May 11,2023 20:44

cartoon

'ఆమె' సేవలు అమోఘం..
- గుర్తింపునకు దూరం.. వెట్టి చాకిరి..
- స్టాఫ్‌ నర్సుల సమస్యలు వర్ణనాతీతం
- మెడికల్‌ ఆఫీసర్ల దయాదాక్షిణ్యాలపైనే సెలవులు
- నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     'ఆమె సేవలు అమోఘం.. కానీ ఆ సేవలకు తగిన గుర్తింపు లభించడం లేదు. ఆసుపత్రిలో, పిహెచ్‌సిలో, సిహెచ్‌సిలో ఇలా ప్రతిచోటా ఆమె పాత్ర కీలకం.. ఆసుపత్రుల్లో డాక్టర్‌ లేకపోయినా వారే వైద్య సేవలు అందిస్తుంటారు. సేవల్లో అమ్మలాగా.. ఉంటూ ఆరోగ్య సేవలు అందిస్తుంటారు.. వారే నర్సులు'. నేడు నర్సు లేకపోతే వైద్య సేవలు ముందుకు సాగని పరిస్థితి ఉంది.. నేడు అంతర్జాతీయ నర్సుల దిన్సోతవం సందర్భంగా ప్రత్యేక కథనం...
ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ చేసిన అద్భుత సేవలకు గుర్తింపుగా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మే 12, 1820న జన్మించిన ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ బ్రిటీష్‌ నర్సు, సంఘ సంస్కర్త. ఆమెను ''ది లేడీ విత్‌ ది ల్యాంప్‌''గా గౌరవించారు. 1850లలో క్రిమియన్‌ యుద్ధం సమయంలో ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ నర్సుగా ఎనలేని సేవలు అందించారు. గాయపడిన బ్రిటీష్‌ సైనికులను చూసుకునే నర్సుల బృందానికి ఆమె బాధ్యత వహించే ఆసుపత్రిలో పని చేశారు. 1860లో లండన్‌లోని నైటింగేల్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌కు పునాది వేశారు. రోగులే తమ పిల్లలుగా భావిస్తూ నర్సులు అహోరాత్రులు శ్రమిస్తారు. అటు డాక్టర్లకు, ఇటు రోగులకు వాళ్లు నిత్యం అందుబాటులో ఉండాల్సిందే. కానీ వాళ్ల పనిని ఎవరూ గుర్తించరు. ఎన్నో ఏళ్లుగా వీరు వెట్టి చాకిరీకి గురౌతున్నారు. పిహెచ్‌సి, సిహెచ్‌సిలలో 24/7 పేరుతో వీరికి సెలవులు, వీక్లీ ఆఫ్‌ అనేది కూడా లేకుండా వీరితో పని చేయించు కుంటున్నారు. ఆసుపత్రులలో వైద్యులు లేకపోయినా వీరే దగ్గరుండి రోగులకు స్టాఫ్‌ నర్స్‌లు సేవలు అందిస్తున్నారు. ప్రసవాలు చేసేటప్పుడు పక్కన వైద్యులు లేక పోయినా ఎంతో రిస్క్‌ చేసి కాన్పులు చేస్తుంటారు. అనేక ఏళ్లుగా కాట్రాక్ట్‌ పద్దతిన విధులు నిర్వహిస్తున్న వీరిని ఇంత వరకు ప్రభుత్వాలు రెగ్యులర్‌ చేయడం లేదు. విధులు చేసే చోట వీరికి రక్షణ లేదు. వేధింపులకు గురౌతున్నారు. వైద్యులకు, పారామెడికల్‌ సిబ్బందికి ప్రభుత్వ సెలవులు వర్తిస్తాయి. కానీ స్టాఫ్‌ నర్సులకు మాత్రం వర్తించకపోవడం బాధాకరం. పిహెచ్‌సి, సిహెచ్‌సిలలో ఆదివారం కూడా విధులు నిర్వహించాల్సిందే. ముగ్గురు స్టాఫ్‌ నర్సులు ఉండే పిహెచ్‌సిలలోనైతే ఓ స్టాఫ్‌ నర్సు సెలవు తీసుకుంటే ఉన్న ఇద్దరు నర్సులు 12 గంటలు విధుల్లో ఉండాల్సిందే. ఇదేమిటని అడిగిన నర్సులను వేధిస్తున్న సంఘటనలు జిల్లాలో అనేకం. విధులు నిర్వహించే చోట నర్సులకు సరైన సౌకర్యాలు ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులను తక్షణమే రెగ్యులర్‌ చేయాలని నర్సులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
స్టాఫ్‌ నర్సులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులను రెగ్యులర్‌ చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఏళ్ల నుండి పని చేస్తున్న స్టాఫ్‌ నర్సులను రెగ్యులర్‌ చేయాలి. వెట్టి చాకిరీ నుండి విముక్తి కల్పించాలి. స్టాఫ్‌ నర్సులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. పిహెచ్‌సిలలో నైట్‌ వాచ్‌మెన్‌ ఏర్పాటు చేయాలి. స్వీపర్‌ పోస్టులు ఖాళీ ఉండటంతో స్టాఫ్‌ నర్సులతోనే పని చేయిస్తున్నారు. స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో, కాలేజీ ఆప్‌ నర్సింగ్‌లో సీనియర్టీ ప్రకారం బోధనకు స్టాఫ్‌ నర్సులను వినియోగించుకోవాలి. కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులను రెగ్యులర్‌ చేయాలి.
డి. మంజులా దేవి, రాష్ట్ర అధ్యక్షురాలు, ఏపీ ప్రభుత్వ నర్సెస్‌ అసోసియేషన్‌.