Mar 07,2021 17:53

అంతరిక్షాన్ని దాటొచ్చింది
అర్ధరాత్రి ఇల్లు చేరలేకపోతుంది
సైనికురాలై సరిహద్దుల్ని కాస్తుంది
హద్దులు దాటే ప్రబుద్ధులకు
బుద్ధి చెప్పలేక పోతుంది
నాయకురాలై నలుగుర్ని పాలిస్తుంది
అదును చిక్కితే మీదపడే
కామాంధుల్ని ప్రతిఘటించ లేకపోతుంది
ఆఫీసుల్లో అధికారిణియై అధికారం
చెలాయిస్తుంది
నిత్యజీవితంలో లైంగిక వేధింపులకు
చెక్‌ పెట్టలేక పోతుంది
లాఠీ పట్టి సంఘ వ్యతిరేకుల
గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది
తను మాత్రం మానప్రాణాలు
కాపాడుకోడానికి ఏదో మూల
పరుగులు తీస్తూనే వుంది..
నల్లకోటుతో న్యాయానికి పట్టిన
బూజు దులుపుతోంది..
వివక్షను దునుమాడి తనకు తాను
న్యాయం చేసుకోలేక పోతుంది
కర్షకురాలై కార్మికురాలై కఠినశ్రమ
చిందిస్తూ..అర్ధాంగియై కుటుంబానికి
మూలాధారమై నిలబడుతూ
జీవితమనే ఆకాశంలో సగం
అవకాశాల్ని అందుకొంది..
ఎన్ని చేసినా పరాయి స్త్రీని
వక్రదృష్టితో మాత్రమే చూడ్డానికి
అలవాటు పడ్డ పితృస్వామ్యవ్యవస్థ
యొక్క పురుషాహంకార భావజాలాన్ని
మార్చలేక అశక్తురాలై..ఆ పీఠానికే
తల కొట్టుకొని రోదిస్తుందామె..!!
                                 * భీమవరపు పురుషోత్తం, 9949800253