ మహిళలు, నేత, కల్లుగీత, మత్స్యకార తదితర సాంప్రదాయ చేతివృత్తుల కుటుంబాల మహిళలు, బీడీ కార్మికులు వంటి హోమ్‌ బేస్డ్‌ పనులు చేసే మహిళలు కోట్లలో వున్నారు. వీరు నడుములు విరిగిపోయే చాకిరీ చేస్తున్నారు. ఇక శ్రామిక మహిళలు, ఉద్యోగులు, డాక్టర్లుగా, లాయర్లుగా పని చేసే మహిళల పరిస్థితీ అంతే.
గృహిణి శ్రమ నైపుణ్యంతో కూడినది. అనుభవంలో నైపుణ్యం సంపాదిస్తుంది. వంట బాగా చేస్తుంది. పిల్లల్ని సాకటంలో తదితర పనుల్లో నైపుణ్యం సాధిస్తుంది. చెల్లించిన శ్రమలో ఉన్నా వారి ఉద్యోగాలలో ఎక్కువ భాగం వేడినీళ్ళకు చన్నీళ్ళు తోడయ్యేలాంటివే. 'ఆక్స్‌్‌ఫామ్‌' సంస్థ అంచనా ప్రకారం చెల్లించని ఈ జీతం లేని ఇంటి శ్రమకు విలువ కడితే అది సంవత్సరానికి ప్రపంచం మొత్తం మీద 10.8 లక్షల డాలర్లు అవుతుంది. రూపాయలలో (డాలరుకు 70 రూపాయలు అనుకుంటే) అది 756 లక్షల కోట్లు అవుతుంది. ఇది లెక్కిస్తే ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 9 శాతం ఉంటుంది.
ఇటీవల కాలంలో మహిళల జీతం లేని ఇంటి శ్రమ మీద చర్చ పెరుగుతోంది. అంతర్జాతీయ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఇది నడుస్తోంది. ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించిన నటుడు కమల్‌ హాసన్‌..గృహిణి పనిని గుర్తిస్తామని, ఆమె పనికి కొంత విలువ కట్టి చెల్లిస్తామని, వీరి పనిని గౌరవిస్తామని...తన మ్యానిఫెస్టోలో వాగ్దానం చేశారు. బహుశా కమల్‌ హాసన్‌ వాగ్దానం చేసింది గౌరవ వేతనం లాంటిదై ఉండాలి. కార్మిక వర్గ దృక్పథంతో చూసినపుడు మహిళల జీతం లేని ఇంటి శ్రమకు విలువ కట్టాలి. దానికి కూడా వేతనం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి?
గృహిణి శ్రమకూ చెల్లించాలి
కార్మికుల కనీస వేతన నిర్ణయానికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. 1957లో భారత కార్మిక మహాసభ చేసిన సిఫార్సులకు 1992లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తోడు చేసి కనీస వేతనాన్ని నిర్ణయించాలి. భార్యభర్త ఇద్దరు పిల్లలను కలిపి కుటుంబాన్ని మూడు యూనిట్లుగా పరిగణించి ఒక్కో యూనిట్‌కు రోజుకి 2700 క్యాలరీలను అందించే ఆహారానికి అయ్యే ఖర్చు... కుటుంబం మొత్తానికి 66 మీటర్ల బట్ట, ఆహారానికి, బట్టలకు అయ్యే ఖర్చులో 10 శాతం అద్దెకు... ఈ మూడింటికి అయ్యే ఖర్చు మొత్తంలో 20 శాతం ఇంధనం, విద్యుత్‌ తదితరాలకు... ఈ నాలుగు ఖర్చుల మొత్తం మీద వచ్చే దాంట్లో 25 శాతాన్ని విద్య, వైద్యం, వినోదం తదితర అవసరాలకు లెక్కించి కనీస వేతనాన్ని నిర్ణయించాలి. కనీస వేతనాల కోడ్‌లో కూడా ఈ ప్రామాణికాలు భాగమయ్యాయి.
పై ప్రామాణికాలలో ఎక్కడా కూడా గృహిణి శ్రమకు విలువ కట్టలేదు. బియ్యం, పప్పులు, నూనెలు, మాంసం, గుడ్లు తెచ్చి అక్కడ పెడితే నేరుగా వీటిని తినలేరు. వీటిని కష్టపడి వండాలి. బట్టలు కొనుక్కొని కుట్టించుకుని తొడుక్కోవడం మొదలు పెట్టిన తరువాత వాటిని ఉతకాలి. మడతలు పెట్టాలి. ఇల్లు రోజువారీ శుభ్రం చేయాలి. పిల్లలను బడికి పంపాలి. ఎవరికి సుస్తీ చేసినా వారిని చూసుకునే పని భారం గృహిణి మీదనే పడుతుంది. ఇంటి దగ్గర ఈ శ్రమ అంతా గృహిణి చేస్తేనే కార్మికుడు ఫ్యాక్టరీకి పోయి 8 గంటల పని చేయగలడు. యజమానికి లాభం తెచ్చిపెట్టగలడు. అందుచేత ఈ గృహిణి ఇంటి శ్రమకు కూడా విలువ కట్టి దానిని యజమాని చెల్లించడం న్యాయం. అయితే, ఆ విధంగా చెల్లించడానికి ఏ పెట్టుబడిదారుడూ అంగీకరించడు. అందుకే ఇంటి పనిని పనిగా గుర్తించడానికే పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేకం. ఫ్యూడల్‌ సమాజం ఒక విధంగా స్త్రీని అణచివేస్తే పెట్టుబడిదారీ సమాజం మరో విధంగా అణచివేస్తుంది. తన లాభాలను గరిష్టంగా పెంచుకోవాలనే లక్ష్యంతో గృహిణి ఇంటి శ్రమను శ్రమగా గుర్తించడానికి నిరాకరిస్తుంది. ఇంటి శ్రమకు వేతనం చెల్లించాలన్న డిమాండు ముందుకు రాగానే ఇదేదో ఇంట్లో భార్య భర్త నుంచి డిమాండ్‌ చేసే విషయంగా సమస్యను తప్పుడు దోవలోకి మళ్లించడం పెట్టుబడిదారులను కాపాడేందుకు చేసే ప్రయత్నమే.
'సార్వత్రిక కనీస వేతనం' అన్న పేర ఇటీవల మరో చర్చ నడుస్తోంది. నిరుపేదల కుటుంబాలకు కనీస ఆదాయాన్ని గ్యారంటీ చేయాలన్న డిమాండ్‌ను పెట్టుబడిదారీ వర్గ మేధావులు, రాహుల్‌ గాంధీ, చంద్రబాబు వంటి రాజకీయ నాయకులు ముందుకు తెస్తున్నారు. నిరుపేదలకు కుటుంబ కనీసం ఆదాయాన్ని గ్యారంటీ చేస్తున్నాం గనుక ఇక అన్ని రకాల సబ్సిడీలను, సంక్షేమ పథకాలను ఎత్తివేయవచ్చుననే నయా ఉదారవాద సిద్ధాంతం ఇది. ఇది కూడా గృహిణి ఇంటి శ్రమను అస్సలు పరిగణనలోకి తీసుకోదు. మహిళలు ఇంట్లో చేసే శ్రమకు కూడా విలువ కట్టి కార్మికుని కనీస వేతనంలో అదనంగా కలపాలి. అప్పుడే చెల్లించని శ్రమ చెల్లించిన శ్రమగా మారుతుంది. 'హౌస్‌ వైఫ్‌' అనబడే ఆమెకు ఇంటా, బయటా గౌరవం దక్కుతుంది.
ఇక పురుషుడితో బాటు స్త్రీ కూడా ఉద్యోగం చేస్తూ స్వతంత్రంగా జీవించాలని కోరుకుంటుంది. చాలా కొద్ది మంది మాత్రమే ఇందుకు భిన్నంగా ఆలోచిస్తారు. అయితే ప్రపంచంలో చాలా దేశాలతో పోల్చితే మన దేశంలో పురుషాధిక్య భావజాలం బలంగా ఉంది. దీనికి తోడు బిజెపి అధికారంలోకి వచ్చాక మహిళలు వంటింటికే పరిమితం కావాలన్న వాదనలు మరింత బలం పుంజుకున్నాయి. లింగ అసమానతల్లో మన దేశం తక్కిన ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు 108వ స్థానంలో ఉంది. ఇది 2018 నాటి పరిస్థితి. ఒక్క ఏడాదిలోనే ఇది 112వ స్థానానికి దిగజారింది. ఇదీ మోడీ గారి ఘనత.
భారత దేశంలో బయటకు వెళ్లి పని చేసే, పని చేయడానికి సిద్ధంగా వున్న మహిళలు ... సరళీకరణ విధానాలు మొదలు కాకముందు 1990లో 30.3 శాతంగా వున్నారు. అయితే 2020 నాటికి వారు 20.3 శాతానికి తగ్గారని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. మన దేశం కంటే యెమెన్‌, ఇరాక్‌, జోర్డాన్‌, సిరియా, అల్జీరియా, ఇరాన్‌లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి. దక్షిణ ఆసియాలో ఇండియా అతి తక్కువ స్థాయిలో ఉంది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక మొదలైన దేశాలు మనకంటే మెరుగ్గా ఉన్నాయి. 2003-04 నుండి 2011-12 మధ్య భారత దేశ ఆర్థికాభివృద్ధి బాగా జరిగి.... సరాసరి 8.4 శాతం ఉన్న పరిస్థితిలో కూడా.... 2011-12లో ఆర్థిక వ్యవస్థలో పనిచేసే మహిళలు, పని చేయటానికి సిద్ధంగా ఉన్న మహిళల సంఖ్య పడిపోయి 23 శాతానికి చేరింది. ఎంప్లాయీస్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ లెక్కల ప్రకారం కొత్తగా ఉద్యోగాలలో చేరిన వారిలో మహిళలు 2020 జూన్‌లో 21.11 శాతం నుండి జులైలో 20.49 శాతానికి, ఆగస్టులో 19.98 శాతానికి తగ్గారు. అంటే నయా ఉదారవాద విధానాల పర్యవసానంగా నిరుద్యోగం తీవ్రమౌతున్నకొద్దీ దాని దుష్ప్రభావం మహిళల పైన మరింత ఎక్కువగా పడుతున్నదని స్పష్టం అవుతోంది.
ఉద్యోగం ప్రాథమిక హక్కుగా గుర్తింపబడే సోషలిస్టు సమాజం రావాలి. సోషలిస్టు వ్యవస్థ మహిళలకు పురుషులతో సమానంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే గాక ఇంటి శ్రమ నుండి కూడా విముక్తి కల్పిస్తుంది. కమ్యూనిటీ కిచెన్‌లు, క్రెచ్‌లు, కమ్యూనిటీ లాండ్రీలు, కమ్యూనిటీ హౌస్‌ సర్వీసింగ్‌ యూనిట్లు ఏర్పరచి వంటింటి చాకిరీ నుండి విముక్తి కల్పిస్తుంది. ఈ దిశగా సమాజం మార్పు కోసం కృషి జరగాలి. ఈ కృషిలో భాగంగానే గృహిణి ఇంటిశ్రమకు విలువ కట్టి చెల్లించాలన్న డిమాండ్‌పై కూడా ఉద్యమం నడవాలి. ఇది ఇంట్లో ఆడవాళ్లు మగవాళ్లపై చేసే పోరాటం కాదు. స్త్రీ, పురుషులందరూ కలిసి పెట్టుబడిదారీ వ్యవస్థపై, దానికి కొమ్ము కాసే ప్రభుత్వాలపై చేయవలసిన పోరాటం.
                             సి.అజయ్ కుమార్    పి. అజయ్ కుమార్ / వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు /